నేరాల నియంత్రణను గాలికొదిలేశారు!
- పలువురు ఎస్పీలు/కమిషనర్లపై ఉన్నతాధికారుల ఆగ్రహం
- సున్నితమైన కేసులను వివాదాస్పదం చేస్తున్నారు..
- చిన్న జిల్లాల ఏర్పాటును అర్థం చేసుకోలేకపోతున్నారని అసంతృప్తి
- పనితీరు మార్చుకోవాలని డీజీపీ ఆదేశం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు మరింత సేవలు, పాలన సౌలభ్యంకోసం ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించింది. అయితే ఈ అంశాన్ని పట్టించుకోవడంలో పలువురు ఎస్పీలు/ కమిషనర్లు విఫలమవుతున్నారని పోలీస్‌ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొత్తగా కమిషనర్లు, ఎస్పీలు అయిన అధికారులు కేవలం స్వంత పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని, నేరాల నియంత్రణను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనలు పోలీస్ బాస్‌లను తీవ్ర ఒత్తిడికి గురిచేసినట్టు తెలుస్తోంది.
భూపాలపల్లిలో జరిగిన దుప్పులవేట కేసులో సరైన రీతిలో సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయలేకపోయారని, దీనితో కేసులో రాజకీయ నేతలుండటం వల్లే కేసు పక్కదారి పట్టించారన్న ఆరోపణలకు ఆస్కారం ఇచ్చినట్లయిందని భావిస్తున్నారు. దీనితో జిల్లా బాధ్యులుగా ఉన్న అధికారులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులను దగ్గరుండి పర్యవేక్షించాల్సింది పోయి, పట్టించుకోకుండా ఉన్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో డీజీపీ అనురాగ్‌శర్మకు పలు రాజకీయ పార్టీల నేతలు ఫిర్యాదు కూడా చేశారు. పనితీరు సరిగ్గా ఉంటే ఇలాంటి ఆరోపణలు రావని, ఇక నుంచి సరైన రీతిలో స్పందించాలని డీజీపీ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
మంథని కేసులో వైఫల్యం...
మంథనిలో జరిగిన మధుకర్ మృతి వ్యవహారంలో కమిషనరేట్ ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే విషయం వివాదాస్పదమైందని ఉన్నతాధికా రులు భావిస్తున్నారు. ఘటన జరిగి.. పోస్టుమార్టం అయిన తర్వాత ఆందోళనలు చోటు చేసుకోవడం, రాజకీయంగా కేసులో ఒత్తిడి రావడం.. తదితర అంశాలను పట్టించుకోకుండా కమిషనరేట్ అధికారులు వ్యవహరించారని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. మధుకర్ మృతి కేసులో సంఘటన స్థలానికి కూడా కమిషనర్ వెళ్లకపోవడం, పైగా కొత్తగా విధుల్లో చేరిన ఏసీపీపైనే భారం వేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డీజీపీ అనురాగ్ శర్మ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
ఈ వ్యవహారంలో డీజీపీ స్వయంగా కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు. బాధితుడి కుటుంబాన్ని కలసి విచారణపై నమ్మకం కల్గించేలా దైర్యం చెప్పాలని సూచించడంతో అప్పటికప్పుడు కమిషనర్, మధుకర్ గ్రామానికి వెళ్లినట్టు తెలిసింది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా పనితీరులో కూడా ప్రతిభ చూపాలని ఉన్నతాధికారులు ఎస్పీలు/కమిషనర్లకు సూచించినట్టు తెలిసింది.
పర్యవేక్షణ లోపమే..
ఏ జిల్లాలో అయినా సున్నితమైన కేసులు, వివిధ వర్గాల మధ్య ఘర్షణలు జరిగే కేసులు ఉన్నట్టయితే వెంటనే సంబంధిత ఎస్పీ/కమిషనర్ ఆ విషయాన్ని డీఐజీ, ఐజీ, డీజీపీకి చేరవేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న చాలా మంది ఎస్పీలు, కమిషనర్లు ఏ విషయాన్ని కూడా తగిన పద్ధతిలో ఉన్నతాధికారులకు చెప్పడం లేదని డీజీపీ కార్యాలయంలో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులు కూడా పెద్దగా జిల్లాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని, ఇక నుంచి ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని డీజీపీ ఆదేశించినట్టు తెలిసింది.