అమెరికాను వదలని.. లాడెన్
న్యూయార్క్: బిన్ లాడెన్ చనిపోయిన తరువాత కూడా అమెరికాను భయపెడుతూనే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మరో రూపంలో. ఇంతకూ అసలు విషయంఏమిటంటే.. అప్పుడెప్పుడో 2001 న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను రెండు విమానాలతో లాడెన్ కూల్చిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ ఘటన జరిగి దాదాపు 16 ఏళ్లు అవుతున్నా.. దాని ప్రభావం అమెరికన్ల మీద ఇంకా ఉంది. ఈ ట్విన్‌టవర్స్ కూలిపోవడం వల్ల ఏర్పడ్డ దుమ్ము, ధూళి, ఇతర విషవాయులతో చిన్నారులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తాజా వైద్య నివేదికలు ప్రకటించాయి.
తాజాగా ఎన్‌వైయూ హెల్త్ రీసెర్చ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ హెల్త్ రిజిస్ట్రీ వారు 308 మంది చిన్నారుల ఆరోగ్యంపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. 123 మంది చిన్నారుల్లో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అధిక స్థాయిలో ఉండడం, దుమ్ము, హనికర విషవాయులు రక్తంలో కలిసి ఉండడాన్ని గుర్తించారు. టవర్స్ కూలిపోయే సమయంలో దగ్గరున్న 50 వేల మందిలో గుండెజబ్బులు, క్యాన్సర్ కారకాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.