ఇంతకీ ఆరోజు ఏం జరిగింది..? | 9/11 Attacks facts and summary | Sakshi
Sakshi News home page

ఇంతకీ ఆరోజు ఏం జరిగింది..?

Published Fri, Sep 11 2015 8:56 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఇంతకీ ఆరోజు ఏం జరిగింది..? - Sakshi

ఇంతకీ ఆరోజు ఏం జరిగింది..?

2001, సెప్టెంబర్ 11... తెల్లవారుతోంది. సగం అమెరికా మాత్రం ఇంకా నిద్రలోనే ఉంది. దేశ చరిత్రలోనే పీడకలగా మిగిలిపోనున్న రోజు ఒకటి వస్తుందని ఊహించని అమెరికన్లు ఒళ్లు విరుచుకుంటూ అప్పుడే నిద్రలేచారు. లేచీ లేవడంతోనే రిమోట్ పట్టుకుని టీవీల ముందు కూర్చున్నారు. బయట ఏం జరుగుతోందో మరుక్షణమే వారికి తెలిసొచ్చింది. అంతే.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాము విదేశీయుల ముందు గొప్పగా చెప్పుకొనే ‘జంట సౌధాలు’ ఇక లేవని, తమది అత్యంత పటిష్టమైన రక్షణ విభాగమేమీ కాదని వారికి నెమ్మదిగా అర్థమైంది.

ఇంతకీ ఆరోజు ఏం జరిగింది..?
ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసిన ఘటన 9/11 ఉగ్రదాడి. అమెరికాలోని ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’కు చెందిన 110 అంతస్తుల జంట భవంతులను ఉగ్రవాదులు నేలమట్టం చేసి, వేలాది ప్రాణాలను బలిగొన్న కర్కశ చర్య అది. తమ దేశానికి ఖ్యాతి తెచ్చిన భవంతులను, తమ విమానాలతోనే కూల్చడాన్ని అమెరికన్లు నేటికీ జీర్ణించుకోలేరు. అధికారిక లెక్కల ప్రకారం 3 వేల మందిని ఈ పైశాచిక చర్య బలిగొంది. అందుకే దీన్ని ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకర ఉగ్రదాడిగా అభివర్ణిస్తారు.

ఆరోజు..
సెప్టెంబర్ 11.. తెల్లవారు జామున పంతొమ్మిది మంది హైజాకర్లు బోస్టన్, నెవార్క్, వాషింగ్టన్ డీసీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజిలీస్‌కు వెళ్తున్న నాలుగు వాణిజ్య విమానాల్లోకి ప్రవేశించారు. వీరంతా అల్‌ఖైదాకు చెందినవారు. కరడుగట్టిన ఈ ఉగ్రవాదులు విమానాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. వీటిలో ఒక విమానాన్ని ఉదయం 8.46 గంటల ప్రాంతంలో ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన ఉత్తర భవనంలోకి (టవర్-1) ఢీకొట్టించారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు, ధూళి రేణువులు ఆ ప్రాంతాన్ని కమ్మేయసాగాయి.

ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మరోదాడి జరిగింది. ఈసారి టార్గెట్ దక్షిణ భవనం (టవర్-2). ఉదయం 9.03 గంటలకు ‘యునెటైడ్ ఎయిర్‌లైన్స్ ఫై్లట్ 175’ను దక్షిణ భవంతిలోకి దూసుకుపోనిచ్చారు. అంతే.. చూస్తుండగానే పెద్ద ఎత్తున పొగ, మంటలు చెలరేగి.. గంట వ్యవధిలోనే జంట భవనాలు రెండూ నేలమట్టమయ్యాయి.

మరిన్ని దాడులు..
హైజాకర్ల బృంద నియంత్రణలోని మరోరెండు విమానాలు సైతం భారీ విధ్వంసాల దిశగా పరుగులు తీశాయి. 9.37 గంటలప్పుడు అమెరికాకు అత్యంత కీలకమైన యుద్ధ తంత్ర ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’ మీదికి ‘అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫై్లట్ 77’ దూసుకెళ్లింది. ఈ దాడిలో దాదాపు 125 మంది అధికారులు, సాధారణ పౌరులు మరణించారు. నాలుగో విమానమైన ‘యునెటైడ్ ఎయిర్‌లైన్స్ ఫై్లట్ 93’ అతి క్లిష్టమైన ఉగ్ర బాధ్యతను నెత్తికెత్తుకుంది.

అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్’ లేదా ‘కేపిటల్’ (అమెరికా సంయుక్త రాష్ట్రాల కాంగ్రెస్ భవనం)లో ఒకదాన్ని పేల్చివేయడమే దీని అంతిమ లక్ష్యం. అయితే, ఈ విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది హైజాకర్లపై ఎదురుతిరగడంతో 10.03 గంటల ప్రాంతంలో షాంక్స్‌విల్లే, పెన్సిల్వేనియా సమీపంలో కుప్పకూలింది. దీంతో అమెరికా మనుగడకు అతిపెద్ద ముప్పు తప్పినట్టైంది.

మరణాలు..
ఈ వరుస దాడుల్లో మొత్తం 2,996 మంది అక్కడికక్కడే మరణించారు. వీరిలో 2,977 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు ఉన్నారు. నాలుగు విమానాల్లోని 246 మంది ప్రయాణికులూ మరణించారు. ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ఈ దాడిలో ఒక్క అమెరికన్లే కాక, 90కి పైగా దేశాలు తమ తమ పౌరుల్ని కోల్పోయాయి. ఈ దాడుల్లో రేగిన దుమ్ముధూళిని పీల్చడం వల్ల ఎందరో అస్వస్థతకు గురయ్యారు.

నష్టం..
ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన జంట భవనాలతో పాటు ఇతర భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ 7,6,5,4 భవనాలతో పాటు మారియట్ ప్రపంచ వాణిజ్య సంస్థ-3 కూడా ఉంది. ఇక్కడి చాలా వరకూ భవనాలు విషవాయువుల కారణంగా నేటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. వీటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే చర్యలు చేపడుతున్నారు.

కారకులు..
దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా విచారణ సంస్థ ‘ఎఫ్‌బీఐ’ కుట్రదారుల పేర్లు వెల్లడించింది. ఈజిప్ట్‌కు చెందిన మహ్మద్ అట్టా 19 మంది హైజాకర్లు, ఒక పైలట్‌కు నాయకత్వం వహించాడు. ఈ దాడిలో అట్టా హతమయ్యారు. అయితే, అతని సామాను మాత్రం వేరే విమానంలో లభ్యమవడంతో కుట్ర బయటపడింది. 19 మంది హైజాకర్లు, వారి నేపథ్యాలు, లక్ష్యాలకు సంబంధించిన సమాచారం ఈ పత్రాల్లో ఉంది. వీరిలో 15 మంది సౌదీ అరేబియాకు చెందిన వారు కాగా, ఇద్దరు యూఏఈ, ఈజిప్టు, లెబనాన్ దేశాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

అల్‌ఖైదా..
ఉగ్రసంస్థ అల్‌ఖైదా ఈ దాడుల వెనక ప్రధాన పాత్ర పోషించింది. సెప్టెంబర్ 11 దాడుల ప్రధాన సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్. ఈ వ్యూహాన్ని 1996లో అతడు అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు వివరించాడు. అయితే, కొన్ని కారణాల రీత్యా 1999లో అతనికి లాడెన్ నుంచి అనుమతి లభించింది. అప్పటి నుంచి వరుస సమావేశాలు జరిగాయి. హైజాకర్లను ఏర్పాటు చేయడం, శిక్షణ లాంటి పనులను మహ్మద్ చూసుకున్నాడు. ఆశ్చర్యకర విషయమేంటంటే.. అమెరికా నిఘా విభాగం 1998 డిసెంబర్‌లోనే విమానాల దారి మళ్లింపు, అమెరికాపై దాడులు లక్ష్యంగా అల్‌ఖైదా పనిచేస్తున్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కూడా వివరించడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement