
ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు
జంట టవర్లు నిర్మించ తలపెట్టిన స్థలంపై సుప్రీంకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో పోలీసుల కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో జంట టవర్లు నిర్మించ తలపెట్టిన స్థలంలో రెండు వారాల పాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ స్థలంపై యాజమాన్య హక్కులు కోరుతూ క్రమబద్ధీకరణ కోసం ప్రైవేటు వ్యక్తులు పెట్టుకున్న దరఖాస్తుపై తగిన ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోమని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలను కాపాడినట్లవుతుందని కోర్టు పేర్కొంది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జగదీశ్‌సింగ్ ఖెహర్, జస్టిస్ సి.నాగప్పలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల కోసం ప్రభుత్వం ఏ స్థలం అయితే జంట టవర్ల నిర్మించాలని తలపెట్టిందో ఆ స్థలం తమదని, ఈ స్థలం క్రమబద్ధీకరణకు తాము పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్‌కు చెందిన మీర్ ఇక్బాల్ ఆలీ, మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్ జడ్జి, జంట టవర్లు నిర్మిస్తున్న స్థలంపై పిటిషనర్లు యాజమాన్య హక్కులు కోరుతున్న నేపథ్యంలో, 4 వారాల పాటు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరిస్తూ జారీ చేసిన మెమోలో తిరస్కరణకు కారణాలు చెప్పలేదని సింగిల్ జడ్జి తప్పుపట్టారని, కాబట్టి తాము ఆ మోమోను ఉపసంహరించుకుని మళ్లీ సరైన కారణాలతో మెమో జారీ చేస్తామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం 8 వారాల్లోపు పిటిషనర్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుపై తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మీర్ అలీ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ ఖెహర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుపై నిర్ణయం వెలువరించేంత వరకు జంట టవర్లు నిర్మించ తలపెట్టిన స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోమని తెలిపారు. దరఖాస్తుపై నిర్ణయాన్ని పిటిషనర్లకు తెలియజేయాలంటూ మీర్ అలీ తదితరులు దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను పరిష్కరించింది.