పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం షాక్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర బలగాలను మోహరించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఎన్నికలను నిర్వహించడమంటే.. హింసకు లైసెన్స్ ఇవ్వడం కాదని పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ)ని ధర్మాసనం తప్పుబట్టింది. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం ఎస్‌ఈసీ విధి అని స్పష్టం చేసింది.
హింస జరిగిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ సంయుక్తంగా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాళు చేస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఇందులో ఎలాంటి తప్పు లేదని తీర్పులో పేర్కొంది.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు..సుప్రీంను చేరిన బెంగాల్ ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికల నామినేషన్ వేళ రాష్ట్రంలో హింస చెలరేగింది. జూన్ 9న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా బెంగాల్ అంతటా పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. అల్లరిమూకలు బాంబులు విసిరారు. ఇందులో 9 మంది మృతి చెందారు. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, సీపీఐఎంలు అధికార టీఎంసీని విమర్శించాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులకు వ్యతిరేకంగా ప్రభుత్వమే అందోళనకారులకు మద్దతునిస్తోందని ఆరోపించారు.
జులై 8న పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 75వేల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 61 వేల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. జులై 11న ఒట్ల లెక్కింపు జరగనుంది.
ఇదీ చదవండి: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు.. బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య
Comments
Please login to add a commentAdd a comment