న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుల్డోజర్ యాక్షన్‌పై స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ప్రభుత్వాలను ఆదేశించింది.
దేశంలోని ప్రేవేటు స్థలాల్లో అనధికారిక బుల్డోజర్ చర్యను అక్టోబర్ 1 వరకు నిలిపివేయాలని తెలిపింది. అయితే ఈ తీర్పు వల్ల ఇప్పటికే కూల్చివేసేందుకు ప్రక్రియ పూర్తయిన పనులు ప్రభావితం కావచ్చని ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేయగా.. దీనిని న్యాయస్థానం తోసిపుచ్చింది.
తదుపరి విచారణ వరకు కూల్చివేతలు ఆపడం వల్ల.. స్వర్గమేమి ఊడిపడదంటూ (పెద్ద నష్టం ఏం జరగదని) జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, చెరువులు, ఇతర వాటిపై ఎలాంటి అనధికార నిర్మాణాలకు తమ ఆదేశాలు వర్తించవని కోర్టు పేర్కొంది. వీటిని ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది.
‘తదుపరి తేదీ వరకు ఈ కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టకూదు. అయితే బహిరంగ వీధులు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్‌లు, బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక నిర్మాణాలపై చర్యలకు ఈ ఉత్తర్వులు వర్తించవు’ అని కోర్టు స్పష్టం చేసింది.
కాగా వివిధ నేరాలకు పాల్పడిన నిందితుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చివేతలు చేపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి.
ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు వివిధ రాష్ట్రాలు చేపట్టిన ‘బుల్డోజర్ చర్యల’పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కూల్చివేత డ్రైవ్‌లను సవాలు చేస్తూ దాఖలైన వరుస పిటిషన్‌లపై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తాజా ఉత్తర్వులు వెలువరించింది.
అయితే దీనిపై ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసులు జారీ చేస్తామని వెల్లడించింది. వరుసగా జమ్మూ కశ్మీర్, హర్యానా మహారాష్ట్ర, జార్ఖండ్‌కు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈసీకి నోటీసీలు ఇస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ రాష్ట్రాల్లో చాలా చోట్ల బీజేపీ అధికారంలో ఉంది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, సీయూ సింగ్ వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment