
సమాజం సహించలేని కొన్ని ఘటనలు ఆవేదన కలిగిస్తాయి. ఆగ్రహం రప్పిస్తాయి. చట్టాలెన్ని ఉన్నా ఆగకుండా సాగుతున్న అకృత్యాలపై ఏమీ చేయలేమా అన్న ఆక్రోశం రగిలిస్తాయి. కోల్‌కతా వైద్యశిక్షణార్థి ‘అభయ’ ఘటన నుంచి దేశం ఇంకా తేరుకోక ముందే, మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో పసిపిల్లల పాఠశాలలో నాలుగేళ్ళ వయసు చిన్నారులు ఇద్దరిపై పాఠశాల పనివాడి అమానుష కృత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన వివరాలు వింటుంటేనే మనసు వికలమవుతుంది.
ప్రజా నిరసనల రీత్యా మహారాష్ట్ర సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది సరే, పిల్లలకు బడిలోనే భద్రత లేకపోతే ప్రతి ఒక్కరికీ విద్యాహక్కు గురించి చర్చిస్తే ఏమి లాభమన్న బొంబాయి హైకోర్ట్ తాజా వ్యాఖ్యలు నిష్ఠురమైనా నిజమే. ఇప్పుడిక ప్రతి స్కూలులో నెలరోజుల్లోగా సీసీ టీవీ కెమెరాలు పెట్టాలి, వారంలో మూడుసార్లైనా ఆ ఫుటేజ్‌ను పరిశీలించాలి లాంటి సర్కారీ ఆదేశాలు షరా మామూలే. కానీ, కోల్‌కతా నుంచి బద్లాపూర్ దాకా అన్నిచోట్లా రాజ్యవ్యవస్థ చేతిలో ప్రజావిశ్వాసం కుప్పకూలడం సమకాలీన భారత విషాదం.
పసిపిల్లలపై అకృత్యం జరిగితే, ఆ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సహకరించడానికి బదులు సదరు ‘ఆదర్శ విద్యాలయం’ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం విషాదం. విద్యాబుద్ధుల కోసం బడికి పిల్లల్ని పంపి, వారు అక్కడ భద్రంగా ఉంటారని భావించే కన్నవారికి ఇది భరించలేని కష్టం. పైగా, ఫిర్యాదు దాఖలుకు వారిని 11 గంటల పైగా వేచి ఉండేలా చేయడం దేనికి సంకేతం? ఇలాంటి ఘటనల్లో పాఠశాల వారినీ బాధ్యుల్ని చేస్తూ, ‘పోక్సో’ చట్టం కింద కేసు కట్టాలి.
ఆ కనీస బాధ్యతను సైతం పోలీసులు విస్మరించడం క్షమించరాని దుర్మార్గం. చివరకు బొంబాయి హైకోర్ట్ ఆ లోపాన్ని ఎత్తిచూపాల్సి వచ్చింది. ‘అభయ’ ఘటనలోనూ అచ్చంగా ఇలాంటివే జరిగాయి. ఇలాంటి ఆటవిక చర్యలు ఎక్కడ జరిగినా జెండాలకు అతీతంగా రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాల్సి ఉండగా, స్వీయ రాజకీయలబ్ధికై ప్రయత్నించడం సిగ్గుచేటు. కోల్‌కతా ఘటనపై రచ్చ చేసే పార్టీ బద్లాపూర్‌పై నోరు మెదపదు.
త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని బద్లాపూర్‌పై హంగామా చేసేవారు కోల్‌కతా ఘటనపై కంటితుడుపుకే పరిమితమవుతారు. రాజ్యాంగబద్ధ హోదాలోని బెంగాల్ గవర్నర్ టీవీ డిబేట్లలో కూర్చొని రాష్ట్ర సర్కార్‌ను దూషిస్తూ ఇంటర్వ్యూలిస్తుంటే ఏమనుకోవాలి? సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలపైనా నిజాయతీ వదిలేసి నీచ రాజకీయాలు చేస్తే దేశం ఏటు పోతుంది?
ఉవ్వెత్తున ఎగసిపడ్డ భారీ నిరసనల నేపథ్యంలో కోల్‌కతా అంశంపై సుప్రీమ్ కోర్ట్, బద్లాపూర్ ఘటనపై బొంబాయి హైకోర్ట్ తమకు తాము స్వచ్ఛందంగా విచారణ చేపట్టడమే ఒకింత ఊరట. న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల్లో మినుకు మినుకుమంటున్న ఆశాదీపానికి కోర్టు చొరవ ఒక చిన్న కాపుదల. ఇవాళ దేశంలో రోజూ 90 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆనక హత్య చేసి, అడ్డు తొల గించడాలూ పెరిగిపోతున్నాయి.
నోరు విప్పి చెప్పుకోలేని వారి పట్ల నీచప్రవర్తనలూ పెచ్చరిల్లుతున్నాయి. మన మధ్యే మామూలు వ్యక్తుల్లా తిరుగుతున్న మానవ మృగాలను నిరోధించడం కఠిన సమస్యే. అయితే, మనసుంటే మార్గాలుంటాయి. మహిళలు, పిల్లల కోసం ‘మినీ – పోలీస్ స్టేషన్ల’ను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం లాంటివి సిఫార్సు చేస్తున్నాయి.
సుప్రీమ్ కోర్ట్ గురువారం బెంగాల్ సర్కార్‌కు ముక్కచీవాట్లు పెట్టిన నేపథ్యంలో సీఎం మమత సైతం తీవ్రతను అంగీకరించారు. అత్యాచార నేరాలపై అత్యంత కఠిన చట్టాలు చేయాలనీ, ఇలాంటి కేసుల్ని 15 రోజుల్లో పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టాలనీ ప్రధానిని కోరారు.
అంతకన్నా ముందు సమాజంగా మనం ఆత్మశోధన చేసుకోవాలి. 2012 నాటి ‘నిర్భయ’ ఘటన తర్వాత కఠినచట్టాలు చేసినా పరిస్థితులు మారలేదంటే లోపం ఎక్కడున్నట్టు? వావివరుసలు లేవు, వయసులో చిన్నాపెద్దా విచక్షణ లేదు, చట్టం పట్ల భయభక్తులు అసలే లేవు.
ఇలా ఉచ్చం నీచం మరిచి, చివరకు చిన్నారులపైనా మనుషులు మృగాలుగా మారడానికి దారి తీస్తున్న సాంఘిక, మానసిక పరిస్థితుల్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన వెనకాలే ఊడలు దిగుతున్న ఈ వికృత ధోరణిని పెంచి పోషిస్తున్న మన వినోద, వినిమయ సంస్కృతులు, వైయక్తిక ప్రవర్తనల్ని సమీక్షించుకోవాల్సి ఉంది. ఈ భూతాన్ని ఆపేదెలా అని సత్వరమే ఆలోచించాల్సి ఉంది.
ఇప్పటికీ ఆడవాళ్ళను ఆటవస్తువులుగా చూసే సామాజిక వైఖరి, మగవాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనే ఆధిపత్య భావజాలం లాంటి అనేక అంశాల్లో మనం మారాల్సి ఉంది. కోర్టుల చొరవ, ఆదేశాలతో రానున్న రోజుల్లో కోల్‌కతా కేసు, బద్లాపూర్ కేసులు త్వరితగతినే తేలితే తేలవచ్చు. నిందితులకు కఠిన శిక్షలూ ఖాయం కావచ్చు.
కానీ, దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ ఒకటి రెండు కేసుల్లోనే కాదు... వెలుగులోకి రాని వందల ఘటనలకు మూలకారణమైన మౌలిక అంశాలపై మనం ఎప్పటికి కళ్ళు తెరుస్తాం? సాక్షాత్తూ శిష్యులపై రేప్‌తో 20 ఏళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు హర్యానాలో ఎన్నికల వేళ పదేపదే పెరోల్ ఇస్తూ పోతుంటాం.
గత నాలుగేళ్ళలో 234 రోజులు ఆయన జైలు బయటే ఉన్నారు. మైనర్ బాలిక రేప్ కేసులో జీవిత ఖైదులో ఉన్న మరో బాబా ఆశారామ్ బాపూను ఆయుర్వేద చికిత్సకై తాజాగా బయటకు వదులుతాం. అన్ని వ్యవస్థలనూ నీరుగార్చి, అధికారం సహా అనేక బలహీనతలతో పాలకులు చేసే ఈ పాపాలన్నీ శాపాలు కాక మరేమవుతాయి? జనం మూడోకన్ను తెరవాల్సిన సమయం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment