హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో పోలీసుల కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టదలచిన ట్విన్ టవర్స్(జంట టవర్ల) నిర్మాణంపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. జంట టవర్ల నిర్మాణానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జంట టవర్ల నిర్మాణ పనులు చేస్తున్న స్థలంపై ప్రైవేటు వ్యక్తులు యాజమాన్యపు హక్కులు కోరుతున్న నేపథ్యంలో ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులు అత్యంత దారుణమైనవని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆ ఉత్తర్వులు ఒక్క నిమిషం కూడా అమల్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
పిటిషనర్లు పెట్టుకున్న క్రమబద్దీకరణ దరఖాస్తును తిరస్కరించడానికి కారణాలు వివరిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చెప్పడంతో, సింగిల్ జడ్జి ముందు తాము దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్లు అంగీకరించారు.
ఈ నేపథ్యంలో క్రమబద్దీకరణ కోసం పిటిషనర్లు పెట్టుకున్న దరఖాస్తు విషయంలో 8 వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఆదేశాలతో అటు సింగిల్ జడ్జి వద్ద ఉన్న పిటిషన్, ఇటు అప్పీల్‌ను పరిష్కరిస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.