నోయిడా ట్విన్ టవర్ కేసు చిత్రవిచిత్ర మలుపులు తీసుకుంటోంది. అక్రమంగా నలభై అంతస్థుల భవనం నిర్మించారంటూ కోర్టుకు వెళ్లిన వాళ్లకు న్యాయం దక్కేట్టు కనిపిస్తున్నా అంతకు మించి ఎన్నో చిక్కులు ఎదురవుతున్నాయి. అసలెందుకు ఈ కేసు వేశాంరా బాబు అన్నట్టుగా మారింది వాళ్ల పరిస్థితి. నోయిడా అధికారుల నిర్లక్ష్యం, రియల్టర్ల అత్యాశ చివరికి అందరికీ కష్టాలను కొని తెచ్చింది.
అక్రమ నిర్మాణం
నోయిడాలో ఎమరాల్డ్ ఫేజ్‌లో అనేక అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అయితే ఇదే సముదాయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సూపర్‌టెక్ అనే సంస్థ నలభై అంతస్థుల జంట భవనాల నిర్మాణం చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు కోర్టులను ఆశ్రయించారు. చివరకు నాలుగైదేళ్ల తర్వాత భవన నిర్మాణం అక్రమం అంటూ సుప్రీం కోర్టు 2022 ఫిబ్రవరిలో తేల్చింది. అప్పటికే దాదాపు 39వ అంతస్థు వరకు నిర్మాణం పూర్తయ్యింది.
సాగుతున్న కూల్చివేత
కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ జంట భవనాలు కూల్చేయాల్సి 2022 మే 21న కూల్చేయాల్సి ఉంది. ఆ పనుల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎమారాల్డ్ ఫేజ్‌లోకి వెళ్లే నాలుగు దారుల్లో మూడు దారులు మూసి వేశారు. కేవలం ఒక్కటి మాత్రమే తెరిచి ఉంచారు. ముందుగా నిర్దేశించిన గడువు మే 21లోగా కూల్చివేత సాధ్యం కాదని తేలడంతో ఈ గడువును ఆగష్టు వరకు పొడిగించారు.
కష్టాల్లో స్థానికులు
దారులు మూసివేయడం వల్ల ఎమరాల్డ్ ఫేజ్‌లో ఉన్న నివాసాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు టెస్ట్ బ్లాస్టింగ్స్, ఇతర పనుల కారణంగా నిత్యం ట్విన్ టవర్స్ నుంచి దుమ్ము రేగుతూ అక్కడున్న వారికి చికాకులు తెచ్చి పెడుతున్నాయి. పైగా కూల్చివేత పనులు దక్కించుకున్న సంస్థ భారీ ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగించాల్సి ఉంటుందని చెప్పడం మరింత సందేహాలను లేవనెత్తింది. ట్విన్ టవర్స్ పేల్చి వేత వల్ల తమ ఇళ్లకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయో ఏమో అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
మాగోడు వినండి
ట్విన్ టవర్స్ కూల్చివేత వ్యవహారంలో తమ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలంటూ అక్కడి వారు నోయిడా అధికారులను కోరారు. దీంతో 2022 జూన్ 7న ట్విన్ టవర్స్ నిర్మించిన సూపర్‌టెక్ సంస్థ, కూల్చివేత పనులు చేపడుతున్న ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ, స్థానికులతో కలిసి నోయిడా అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక ఆందోళనలకు పరిగణలోకి తీసుకుని కూల్చివేత పనులు చేపట్టాలని ఇందులో కోరనున్నట్టు సమాచారం. మరి ఈ సమావేశం తర్వాత ఈ భవనాల కూల్చివేత అంశం మరే మలుపు తీసుకుంటుందో చూడాలి.
చదవండి: ఇంకా పేలుడు పదార్థాలు కావాలి.. అప్పుడే ఆ పని చేయగలం!
Comments
Please login to add a commentAdd a comment