నిమ్స్ లో ట్విన్ టవర్లు
♦ విదేశీ రోగుల చికిత్సకు ప్రత్యేకం
♦ ప్రతిపాదనలు సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ
సాక్షి, హైదరాబాద్: వైద్య సేవల రంగంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకా రం చుడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ‘మెడికల్ టూరిజం’కు విసృ్తత ప్రాచుర్యం కల్పిం చేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా విదేశాల నుంచి రోగులను ఆకర్షించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. ప్రత్యేకంగా వీరికి వైద్య చికిత్సలు అందించేందుకు నిమ్స్ ప్రాంగణంలో జంట టవర్లు నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్ ఆస్పత్రులు కొన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్య చికిత్సలు అందిస్తున్నాయి.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అంద రి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అందుకే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుం చి వైద్యం కోసం హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య పర్యాటక గమ్యస్థానంగా మారుతోందని ఇటీవల సామాజిక ఆర్థిక సర్వేలోనూ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో అందుబాటులో ఉన్న అవకాశాలను ఆదాయ మార్గంగా మలుచుకునేందుకు మెడికల్ టూరిజంపై దృష్టి సారిస్తోం ది. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే విదేశీ రోగులకు అత్యాధునిక వైద్యం అందించేలా ఆలోచిస్తోంది. దీంతో ఆదాయం తో పాటు టూరిజంలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది సర్కారు ఆలోచన. గల్ఫ్ దేశాల్లో వైద్యం చాలా ఖరీదుతో కూడుకున్న అంశం. దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాలతో పోలిస్తే రాష్ట్రంలో వైద్య ఖర్చులు చాలా తక్కువ.
విదేశాల నుంచి ఎక్కువగా ఆప్తాల్మజీ, నెఫ్రాలజీ, కార్డియాక్ సమస్యలతో పాటు ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఎక్కువ మంది నగరానికి వస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా కార్పొరేట్ ఆస్పత్రులతో దీటైన వైద్యాన్ని తక్కువ ధరకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగానే నిమ్స్‌లో జంట టవర్లను నిర్మించే ప్రతిపాదనలు తయారు చేసింది. విదేశీ రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వీలుగా వీటిని అత్యాధునికంగా నిర్మిస్తారు. అంతర్జాతీయ స్థాయి వసతులతో పాటు రోగుల వెంట వచ్చే సహాయకులకు ఇందులో అన్ని సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది.
ఎర్రమంజిల్‌లో ఇప్పటికే నిమ్స్‌కు కేటాయించిన స్థలాన్ని ‘ఇంటర్నేషనల్ టవర్స్’ నిర్మాణానికి వినియోగించనున్నారు. నిర్మాణాలకు సంబంధించి రెండు మూడు డిజైన్లను వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే తయారు చేయించింది. ఈ ప్రతిపాదనలను ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు పంపించింది. వీటితో పాటు నిమ్స్‌లో ఈ-లైబ్రరీ, మినీ ఆడిటోరియం, స్టేడియం, డాక్టర్లు నివాసముండేందుకు క్వార్టర్లు నిర్మించాలని విడివిడిగా ప్రతిపాదనలను రూపొందించింది.