మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో నేరుగా నియామకాలు
⇒ 519 వైద్య పోస్టుల భర్తీకి ప్రతిపాదన
⇒ రంగం సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో వైద్య సిబ్బంది పోస్టులను నేరుగా భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. వైద్య పోస్టులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తుండగా మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి మాత్రం నేరుగా భర్తీ చేయాలని నిర్ణయిం చారు. గత ఏడాది ప్రభుత్వం ఆ కాలేజీకి పాక్షిక స్వయం ప్రతిపత్తి ఇచ్చిన నేపథ్యంలో నేరుగా నియామకాలు జరుపుకొనే వీలు కలిగింది. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెంటనే ఖాళీలను భర్తీ చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం ప్రారంభంలో 462 మంజూరు పోస్టులుండగా మరో నాలుగేళ్ల కోసం అదనంగా 519 పోస్టులు ప్రతిపాదించారు. అందులో 118 టీచింగ్, 401 నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. వీటిని వీలైనంత త్వరలో భర్తీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. 2016–17 విద్యా సంవత్సరం నుంచి మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
రిటైర్ అయ్యే వరకు అక్కడే పనిచేయాలి
ప్రస్తుతం నిమ్స్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థనే. కర్ణాటకలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అను బంధ బోధనాసుపత్రులు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల్లో చేరే వారు చాలా మంది నెలలు గడ వక ముందే తమ ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ లేదా డిప్యుటేషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో మారుమూల మెడికల్ కాలేజీ లకు వైద్యు లు, ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. మెడికల్ విద్యార్థులు, బోధనాసు పత్రుల్లోని రోగులు ఇబ్బందులు పడక తప్పట్లేదు. మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ఇందుకు భిన్నంగా కొత్తగా ఎవరు ఉద్యోగంలో చేరినా రిటైర్ అయ్యేంత వరకు సంబంధిత కాలేజీ లేదా బోధనాసుపత్రిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇతర చోట్లకు బదిలీలు ఉండవు. అందుకు సిద్ధమయ్యే వారే చేరాల్సి ఉంటుంది. దీంతో బదిలీల సమస్య ఉండకుండా పూర్తి స్థాయిలో ఈ కాలేజీపైనే దృష్టి సారించే వీలుంటుంది.