చిగురు నొప్పంటే.. దవడ తొలగించారు!
- 16 సార్లు ఆపరేషన్ చేశారు
- వైద్యుల నిర్లక్ష్యంతో జీవితం నాశనమైపోయింది
- అధికారులే అమెరికాకు పంపి వైద్యం చేయించాలి
- నిమ్స్ పాత భవనం ఎక్కి యువకుడు హల్‌చల్
హైదరాబాద్: పంటి చిగురు నొప్పి ఉందని నిమ్స్‌కు వస్తే దవడ తొలగించారని, 16 సార్లు ఆపరేషన్ చేసి ప్రస్తుతం తమవల్ల కాదు అమెరికాకో, చైనాకో వెళ్లి వైద్యం చేయించుకోమ్మంటున్నారని ఓ బాధితుడు నిమ్స్ పాతభవనం ఎక్కి దూకేందుకు యత్నించాడు. వైద్యుల నిర్లక్ష్యంతో తన జీవితం నాశనమైందని, దానికి బాధ్యత వహిస్తూ వైద్యులే అమెరికాకు పంపి చికిత్స చేయించాలని రెండున్నర గంటలపాటు హల్ చల్ చేశాడు. నిమ్స్ ఉన్నతాధికారులు, పోలీసులు ఎంతమంది నచ్చజెప్పినా వినకపోవడంతో చివరికి చికిత్స అందిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.
అనంతరం వివరాలను బాధితుడు మీడియాకు వెల్లడించాడు. కుత్బుల్లాపూర్‌కు చెందిన శీలం ప్రదీప్ (27).. 2007లో పంటి చిగురు వద్ద ఉండే నరం వాచి తీవ్ర నొప్పి ఉండడంతో నిమ్స్‌కు వచ్చాడు. నిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ విభాగ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా.. వికటించడంతో మరో శస్త్రచికిత్స నిర్వహించి దవడ, కింది దంతాలను తొలగించారు. కాళ్లు, చేతుల వద్ద కండరాలు తీసి దవడ వద్ద అమర్చేందుకు 16 సార్లు ఆపరేషన్ చేశారు. మొదట ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ జరిగినా తర్వాత మూడున్నర లక్షలకు పైగా ఖర్చయింది. ప్రస్తుతం వైద్యులను సంప్రదిస్తే మ్యాక్సో ఫేషియల్ సర్జరీ చేయాలని, దానికి ఇక్కడ చికిత్స లేదని చైనాకో, అమెరికాకో వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారని ప్రదీప్ వాపోయాడు. తనకు హిమోగ్లోబిన్ లెవల్ కూడా పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై తాను న్యాయస్థానానికి కూడా వెళ్లినట్లు బాధితుడు తెలిపారు.
భవనం పైనుంచి దూకేందుకు యత్నం...
శనివారం ఉదయం 7:30 ప్రాంతంలో నిమ్స్ పాత భవనం 4వ అంతçస్తులోని ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి వచ్చిన ప్రదీప్, వార్డు లోపలి నుంచి రేయిలింగ్ ద్వారా భవనం పైకి ఎక్కి దూకేందుకు యత్నించాడు. గమనించిన సెక్యురిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న నిమ్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ అతన్ని సముదాయించే యత్నం చేశారు. తనకు లిఖిత పూర్వక హామీ కావాలని, ఎవరైనా దగ్గరకు వస్తే కిందకు దూకుతానని హెచ్చరించాడు.
చొరవచూపిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ ...
సాక్షి బంజారాహిల్స్ జోన్ ఫోటోగ్రాఫర్ దయాకర్.. అతను నిలబడ్డ చోటుకు సమీపం వరకు వెళ్లి సుమారు అరగంట పాటు మాట్లాడి సమస్య పూర్తిగా తెలుసుకుని ఆత్మహత్య సరికాదని కౌన్సెలింగ్ ఇచ్చాడు. అంతలోపు నిమ్స్ యాజమాన్యం వైద్యం చేయిస్తామని ఓ లేఖ తయారు చేసి తీసుకురాగా, దయాకర్ దాన్ని తీసుకుని అతనికి ఇచ్చాడు. నెమ్మదిగా మాటల్లో పెట్టి పట్టుకోగానే పోలీసులు వెళ్లి అతన్ని కిందకు తీసుకువచ్చారు. 7:30కి భవనం ఎక్కిన ప్రదీప్ 9:55కు కిందకు వచ్చాడు. పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు.