
సాక్షి, హైదరాబాద్: బొక్కల దవాఖానాగా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక నిమ్స్(నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ఆస్ప త్రి అందుకు తగ్గట్లుగానే ఎముకల చికిత్సల విభాగంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా చికిత్సలు చేయడమే కాదు.. టాప్–5 ఆస్పత్రుల జాబితాలో చోటు సంపాదించింది. ఈ చికిత్సల్లో ఎయిమ్స్ మొద టిస్థానంలో ఉండగా, తమిళనాడులోని వేలూరు సీఎంసీ రెండోస్థానంలో, చండీగఢ్‌లోని పీజీఐ మూడోస్థానంలో నిలిచాయి.
ఆ తర్వాతిస్థానంలో నిమ్స్ ఉన్నది. అత్యంత క్లిష్టమైన స్పైన్ స్కోలియోటిక్ (వెన్నెముక వంకరగా ఉండటం) చికిత్సల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఆర్థోపెడిక్ విభాగంలో గతేడాది 3 వేలకుపైగా సర్జరీలు నిర్వహించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కేవ లం రెండుశాతం చికిత్సలు జరుగగా, 98 శాతం కేసులు ఇక్కడే జరుగుతున్నాయి. ఈ చికిత్సకు కార్పొరేట్ దవాఖానాల్లో రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుండగా నిమ్స్‌లో కేవలం రూ.1.5 లక్షలకే నిర్వహిస్తున్నారు. మోకాలు, కీళ్ల మార్పిడి చికిత్సలకు నిమ్స్‌లోని ఆర్థోవిభాగం ప్రత్యేక గుర్తింపు పొందింది.