- బయటకు వెళ్లి మందులు తెచ్చుకుంటున్న రోగులు
- ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అడ్వాన్స్ సొమ్ము వసూలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలందించే నిమ్స్‌కు నిర్లక్ష్యం జబ్బు పట్టుకుంది. వసతులున్నా వాటిని వినియోగించుకోకపోవడంతో రోగులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. రెండు మెడికల్ షాపులను నిమ్స్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. కానీ వాటిని ఉదయం 9 గంటలకు తెరిచి సాయంత్రం ఐదారు గంటలకే మూసేస్తున్నారు.
దీంతో రోగులు తమకు కావాల్సిన మందులను బయటకెళ్లి కొని తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ప్రైవేటు మెడికల్ షాపులకు వరంగా మారింది. నిమ్స్ మెడికల్ షాపులను త్వరగా మూయడం వెనుక ఆర్థిక లాలూచీ ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. 24 గంటలూ అందుబాటులో ఉంచాల్సిన మందుల దుకాణాలను నిర్ణీత సమయానికి పరిమితం చేయడంపై రోగులు మండిపడుతున్నారు.
పడకల కోసం పైరవీలు: నిమ్స్‌లో రెండేళ్ల క్రితం 200 పడకలు ట్రామాకేర్‌లో, 300 పడకలు స్పెషాలిటీ విభాగంలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో వంద పడకల వరకు వినియోగిస్తున్నారు. మిగిలిన 400 పడకలు ఖాళీగా ఉన్నాయి. అయినా రోగులు పడకల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల పైరవీ లెటర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. 400 పడకలను వినియోగంలోకి తెచ్చే ఏర్పాట్లే చేయడం లేదు. వాటిని వినియోగంలోకి తేవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇప్పటికే రెండుసార్లు అధికారులను ఆదేశించారు. కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. స్పెషాలిటీ, ట్రామాకేర్‌లలో మూడు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. కానీ రెండేళ్లుగా అవి నిరుపయోగంగా ఉన్నాయి. ట్రామాకేర్‌లో సీటీస్కాన్, ఎంఆర్‌ఐ ఉండాలి. కానీ ఈ రెండూ లేకరోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అడ్వాన్సు వసూలు
నిమ్స్‌కు రోజుకు వెయ్యిమందికిపైనే రోగులు వస్తుంటారు. అందులో 50 శాతం మంది ఆరోగ్యశ్రీ అర్హత కలిగినవారే. ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకుందామని వచ్చిన రోగుల నుంచి సాంకేతిక కారణాలు చూపించి అడ్వాన్సు సొమ్ము వసూలు చేస్తున్నారు. ఈ ఫీజుతోనే పరీక్షలు చేస్తున్నారు. ఆ తరువాత ఆరోగ్యశ్రీ నుండి బిల్లులు వచ్చినా రోగులకు చెల్లించడం లేదు.
ఇదిలావుంటే ఆరోగ్యశ్రీ కిందకు రాని జబ్బులతో ఎవరైనా వస్తే వారికి చికిత్స చేసేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. వాస్తవానికి బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండి ఆరోగ్యశ్రీ కింద లేని జబ్బులతో ఎవరైనా వస్తే వారికి చికిత్స చేసేందుకు ఈ సొమ్మును ఖర్చు చేయాలి. కానీ బిల్లు ఎక్కువైనా వారికి డి స్కౌంటు రూపంలో ఇచ్చిన మొత్తాన్ని ఇందులో నుంచి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఐదు దాటితే నిమ్స్‌లో ఔషధ దుకాణాలు బంద్
Published Sun, Aug 16 2015 3:13 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement