ఏళ్ల తరబడి ఆలోచన.. ఇంజనీర్ల ప్లాన్లు.. వందల నుంచి వేల మంది కూలీల కష్టం. దాదాపు మూడేళ్లపాటు శ్రమించి నిర్మించిన బిల్డింగులు. అలాంటి ఆకాశ హర్మ్యాలను కేవలం.. తొమ్మిదంటే తొమ్మిదే సెకండ్లలో నేలమట్టం నేల మట్టం చేయబోతున్నారు. అయితే తమకిది సింపుల్ వ్యవహారం అంటున్నారు సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం బటన్ నొక్కనున్న చేతన్ దత్తా.
ఆగస్టు 28, నొయిడా(New Okhla Industrial Development Authority) 93A సెక్టార్‌లోని జంట టవర్లు పేకమేడల్లా కూలిపోనున్నాయి. సూపర్‌టెక్ ట్విన్ టవర్‌లను కూల్చివేయడానికి బటన్‌ను నొక్కడం.. ఒక సాధారణ ప్రక్రియ అని అంటున్నారు బ్లాస్టింగ్ వ్యవహారాలను చూసుకునే చేతన్ దత్తా .
► ఇది చాలా తేలికైన వ్యవహారం. డైనమో నుంచి విద్యుత్‌ను పుట్టిస్తాం. ఆ తర్వాత బటన్‌ను ప్రెస్ చేస్తాం. ఇది 9 సెకన్లలో అన్ని షాక్ ట్యూబ్‌లలోని డిటోనేటర్లను మండిస్తుంది. మేం 50-70 మీటర్ల దూరంలో ఉంటాం. కానీ, మాకేం ప్రమాదం ఉండదు. కూల్చివేత సజావుగా సాగాలని మేం అనుకుంటున్నాం. బ్లాస్టింగ్ ఏరియా మొత్తం నాలుగు లేయర్ల ఇనుప జాలీలతో కవర్ అయ్యి ఉంటుంది. అలాగే రెండు లేయర్ల బ్లాంకెట్లను కప్పుతున్నాం. కాబట్టి, శిథిలాలు ఏవీ కూడా వాటిని దాటి బయటకు రాలేవు. కాకపోతే దుమ్ము మాత్రం రావొచ్చు అని చేతన్ దత్తా వెల్లడించారు.
► కేవలం తొమ్మిది సెకన్లలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. పేలుడు ధాటి, కూల్చివేత ప్రభావాల నేపథ్యంలో వైబ్రేషన్‌ను తగ్గించేందుకు కుషన్లను ఏర్పాటు చేశారు.
► చుట్టుపక్కల ఎమెరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ సొసైటీలు ఉన్నాయి. సుమారు ఐదు వేల మంది జీవిస్తున్నారు అక్కడ. అందుకే.. ఉదయం నుంచే వాళ్లను ఖాళీ చేయించి, తిరిగి పేలుడు అయ్యాక సాయంత్రం పూట వాళ్లను సేఫ్టీ క్లియరెన్స్ అనంతరం ఇళ్లలోకి అనుమతిస్తారు.
► మాస్క్‌లు, ఐ గ్లాస్‌లు ధరించాలని ఇప్పటికే సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా.. ఆంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. అలాగే ఫ్లెక్స్ ఆస్పత్రిలో 50 బెడ్లను సిద్ధంగా ఉంచారు. ట్రాఫిక్ మళ్లింపు సైతం ఉండనుంది.
► కూల్చివేతకు హర్యానా నుంచి తెప్పించిన 3,500 కేజీల పేలుడు పదార్థాలను వాడుతున్నారు. రెండు భవనాల్లో ఏకంగా 9,600 రంధ్రాలు చేసి వాటిని నింపుతారు.
► కూల్చివేత తర్వాత 32 అంతస్థులు, 29 అంతస్థుల బిల్డింగులు.. 35వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలను మిగల్చొచ్చనే అంచనాలో ఉన్నారు. 55 వేల టన్నుల శిథిలాలను ఎత్తి పారబోయడానికి కనీసం మూడు నెలలైనా పట్టొచ్చు. ఆగస్టు 21నే ఈ కూల్చి వేత జరగాల్సి ఉన్నప్పటికీ.. నొయిడా అథారిటీ విజ్ఞప్తి మేరకు మరో వారం ముందుకు జరిగింది.
► సుప్రీం కోర్టు ఆదేశాల అనుసారం.. సూపర్‌టెక్ సంస్థ ఈ కూల్చివేత ఖర్చులను భరించనుంది. అలాగే.. నొయిడా అథారిటీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఈ కూల్చివేతను పర్యవేక్షించనున్నాయి.
► ఆగస్టు 28న గనుక ఏ పరిస్థితులతో అయినా కూల్చివేతను వాయిదా వేయాల్సి వస్తే.. వారం రోజుల్లో ఎప్పుడైనా కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేయొచ్చని సుప్రీం కోర్టు సూచించింది. కానీ, ఆ గడువును మాత్రం దాటొద్దని హెచ్చరించింది.
► నొయిడాలో అక్రమంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన జంట భవనాలు చూస్తుండగానే కుప్పకూలనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.
► ఆదివారం (ఆగస్టు 28) కూల్చివేయబోతున్న నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్ల(అపెక్స్, సెయానే టవర్లు) నిర్మాణ వ్యయం చదరపు అడుగులకు (చదరపు అడుగు) రూ. 933 వెచ్చించి మొత్తం 7.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం కలిగి ఉంది. ఈ లెక్క అప్పటి అంచనా ప్రకారం మొత్తం రూ.70 కోట్లు. అయితే,
► దాని కూల్చివేత కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, దీనికి చాలా పేలుడు పదార్థాలు, మానవశక్తి మరియు పరికరాలు అవసరం.
► సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్‌లో ఒక 3BHK అపార్ట్‌మెంట్ ధర దాదాపు రూ. 1.13 కోట్లు. ఈ రెండు భవనాల్లో దాదాపు 915 ఫ్లాట్లు ఉన్నాయని, వాటి ద్వారా కంపెనీకి దాదాపు రూ.1,200 కోట్ల ఆదాయం వచ్చేది.
► మొత్తం 915 ఫ్లాట్లలో దాదాపు 633 ఫ్లాట్‌లు బుక్ చేయబడ్డాయి మరియు కంపెనీ గృహ కొనుగోలుదారుల నుండి దాదాపు 180 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు, సూపర్‌టెక్‌ని 12 శాతం వడ్డీతో గృహ కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాలని కోరింది.
► ఇది కాకుండా.. పేలుడు సమయంలో చుట్టుపక్కల ఏమైనా డ్యామేజ్‌లు జరిగితే!. ఇందుకోసం బిల్డింగ్ కూల్చివేత బాధ్యతలను తీసుకున్న ఎడిఫైస్ ఇంజినీరింగ్ కంపెనీ రూ.100 కోట్ల ఇన్సూరెన్స్‌కు వెళ్లింది.
► కూల్చివేతకు అయ్యే మొత్తం కాస్ట్.. అక్షరాల రూ.20 కోట్ల రూపాయలు. ఇందులో సూపర్‌టెక్ కంపెనీ ఐదు కోట్ల రూపాయలు మాత్రం ఇవ్వనుంది. మిగతా పదిహేను కోట్ల రూపాయలు.. శిథిలాలు అమ్మకం(అందులో నాలుగు వేల టన్నుల స్టీల్ కూడా ఉంటుంది) ద్వారా సేకరించనుంది.
► నొయిడాలో ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్‌లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్‌మెంట్లున్నాయి. 2009లో సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీ దీని నిర్మించింది.
► పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. అయితే పలు నిబంధనల్ని కంపెనీ గాలికొదిలేసింది.
► నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్‌బీసీ) ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టులోని టవర్‌కు మధ్య 9 మీటర్ల దూరం కూడా ఉంచలేదు. ఆ దూరం ఉండి ఉంటే.. ఇప్పుడు ఇంత భారీ విధ్వంసానికి తెర లేచేదే కాదు.
► నిబంధనల ఉల్లంఘనపై.. ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లోనే కోర్టుకెక్కారు. వీటి నిర్మాణం అక్రమమేనని తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పునిచ్చింది. నాలుగు నెలల్లోగా రెండు భవనాలను కూల్చివేసి, అపార్ట్‌మెంట్ కొనుగోలుదారులకు డబ్బు వాపసు చేయాలంటూ అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 11, 2014 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ.. గృహ కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ..
► దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని కోర్టు 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అందుకు 2022 ఆగష్టు నెలను తుది గడువు ప్రకటించింది.
► ఇది నోయిడా అథారిటీ మరియు సూపర్‌టెక్‌ల మధ్య "అనుకూలమైన సంక్లిష్టత" ఫలితమేనని సుప్రీం కోర్టు పేర్కొంది.
► కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ జంట భవనాల కూల్చివేతను.. దేశంలోనే ఇప్పటిదాకా ఎత్తైన భవనాల కూల్చివేతగా చెప్తున్నారు. అందుకే ఈ కూల్చివేత ఒక చారిత్రక ఘట్టంగా దేశ చరిత్రలో నిలిచిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment