నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రియాల్టీ రంగానికి పెనుషాక్‌లా తగిలింది. రేరా చట్టం (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్‌మెంట్ యాక్ట్ -2016) అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంత తీవ్ర స్థాయిలో కోర్టు తీర్పు వెలువడానికి కారణం ఏంటీ. ఇంత భారీ స్థాయిలో తప్పులు చోటు చేసుకుంటుంటే దాన్ని అరికట్టడంలో రేరా ఎక్కడ విఫలమైంది అనేది ఇప్పుడు రియాల్టీ రంగంలో చర్చకు దారి తీసింది.
రేరా సరిపోదా ?
దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇతర కోర్టులకు కూడా మార్గదర్శనం కానుంది. ఈ తరహా తీర్పులు మరిన్ని వెలువడితే రియల్టీ రంగంలో ఉన్న వారికి సైతం ఇబ్బంది. రియాల్టీలో ఉన్న ప్రధాన లోపాలు ఏంటీ వీటిని పరిష్కరించాలంటే రేరా లాంటి చట్టాలే సరిపోతాయా? ఈ వ్యాపారంలో ఉన్న వారు, కొనుగోలుదారులు, ఇతర ప్రభుత్వ విభాగాల బాధ్యత ఏంటీ అనే తెర మీదకు వస్తోంది.
- రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎవరు ప్రవేశించాలి. అందుకు అర్హతలు ఏముండాలి అనే విషయంలో ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో ఈ రంగంపై అనుభవం లేకపోయినా తమ బ్లాక్‌మనీని వైట్ చేసుకునేందుకు రియాల్టీ రంగంలోకి వస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. వీరికి ప్రాజెక్టును పూర్తి చేయడం మీద కన్న తమ లాభం, ఇతరత్రా వ్యవహరాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి వారి వెంచర్లను నమ్మినవారు మధ్యలో మునిగిపోతున్నారు. రేరా చట్టంతో ఈ సమస్య సమసిపోతుందనుకున్నారు. అయితే వాస్తవంలో అలా జరగడం లేదు
- బిల్డర్‌కి కొనుగోలుదారుడికి మధ్య సమస్య తలెత్తిన సందర్భంలో వాటిని పరిష్కరించడంలో రేరాది ప్రేక్షక పాత్రే అవుతుంది. రేరా చట్టంలో ఉన్న నిబంధనలు లీగల్ ఫైట్ టైమ్‌ని మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఆర్థికంగా బలంగా ఉండే బిల్డర్లతో కొనుగోలుదారులు లీగల్‌గా ఎక్కువ కాలం పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది.
- సబ్బు బిళ్ల మొదలు బట్టల వరకు ఏదైనా వస్తువును కొనేప్పుడు దాన్ని పరిశీలించి.. బాగుందని నమ్మితేనే కొంటాం. కానీ రియల్ ఎస్టేట్, ఇళ్ల కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. కనీసం నిర్మాణం మొదలుకాకముందే బిల్డర్లు అమ్మకాలు మొదలుపెడతారు. వారి ఏజెంట్లు ఆహా ఓహో అని చెబుతారు. ఆలస్యం చేస్తే రేటు పెరుగుతుందని తొందరపెడతారు. మరోవైపు బ్యాంకర్లు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు సైతం లోన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో డబ్బులు చెల్లించినా సకాలంలో ఇళ్లు చేతికి అందక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల రూపాయల సొమ్మును ఈఎంఐ, వడ్డీలుగా అదనంగా చెల్లిస్తున్నారు. ఈ విషయంలో కనీసం ప్రభుత్వ విభాగాలు సైతం చేష్టలుడిగి చూస్తుండి పోతున్నారు. ఇచ్చిన గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయని బిల్డర్‌కి ఎటువంటి జవాబుదారితనం లేకపోయినా వచ్చిన నష్టమేమీ లేకుండా పోయింది.
చదవండి : 40- Storey Noida Towers: కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి
Comments
Please login to add a commentAdd a comment