
అన్వేషణం: కొండ మీద విందు చేస్తారా?
స్వచ్ఛమైన గాలిని తృప్తిగా పీల్చుకోవాలని, పచ్చని చెట్ల నీడల్లో సేద దీరాలని, సెలయేటి అలల సవ్వడి వింటూ సరదాగా గడపాలని అందరికీ ఉంటుంది. అయితే ప్రకృతి ఒడిలో కూర్చుని పసందైన విందును ఆరగించాలన్న ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా వచ్చిందా? వచ్చినా కాంక్రీట్ జంగిల్స్‌లో నివసించే మనకు ఆ అవకాశం దొరికే చాన్స్ లేదు కదా! కానీ చైనా వెళ్తే ఆ కోరిక కచ్చితంగా తీరుతుంది. చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ఇచాంగ్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని ఆనుకుని జైలింగ్ గార్గ్ అనే పెద్ద లోయ ఉంది. పెద్ద పెద్ద చెట్లు, సెలయేళ్లు, రంగురంగుల పూలమొక్కలతో ఈ లోయ ప్రాకృతిక సౌందర్యానికి నిలయంలా ఉంటుంది.
ఈ లోయ పక్కనే ఉన్న పెద్ద కొండ మీద ఉంది... ఫాంగ్‌వెంగ్ రెస్టారెంట్. ఇచాంగ్ శివార్లలో చాలా గుహలు ఉంటాయి. అక్కడ ట్రెక్కింగ్, బంగీ జంప్ లాంటివి చేయడానికి చాలామంది వస్తుంటారు. వారందరి కోసం నెలకొల్పిందే ఈ రెస్టారెంటు. కొండ చరియ మీద నిర్మించిన ఈ రెస్టారెంటులో అడుగు పెడుతుంటే కాళ్లు వణుకుతాయి. ఎందుకంటే... గాలిలో వేళ్లాడుతున్నట్టు ఉంటుంది మరి. అయితే కాస్త ధైర్యం చేసి వెళితే ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి దక్కుతుంది. రుచికరమైన సీఫుడ్ స్పెషల్స్‌ని ఆరగిస్తూ... చుట్టూ ఉన్న అందాలను పరికిస్తూ గడిపే కాలం... మీ జీవితంలోనే గొప్ప జ్ఞాపకమై మిగిలిపోతుంది!
అరేబియా తీరంలో అద్భుత విలాసం!
అత్యాధునిక సౌకర్యాలతో అత్యంత అందంగా తీర్చిదిద్డిన ఇంట్లో కూర్చొని... అరేబియా సముద్రపు అందాలను ప్రత్యక్ష్యంగా చూస్తూ ఉదయాలను, సాయంత్రాలను ఆస్వాదించాలంటే ముంబైలోని ఇంపీరియల్ టవర్స్‌లో నివసించాలి. ఈ మానవ నిర్మిత అద్భుతాల ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డెకరేషన్‌ల గురించి పరిశీలించినా, ఇక్కడ నివసించే వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి గమనించినా అందులో నివసించే వారి పట్ల కాస్తాయినా అసూయపుడుతుంది. ముంబై మణిహారంలో మెరిసేటి జంట వజ్రాలు ఇంపీరియల్ టవర్స్. ముంబైలోని తార్‌దేవ్ ప్రాంతంలో ఒకప్పుడు స్లమ్ ఉండేది. అక్కడి ప్రజలకు ఉచితంగా మరోచోట స్థలం ఇచ్చి పంపించి, ఆ తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్‌లను నిర్మించారు. 254 మీటర్లు (833 అడుగులు) ఎత్తున్న ఈ టవర్స్‌లో 17 హైస్పీడ్ ఎలివేటర్లున్నాయి. విద్యుత్, సహజవనరులను సద్వినియోగం చేసుకొనేలా, పునర్వినియోగం చేసుకొనేలా దీని నిర్మాణం సాగింది. గ్రేవాటర్ సిస్టమ్ ద్వారా ఈ భవంతి పరిసరాల్లో కురిసిన వర్షపు నీటిని కూడా వినియోగించుకునే విధానాన్ని అమల్లో పెట్టారు. ఈ భవంతిలోకి ప్రవేశించే గాలి కూడా శుద్ధి చేసినదే! ఈ అద్భుత నిర్మాణ ఘనత హఫీజ్ కాంట్రాక్టర్ అనే ఆర్కిటెక్టుకు చెందుతుంది.
ఇందులో 3, 4, 5 బెడ్‌రూమ్ డూప్లెక్స్ హౌస్‌లు కూడా ఉన్నాయి. భారత వాణిజ్య రాజధానిలో అత్యంత విలాసవంతమైన భవనాలుగా దేశంలోనే అతి పొడవైన భవనాలుగా గుర్తింపు పొందాయి ఈ ట్విన్ టవర్స్. ముంబైలోని మహా ధనవంతుల అడ్రస్ ఇది. అందుకే సెక్యూరిటీ, లివింగ్ స్టాండర్డ్స్ విషయంలో ఇంపీరియల్ టవర్స్‌కు ప్రత్యేక ప్రమాణాలున్నాయి. ఎవరైనా వాటికి లోబడి నడుచుకోవాల్సిందే. ఈ టవర్స్ రికార్డును చెరిపేసే విధంగా... ఈ ట్విన్ టవర్స్‌కు పక్కనే నిర్మిస్తున్న ఇంపీరియల్ టవర్-3 2017 నాటికి పూర్తవుతుంది. అప్పుడదే దేశంలోని అత్యంత ఎత్తయిన భవంతిగా నిలిచే అవకాశం ఉంది.