ఎవరు చూస్తారులే... ఏం జరుగుతుందిలే.. ప్రాబ్లెమ్ వస్తే మ్యానేజ్ చేద్దాం అనుకుంటే అన్ని సార్లు కుదరదు. తప్పు బయట పడితే దాని తాలుకు ఫలితాలు ఎలా ఉంటాయో రియల్ ఎస్టేట్ కంపెనీ సూపర్‌టెక్‌కి తెలిసి వస్తున్నాయి. అతి విశ్వాసంతో సూపర్‌టెక్ వేసిన రాంగ్‌స్టెప్స్ ఇప్పుడా కంపెనీ పుట్టి మునిగిపోవడానికి బాటలు వేస్తున్నాయ్..
నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉన్న ఉన్న నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా సూపర్‌టెక్ అనే రియల్టీ సంస్థ 40 అంతస్థులతో జంట భవనాలు నిర్మించింది. ఈ అక్రమ నిర్మాణాలు వ్యతిరేకిస్తూ స్థానికులు కోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హై కోర్టు మీదుగా సుప్రీం కోర్టు వరకు మూడేళ్లకు పైగా ఈ కేసు నడిచింది. అప్పటికే నోయిడా అధికారులను ‘మేనేజ్’ చేస్తూ వచ్చిన సూపర్‌టెక్ సంస్థ న్యాయస్థానాలను లైట్ తీసుకుంది. కోర్టులో విచారణ జరుగుతున్నా నిర్మాణం చేసుకుంటూ పోయింది. 39వ ఫ్లోర్ నిర్మాణంలో ఉండగా కోర్టు తీర్పు వెలువడింది.
కూల్చేయండి
నిబంధనలు ఉల్లంఘించి కట్టిన 40 అంతస్తుల జంట భవనాలు కూల్చేయాలని కోర్టు కరాఖండీగా తేల్చి చెప్పింది. ఈ భవంతిలో ఇళ్లు కొనుగోలు చేసిన వారికి వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. భవనం కూల్చివేత ఖర్చులు కూడా సూపర్‌టెక్ సంస్థనే భరించాలని తీర్పు వెలువరించింది.
గుణపాఠం
నిర్మాణం పూర్తి చేసుకున్న భవనం కూల్చివేస్తే ఎంతో వర్క్‌ఫోర్స్, నిర్మాణ సామగ్రి వృధా అవుతుందని కనీసం భవనం స్వాధీనం చేసుకున్నా చాలంటూ మొరపెట్టుకుంది సూపర్‌టెక్. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మళ్లీ జరగొద్దంటే గుణపాఠం కఠినంగా ఉండాలి కాబట్టి కూల్చివేత విషయంలో మరో మాటకు తావులేదంది సుప్రీం కోర్టు. 2022 మే 21లోగా కూల్చివేయాల్సిందే అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తన అభిప్రాయం స్పష్టం చేసింది.
దివాలా కత్తి
సుప్రీం కోర్టు తీర్పు సూపర్‌టెక్‌కి వ్యతిరేకంగా రావడంతో అప్పులిచ్చిన బ్యాంకులు సూపర్‌టెక్ కంపెనీ మెడ మీద కత్తి పెట్టి బాకీ తీర్చమన్నాయి. ఓ వైపు ఇళ్ల కోసం తీసుకున్న అడ్వాన్సులు, నగదుకు వడ్డీతో సహా తిరిగి వెనక్కి చెల్లించాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్టు భవంతి కూల్చివేత పనులకు సైతం నిధులు సమకూర్చాల్సి వచ్చింది. చివరకు ముంబైకి చెందిన సంస్థ కూల్చివేత పనులు దక్కించుకుంది.
పేలుడు ప్రమాదం
భవంతి ధృడంగా ఉండటంతో ఎక్కువ మొత్తంలో మందు గుండు అవసరం అంటూ కోర్టుకు విన్నవించుకుంది. మే 21లోగా భవంతిని కూల్చడం కష్టమంటూగడువు పొడిగించమని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2022 ఆగస్టు 21న కూల్చివేతకు గడువు పెంచింది సుప్రీం. 40 అంతస్థుల భవనం కూల్చివేతకు పేలుడు పదార్థాలు ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నారని తెలియడంతో స్థానికంగా నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ భవనాలకు నష్టం వాటిల్లితే బాధ్యత ఎవరిది అంటూ నోయిడా అధికారులకు మొరపెట్టుకున్నారు.
మాసంగతేంటి?
భవనం కూల్చివేతకు ఉపయోగిస్తున్న మందుగుండు సామగ్రి, దాని పేలుడు తీవ్రత అంచనా వేసేందుకు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా మరోసారి సర్వే చేపడుతున్నారు. ఇవి చాలదన్నట్టు మరో సమస్య కూడా రెడీగా ఉంది. 40 అంతస్తుల భవనం పక్కనే ఉన్న ఇతర నిర్మాణాలకు కూడా సామర్థ్య పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. పేలుడు వల్ల వీటికి ఏమైనా ప్రమాదం వాటిల్లితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరంతా కలిసి నోయిడా అధికారులకు ఆశ్రయించారు.
తడిసిమోపెడు
ట్విన్ టవర్స్ పేలుడు వల్ల తమ భవనాలకు ఏ నష్టం రాకుండా ముందస్తు రక్షణ ఏర్పాట్లు కూడా సూపర్ టెక్ చేపడుతుందని ఈ విషయంలో నోయిడా అధికారుల నుంచి హామీ లభించిందని అపార్ట్‌మెంట్ వాసులు అంటున్నారు. ఇదే గనుక నిజమైతే సూపర్‌టెక్‌కు ఖర్చు తడిసిమోపెడు అవుతుంది. ఇప్పటికీ దివాలా అంచున ఆ కంపెనీ నిలదొక్కుకునే సమయం ఇవ్వకుండా వేగంగా అక్కడి నుంచి కిందకు పడేసే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని సూపర్‌టెక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.
అడకత్తెరలో..
మరోవైపు నోయిడా అధికారుల పరిస్థితి ఈ విషయంలో కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. కళ్లముందే నలభై అంతస్థుల భవనం నిర్మాణం జరుగుతుంటూ ఏం చేస్తున్నారంటూ న్యాయస్థానం సిబ్బందిని తీవ్రంగా మందలించింది. సుప్రీం ఆగ్రహంతో ఒకప్పుడు తప్పుడు పనులకు వత్తాసు పలికిన అధికారులు ఇప్పుడు వాటిని సరిదిద్దలేక నానాతంటాలు పడుతున్నారు. ఇటు సూపర్‌టెక్‌కు చెప్పలేక అటు ప్రజల ఆందోళనలకు పరిష్కారం చూపలేక బిక్కచచ్చిపోతున్నారు.
చదవండి: ఇదెక్కడి గొడవరా నాయనా.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment