నిబంధనలు ఉల్లంఘించి 40 అంతస్థుల జంట భవనాల నిర్మాణం కేసులో బిల్డర్ వెనక్కి తగ్గాడు. ఇంతకాలం నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టామంటూ చెబుతూ వచ్చినవారు తప్పును ఒప్పుకున్నారు. భారీ శిక్ష నుంచి మినహాయించాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకున్నారు.
అలహాబాద్
నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 40 అంతస్థుల ట్విన్ టవర్స్‌ని సూపర్ టెక్ అనే సంస్థ నిర్మించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలు కాగా.. విచారించిన కోర్టు జంట భవనాలను కొట్టి వేయాలంటూ తీర్పు ఇచ్చింది.
సుప్రీం ఫైర్
అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సూపర్ టెక్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసు వివరాలను పూర్తిగా విచారించిన సుప్రీం కోర్టు అలహాబాద్ హై కోర్టు తీర్పునే సమర్థిస్తూ జంట భవనాలను రెండు నెలల్లోగా నేలమట్టం చేయాలంటూ తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుపై సూపర్ టెక్ సంస్థ రివ్యూ పిటీషన్ వేసింది.
మన్నించండి
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తీర్పు వ్యతిరేకంగా రావడంతో సూపర్‌టెక్ సంస్థ దారికొచ్చింది. ట్విన్ టవర్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఒక్క భవనాన్ని కూల్చివేసేలా తీర్పును మార్చాలంటూ వేడుకుంది. ఈ అవకాశం ఇస్తే మిగిలిన ఒక్క భవనాన్ని పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తామంటూ బతిమాలింది. భవన నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని, ఎంతో సిమెంటు, స్టీలు వినియోగించామని అదంతా వృథా అవుతుందని పేర్కొంది. రెండు భవనాలను కూల్చేస్తే శిథిలాలతో ఆ ప్రాంతం నిండిపోతుందని పేర్కొంది. మొత్తంగా చేసిన తప్పును ఒప్పుకుని శిక్షలో మినహాయింపు ఇవ్వాలని వేడుకుంది.
915 అపార్ట్‌మెంట్లు
నోయిడా ప్రాంతంలో సూపర్ టెక్ సంస్థ నిర్మించిన జంట భవనాల్లో మొత్తం 915 అపార్ట్‌మెంట్లు, 21 షాపులు ఉన్నాయి. ఇందులో 633 అపార్ట్‌మెంట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. అయితే గ్రీన్ జోన్ పరిధిలో ఈ భవన నిర్మాణం చేపట్టడంతో వివాదం రాజుకుంది
కళ్లు మూసుకున్నారా ?
గ్రీన్ జోన్‌లో 40 అంతస్థులతో జంట భవనాలు నిర్మిస్తుంటే కళ్లు మూసుకున్నారా అంటూ నోయిడా అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అపార్ట్‌మెంట్ బుక్ చేసుకున్న వారికి రెండు నెలల్లోగా వడ్డీతో సహా డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ బిల్డర్‌కు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.
చదవండి : నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది?
Comments
Please login to add a commentAdd a comment