
న్యూఢిల్లీ: నోయిడాలో 40 అంతస్తుల జంట టవర్ల కూల్చివేతపై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణలకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు సూపర్‌టెక్ లిమిటెడ్ సంస్థ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా లేని ఒక టవర్‌లోని 224 ఫ్లాట్లతోపాటు గ్రౌండ్ ఫ్లోర్‌లోని కమ్యూనిటీ ఏరియాను పాక్షికంగా మాత్రమే నేలమట్టం చేసేందుకు వీలు కల్పించాలన్న వినతిని తోసిపుచ్చింది.
ఇలాంటి వెలుసుబాట్లు కల్పిస్తే ఆగస్ట్ 31వ తేదీ నాటి తమ తీర్పును తిరిగి పూర్తి స్థాయిలో సమీక్షించుకున్నట్లవుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం తెలిపింది. రెండు టవర్లను పూర్తిగా కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది.