బనశంకరి: బెంగళూరులో వరద బాధిత ప్రాంతాల్లో బీబీఎంపీ, రెవెన్యూ శాఖలు చేపట్టిన కబ్జా కట్టడాల తొలగింపు మంగళవారం రెండవరోజుకు చేరుకుంది. రాజకాలువలు ఆక్రమించుకుని నిర్మించిన భవనాలు, ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. దీంతో రియల్ వ్యాపారులు, కట్టడ యజమానుల్లో కలవరం మొదలైంది.
జాబితాలో ప్రముఖ సంస్థలు, వ్యక్తులు
- మహదేవపుర వలయంలో వివిధ బిల్డర్లు, ఐటీ పార్కులవారు ఆక్రమణలకు పాల్పడిన స్థలాల జాబితాను బీబీఎంపీ విడుదల చేసింది.
- బాగమనె టెక్ పార్కు, రెయిన్‌బో డ్రైవ్ లేఔట్, విప్రో, ఎకో స్పేస్, బెళ్లందూరు, హుడి, సొణ్ణెహళ్లి గోపాలన్, దియా పాఠశాల, కొలంబియా ఏషియా ఆసుపత్రి, న్యూ హొరైజన్ కాలేజీ, ఆదర్శ రిట్రీట్, ఏషియన్ దివ్యశ్రీ, ప్రెస్టేజ్, సాలార్‌పురియా, నలపాడ్ డెవలపర్స్‌తో పాటు మహమ్మద్ నలపాడ్ కు చెందిన ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి.
అడ్డుగా 700 కట్టడాలు
సుమారు 700 కు పైగా అక్రమ కట్టడాలు నగరవ్యాప్తంగా వర్షం నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయని , కంపెనీలు కబ్జాకు పాల్పడిన స్థలాలను తొలగిస్తామని బీబీఎంపీ అధికారులు తెలిపారు. 2.5 నుంచి 5 మీటర్ల ప్రభుత్వ స్థలం రాజకాలువకు వదిలిపెట్టాలి. ఇందులో ప్రముఖులు ఆక్రమణకు పాల్పడిన స్థలాలు ఉన్నాయని, వీటిని తొలగించి రక్షణ గోడను నిర్మిస్తామని అధికారులు తెలిపారు. మహదేవపుర వలయంలో శాంతినికేతన్ లేఔట్, స్పైసి గార్డెన్, పాపయ్యరెడ్డి లేఔట్, చల్లఘట్ట రాజకాలువ ఆక్రమణల ఏరివేత చేపట్టారు.
30 జేసీబీలతో కూల్చివేతలు
రెండోరోజు 30కి పైగా జేసీబీలతో మహదేవపుర, యలహంక వలయాల పరిధిలో కట్టడాలను కూల్చారు. శాంతినికేతన్ లేఔట్‌లో భారీ భవంతులను బుల్డోజర్ ద్వారా కూల్చివేశారు. మున్నకోళాల సరిహద్దుల్లో 7 ఆక్రమణలను తొలగించారు. తొలగించాలని అనేక ఇళ్లు, దుకాణాలు ముందు రెవెన్యూ అధికారులు మార్కింగ్ వేశారు. భారీ పోలీస్ భద్రత మధ్య రెండు కిలోమీటర్ల పొడవు గల రాజకాలువపై నెలకొన్న ఆక్రమణలను పడగొట్టారు.
యలహంక వలయంలో జక్కూరు, అల్లాలసంద్ర, కోగిలు, అట్టూరు, సింగాపుర, దొడ్డబొమ్మసంద్ర, హెబ్బాళ, నవనగర, రాచేనహళ్లితో పాటు సుమారు 30 చెరువులు కబ్జాకు గురయ్యాయి. రియల్టర్లు, నేతలు కుమ్మక్కై చెరువులు మింగేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఆక్రమణదారులు పలుకుబడి కలిగినవారు కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.
నలపాడ్ అకాడమి తొలగింపు నిలిపివేత
మరోవైపు ఆక్రమణల తొలగింపు వద్ద ఎమ్మెల్యే హ్యారిస్ తనయుడు, కాంగ్రెస్ నేత మహమ్మద్ నలపాడ్ పడవ వేసుకుని ధర్నా చేసి హల్‌చల్ చేశారు. ఆక్రమణల జాబితాలో నలపాడ్ ఆస్తులు కూడా ఉన్నాయి. మహమ్మద్ నలపాడ్ అకాడమి తొలగింపును అధికారులు నిలిపివేశారు. పనులు చేస్తున్న సిబ్బందిని హ్యారిస్ పీఏ నిలిపివేయాలని ఒత్తిడి చేశాడు. గేటు వద్ద అడ్డుకున్నాడు. దీంతో కూల్చివేతను నిలిపివేశారు.
శివాజీనగర: బెంగళూరులో అక్రమ భవనాల తొలగింపు పై మంగళవారం విధాన సౌధలో రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ మాట్లాడుతూ... వీటి వెనుక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బెంగళూరులో ప్రభుత్వ స్థలాలను, చెరువులను ఆక్రమించుకొని అనేక అతిపెద్ద భవనాలు నిర్మించుకున్నారని, అలాంటి భవనాలను ఎలా తొలగిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి ఎంతటివారైనా సరే తొలగిస్తామని, నోయిడా తరహాలో అక్రమ భవనాలకు పేలుడుతో సమాధానం చెబుతామన్నారు. ఆక్రమణదారులకు ఘాటైన హెచ్చరిక చేశారు.
గత ప్రభుత్వాలవి నాటకాలు
ఆక్రమణల విషయంలో గత ప్రభుత్వాలు నాటకీయంగా వ్యవహరించాయని, అయితే తమ అధికారంలో అలా జరగదని, ఐటీకి చెందిన 30 కంపెనీలు ఆక్రమణలకు పాల్పడ్డాయని, తమ శాఖ జాబితా సిద్ధం చేసి బీబీఎంపీకి ఇచ్చామన్నారు.
మినహాయింపు లేదు
ఐటీ–బీటీ కంపెనీలకు ఎలాంటి మినహాయింపు లేదని, పెద్దవారు, చిన్నవారు అనేది లేదని, రెవెన్యూ శాఖ, బీబీఎంపీ, బీడీఏ సంయుక్త కార్యచరణ చేపడుతాయి. వరదలు తమకు గుణపాఠం చెప్పింది. బాగమనె పార్కుకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. పెద్దవారు చిన్నవారు అంటూ చూడమని మంత్రి తెలిపారు.
విల్లాలు, విద్యాసంస్థలనూ వదలం
రాజకాలువ ఆక్రమించుకొన్న భవనాలపై బీబీఎంపీ జాబితా సిద్ధం చేయగా, 600 అక్రమ భవనాల తొలగింపునకు ఆదేశించాం, రాజకాలువ తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయని, మహదేవపుర భాగంలో బీబీఎంపీ రాజకాలువ అక్రమణలు తొలగిస్తోందని, విల్లాలు, విద్యా సంస్థ, ఇళ్లు నేలమట్టమవుతాయి. రైన్‌బో డ్రైవ్ లేఔట్‌లో జిల్లా యంత్రాంగం సర్వే జరుపగా, కాలువను ఆక్రమించుకొని విల్లాలను నిర్మించినట్లు తెలిసింది. ప్రస్తుతం విల్లాలను తొలగించాలని యజమానులకు నోటీస్ ఇచ్చామన్నారు.
JCB’s in action today in Mahadevapura demolishing alleged encroachments on rajakaluves. #BBMP pic.twitter.com/lvEjU9yHyM
— Anil Budur Lulla (@anil_lulla) September 12, 2022
Comments
Please login to add a commentAdd a comment