సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరులో పార్కులు, మైదానాల్లో అక్రమ కట్టడాల నిర్మాణాల గురించి సర్వే నివేదిక అందజేయకపోవడంపై బీడీఏ, బీబీఎంపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరిద్దరిని జైలుకు పంపిస్తేగాని పరిస్థితి మారదని హెచ్చరించింది. న్యాయసేవల సమితి వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తి.. కోర్టు ఆదేశాలను సంస్థలు పట్టించుకోవడం లేదని అన్నారు.
బీబీఎంపీ కమిషనర్‌ను జైలుకు పంపిస్తామన్నారు. పార్కులు, మైదానాల్లో అక్రమ కట్టడాల నిర్మాణాలను సహించేదిలేదు, పెద్దవాళ్లపై చర్యలు తీసుకోవడానికి మీరు వెనుకాడవచ్చు కానీ మేము భయపడబోం. తక్షణం చర్యలు తీసుకోకపోతే అదికారులకు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. సర్వే నివేదిక అందజేయడానికి మరో వారం గడువు ఇవ్వాలని బీబీఎంపీ వకీలు కోరారు.
సుప్రీంలో పాలికె ఎన్నికల కేసు
బీబీఎంపీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బీబీఎంపీ ఎన్నికలు జరపాలని మాజీ కార్పొరేటర్లు శివరాజు, అబ్దుల్ వాజిద్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో రెండునెలల్లోగా ఎన్నికలు జరపాలని హైకోర్టు అదేశించగా, ప్రభుత్వం ఇప్పట్లో నిర్వహించలేమని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలను ఒక నెలలోగా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment