
ఉలకవాగులో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం
కోదాడ : సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఉలకవాగు ఆక్రమణకు గురైంది. అక్రమార్కులు కాగితాల్లో ఉన్న చిన్నపాటి లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. అధికారుల చేతులు తడిపారు. అనుకూలంగా కాగితాలను మార్చుకున్నారు. ఇంకేముంది ఆగమేఘాల మీద అనుమతులు మంజూరయ్యాయి. జెట్ స్పీడ్‌తో వాగులో భవన నిర్మాణం కొనసాగుతుంది. మొదట ఈ నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన ఓ ప్రజాప్రతినిధి ఆ తరువాత పెద్దమనిషి అవతారమెత్తారు. అందరిని తానే ‘సరి’చేసి నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూశాడు. వందల అడుగుల వెడల్పుతో ఉన్న ఉలకవాగు మురుగుకాల్వ కన్నా చిన్నగా మారిపోయింది. ఇదేమిటం టే ఐబీ, రెవెన్యూ, మున్సిపల్‌శాఖ అధికారులు అది తమ పని కాదంటే తమ పని కాదని తప్పించుకుంటున్నారు.
వాగు ఉందని చెబుతుంది వారే ..
కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్డులో సర్వే నంబర్ 936, 937లలో తమ్మర శేషగిరిరావుకు భూమి ఉంది. దీనిని తమ్మర వెంకటేశ్వరరావుకు జీపీఏ ఇచ్చాడు. దానిని ఆయన టీచర్స్ కాలనీ పేరుతో లే అవుట్ చేసి అమ్మాడు. జీపీఏ చేసే సమయంలో, లే అవుట్ చేసే సమయంలో అక్కడ ఉత్తరం వైపు వాగు ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. కాని వాగు ఎంత వెడల్పుతో ఉందో సరిగా ఎక్కడ పేర్కొనలేదు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. భూమి యజమానికి తృణమో, ఫణమో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగితాల మీద ఒక రకంగాను, క్షేత్ర స్థాయిలో మరో రకంగాను వ్యవహారం నడిచింది. ప్రస్తుతం నిర్మాణం సాగుతున్న భవనానికి ఎదురుగా 50 అడుగుల వెడల్పుతో ఉలకవాగు నీరు పోవడానికి వంతెన ఉంది. దానిని చూసైనా వాగు ఎంత వెడల్పు ఉందో ఇట్టే చెప్పేయవచ్చు కాని అధికారులు మాత్రం మూమూళ్ల మత్తులో అనుకూలంగా నివేదికలు ఇచ్చారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
‘సరి’ చేశాడు...
ఉలకవాగులో సాగుతున్న భవన నిర్మాణంలో ప్రజాప్రతినిధి ఒక్కరు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట నిర్మాణాన్ని వ్యతిరేకించడమే కాకుండా వాగులో పూడికను తీయ్యించి చాలా హడావుడి చేశాడు. మున్సిపల్ అధికారులతో చెప్పి పనులు కూడా ఆపించాడు. ఆ తర్వాత తెరవెనుక మంతనాలు నడిపారు. వ్యతిరేకించే వారినందరిని తానే దగ్గరుండి ‘సరి’ చేసే పని చేపట్టాడనే ఆరోపణలు కాలనీలో గుప్పుమంటున్నాయి.
కళ్లు మూసుకున్న అధికారులు
ఉలక వాగులో ఒక ప్లాట్‌ను క్రమబద్ధీకరించడానికి యజమాని దరఖాస్తు చేసుకున్నాడు. మున్సిపల్ అధి కారులు వెనుకా ముందు చూడకుండా క్రమబద్ధీకరించారు. అనుమతులు కూడా మంజూరు చేశారు. భవన నిర్మాణం విషయం కాలనీవాసులకు తెలియడంతో ఉలకవాగులో అక్రమ నిర్మాణాల వల్ల భారీ వర్షాలు వస్తే నీరు కాలనీ మీదకు వస్తుందని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు పనులను ఆపి వేశారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధి సైతం దీన్ని వ్యతిరేకించారు. దీంతో అక్కడ వాగు ఉందో లేదో చెప్పాలని రెవెన్యూ అధికారులను, ఐబీ అధికారులను మున్సిపల్ అధికారులు కోరగా రికార్డులలో వాగు లేదని రెవెన్యూ అధికారులు, వాగు ఉంది కాని ఎంత వెడల్పు ఉందో తెలవదని ఐబీ అధికారులు వింతైన సమాధానాలు ఇచ్చారు. దీంతో తాము ఏమి చేయలేమని మున్సిపల్ అ«ధికారులు చేతులెత్తేశారు.
పనులు ఆపాం..
ఉలకవాగులో భవన నిర్మాణంపై ఫిర్యాదులు రావడంతో పనులు ఆపాం. రెవెన్యూ, ఐబీ అధికారులు వాగు విషయంలో సరైన విధంగా స్పందించలేదు. దీంతో మేము ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకు పనులు ఆపారో తెలపాలని భవన యజమాని అడగడంతో మా వద్ద సరైన కారణం లేక మళ్లీ అనుమతి ఇచ్చాం.-అమరేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment