
కోదాడలో తీవ్ర ఉద్రిక్తత
కోదాడ అర్బన్ : కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గురువారం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్రమ పద్ధతుల్లో చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్, టీడీపీ నాయకులు ఎన్నికను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మున్సిపల్ కార్యాలయానికి వంద మీటర్లలోపు ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు బుధవారం ప్రకటించారు. పది గంటల సమయంలో టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కార్యాలయంలోనికి వెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు.
పదిన్నర గంటల సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లను వెంట తీసుకుని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కార్యాలయానికి వస్తుండగా వారిని స్థానిక మసీదు వద్ద అడ్డుకుని నల్లజెండాలతో నిరసన తెలిపారు. సుమారు పది నిమిషాలసేపు టీఆర్‌ఎస్,టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు టీఆర్‌ఎస్, టీడీపీ నాయకులను చెదరగొట్టి ఎమ్మెల్యే వాహనాన్ని కార్యాలయంలోనికి పంపించారు. అమె వాహనంతోపాటు కౌన్సిలర్లు ఉన్న బస్సు కార్యాల యం వద్దకు చేరుకోగానే మరోసారి టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల మరోసారి చెదరగొట్టి కౌన్సిలర్లను లోనికి పంపించారు.
తోపులాట సందర్భంగా టీఆర్‌ఎస్‌కు చెందిన ఇరువురు నాయకురాళ్లకు గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ టీఆర్‌ఎస్, టీడీపీ నాయకులు రహదారిపై కొంతసేపు రాస్తారోకో నిర్వహించారు. కార్యాలయం లోపల ఎన్నిక జరుగుతున్నంతసేపు బయట నిరసన తెలుపుతూనే ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కుక్కడపు బాబు, రాయపూడి వెంకటనారాయణ, చలి గంటి లక్ష్మణ్, ఏనుగుల ఎల్లేశ్వరరావు, బెలిదె అశోక్, గట్ల నరసింహారావు, కంచుకొమ్ముల శంకర్, టీడీపీ నాయకులు పాలూరి సత్యనారాయణ, ఉప్పగండ్ల శ్రీను, కె.చందర్‌రావు, ప్రసాద్, గురుమూర్తి పాల్గొన్నారు.