గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్‌లను ప్రభుత్వం మరోసారి అవమానించింది. పారదర్శకత పేరిట చెక్కులపై సర్పంచ్‌లు సంతకం చేసే అధికారానికి షరతులు పెట్టింది.
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్‌లను ప్రభుత్వం మరోసారి అవమానించింది. పారదర్శకత పేరిట చెక్కులపై సర్పంచ్‌లు సంతకం చేసే అధికారానికి షరతులు పెట్టింది. సర్పంచ్ ఒక్కరే కాకుండా పంచాయతీ కార్యదర్శి కూడా చెక్కుపై సంతకం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి.. కొత్తగా 21 వేల పంచాయతీలకు సర్పంచ్‌లు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి సోమవారం వరకు కూడా ప్రత్యేకాధికారులు, గ్రామ కార్యదర్శులు చెక్కులపై సంతకాలు చేస్తూ వచ్చారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వివిధ పథకాల నిధుల వ్యయానికి సంబంధించి ఇచ్చే చెక్కులపై సర్పంచ్‌తోపాటు, గ్రామ కార్యదర్శి విధిగా సంతకం చేయాల్సిందేనని తాజా ఉత్తర్వుల్లో ముఖ్యకార్యదర్శి స్పష్టం చేశారు.
కాగా, సర్పంచ్‌లు ఒక్కరికే చెక్ పవర్ కల్పించకుండా పంచాయతీ కార్యదర్శికి కూడా అవకాశం కల్పించడాన్ని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ప్రజాప్రతినిధులను అవమానించడమేనని మండిపడ్డారు.