cheque power
-
పంచాయితీల్లో డిజిటల్ లావాదేవీలు
సాక్షి, నల్లగొండ : గ్రామ పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజాప్రతినిధులు అయోమయానికి గురవుతున్నారు. చెక్ పవర్ వ్యవహారాన్ని తేల్చిన ప్రభుత్వం మరిన్ని సమస్యలను సృష్టించి పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు తీసుకోవాలన్నా, నిధులు డ్రా చేసుకోవాలన్నా సర్పంచుల తల ప్రాణం తోకకు వచ్చేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలో చేసిన పనులకు సంబంధించిన వివరాలన్నీ యాప్‌లోనే అప్లోడ్ చేయాలన్న నిబంధన పెట్టారు. అలా అప్లోడ్ చేశాకే ఆన్లైన్లోనే డిజిటల్ చెక్కులు పొందే విధంగా కొత్త పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో గ్రామ పంచాయతీలో ఎలాంటి పనిచేసినా ఆ పనికి సంబంధించి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద తతంగమే జరగాల్సి ఉంది. డిజిటల్ చెక్కు పొందేందుకు సర్పంచ్, ఉప సర్పంచులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం చెక్‌పవర్ ఇచ్చినా, డిజిటల్ యాప్ అందుబాటులోకి రాని కారణంగా డబ్బులు డ్రా చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 837 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. సర్పంచులు ఆయా పంచాయతీల్లో కొలువుదీరారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో 7 గ్రామ పంచాయతీలకు అప్పట్లో ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో పాత సర్పంచులే కొనసాగుతున్నారు. వీరికి వచ్చే ఏడాది జనవరి వరకు పదవీ కాలం ఉంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీ నూతన చట్టం కారణంగా పంచాయతీల్లో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సర్పంచులకు చెక్ పవర్ విషయంలోనే ఆచితూచి అడుగులు వేసింది. ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, ఆ తర్వాత నూతన పంచాయతీ పాలనపై సర్పంచులకు నాలుగు విడతల్లో జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చారు. చెక్‌పవర్‌పై తర్జన భర్జనలు పంచాయతీ పాలనకు గాను తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టం ప్రకారం జాయింట్ చెక్ పవర్ ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై పెద్ద తతంగమే నడిచింది. జనవరిలో ఎన్నికలు పూర్తికాగా, ఫిబ్రవరిలో శిక్షణ కూడా నిర్వహించారు. గతంలో మాదిరిగా సర్పంచ్‌కి , కార్యదర్శికి చెక్‌పవర్ ఇవ్వాలా..? లేక సర్పంచ్, ఉప సర్పంచ్‌కి కలిపి ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం పలు విధాలుగా తర్జనభర్జనలు చేసింది. ఇక, 14వ ఆర్థిక సంఘం నిధులు గత పాలకవర్గాల హయాంలోనే మంజూరయ్యాయి. కాని ప్రభుత్వం ఫ్రీజింగ్పెట్టి నిలిపివేసింది. ఆ పాలకవర్గాలు ఆ నిధులను డ్రా చేయలేక పోయాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు సైతం తాము ఎన్నికై నాలుగు నెలలు గడిచినా, అందుబాటులో నిధులు ఉన్నా, చివరకు వేసవిలో అత్యవసర పనులకు కూడా నిధులు డ్రా చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. గ్రామంలో అత్యవసరమైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు వంటి వాటికి కొందరు సర్పంచ్‌లు అప్పులు చేసి, మరికొందరు సొంత డబ్బులు ఖర్చు చేశారు. నిధులు ఉన్నా, ప్రభుత్వం చెక్‌పవర్ విషయం తేల్చని కారణంగా అప్పులు చేసి పనులు చేయాల్సి వచ్చింది. గత నెల 22వ తేదీన తేలిన చెక్ పవర్ గత నెల 22వ తేదీన ప్రభుత్వం చెక్ పవర్ అంశాన్ని తేల్చేసింది. సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది. జిల్లా పంచాయతీ అధికారి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు చెక్ పవర్‌పై ప్రొసీడింగ్స్‌ను ఈ నెల 3వ తేదీన ఇచ్చారు. వాటన్నింటినీ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపడంతో పాటు జిల్లాలోని 31 మండలాల ఎంపీడీఓలకు చెక్ పవర్ ప్రొసీడింగ్స్‌ను పంపించారు. చెక్ పవర్ వచ్చినా .. డిజిటల్ కిరికిరి ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం యాప్‌ను నేటికీ విడుదల చేయలేదు. దీంతో చెక్ పవర్ వచ్చినా అది ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి ఆన్లైన్లో మీ–సేవా కేంద్రం నుంచి అప్లోడ్ చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే ఆ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. అందులోకి వెళ్లి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన కోడ్‌ను నమోదు చేయాలి. సంబంధిత పని వివరాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఆ పనికి సంబంధించి ఎంబీ రికార్డు నంబర్‌ను నమోదు చేయాలి. ఆ పని ఎంత విలువైందో ఆ మొత్తాన్ని కూడా అందులో నమోదు చేయాలి. అప్పుడు ఆ అప్లికేషన్ పూర్తయినట్లవుతుంది. ఆ తర్వాత ఆన్లైన్లో సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలతో కూడిన డిజిటల్ చెక్కు బయటికి వస్తుంది. ఆ చెక్ రాగానే సర్పంచ్, ఉప సర్పంచ్ సెల్‌ఫోన్ నంబర్లకు ఓటీపీ నంబర్ వెళ్తుంది. దాన్ని తీసుకొని డీటీఓ, ఎంపీడీఓల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఎంపీడీఓ వద్దకు వెళ్లి సర్పంచ్, ఉపసర్పంచ్లు మూడు మూడు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కాగితంపై ఎంపీడీఓ సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి వచ్చి తన ముందే సంతకాలు చేశారని ధ్రువీకరిస్తూ ఎస్టీఓకు లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ తీసుకొని ఎస్టీఓ వద్దకు వెళ్లాలి. ఎస్టీఓ సర్పంచ్, ఉపసర్పంచ్ సెల్‌లకు వచ్చిన ఓటీపీ నంబర్లను అడుగుతారు. ఎంపీడీఓ ఇచ్చిన లెటర్‌ను తీసుకొని దానిపై ఎస్టీఓ ముందు మళ్లీ సర్పంచ్, ఉపసర్పంచ్ ఇరువురూ రెండు చొప్పున సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తి స్థాయిలో బిల్లుకోసం ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. ఎస్టీఓ ఆ బిల్లును పాస్ చేస్తాడు. ప్రస్తుతం చెక్ పవర్ విషయంలో ఇప్పటికే డీపీఓ ఎస్టీఓ, ఎంపీడీఓలకు పంపిన ప్రొసీడింగ్ల ఆధారంగా అన్ని గ్రామాల్లోని సర్పంచ్, ఉప సర్పంచుల డిజిటల్ సంతకాలను తీసుకుంటున్నారు. ఆ సంతకాలే డిజిటల్ చెక్ మీద రానున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఓ పక్క చెక్‌పవర్ ఇచ్చినా, ఈ డిజిటల్ యాప్ రాని కారణంగా చెక్‌పవర్ ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ విధానంతో సర్పంచులకు డబ్బుల డ్రా విషయంలో కిరికిరి తప్పేలా లేదు. చెక్ పవర్‌పై పునరాలోచన చేయాలి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం పునారాలోచన చేయాలి. ఉప సర్పంచ్‌కు బదులు కార్యదర్శిని భాగస్వాములను చేస్తే భయం ఉంటుంది. ఖర్చులు చేయడంలో సర్పంచ్‌కు ధైర్యం ఉంటుంది. ఇద్దరు ప్రజాప్రతినిధులకు చెక్‌పవర్ ఇవ్వడం వల్ల గ్రామాల్లో ఘర్షణలు, పంచాయితీలు ఎక్కువవుతాయి. ఈ విషయంలో సర్కార్ పునరాలోచన చేయాలి. – పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, సర్పంచ్, నకిరేకల్ చెక్ పవర్లేక అప్పుల పాలయ్యాను మునుగోడు: ఆరు నెలల క్రితం సర్పంచ్‌గా ఎన్నికైన నేను ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటుకు అప్పులు తెచ్చా ను. దాదాపు రూ. 20 లక్షలకు పైగా అప్పు చేశా. సాధ్యమైనంత త్వరగా చెక్ పవర్ అంది స్తే బాగుండు. పేరుకు సర్పంచ్లమైనా ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ప్రజలతో ఇబ్బందులు పడుతున్నాం. – మిర్యాల వెంకన్న, సర్పంచ్, మునుగోడు -
శిక్షణ లేకుండానే..!
సాక్షి, షాద్‌నగర్: కొత్తగా ఎంపికైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాలనలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పంచాయితీరాజ శాఖ ద్వారా ఎంపికైన వీరికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వకుండానే బాధ్యతలు అప్పగించింది. వారిని నేరుగా క్షేత్రస్థాయిలోకి పంపడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు విధిగా శిక్షణ ఇచ్చిన అనంతరం బాధ్యతలు అప్పగించడం సర్వసాధారణం. కానీ, కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వారికి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలూ నిర్వహించకుండానే గ్రామ పంచాయతీలను అప్పగించడంతో పాలనలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. మొత్తం 301 మంది నియామకం జిల్లాలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 558 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి పంచాయతీకి కార్యదర్శి నియమించేందుకు చర్యలు చేపట్టింది. పంచాయితీరాజ శాఖ ద్వారా జిల్లాలో 21 మండలాల్లో ఖాళీగా ఉన్న 301 పంచాయతీలకు కార్యదర్శుల పోస్టులను భర్తీ చేశారు. కొత్త కార్యదర్శులను ఏప్రిల్ 12న నియమించి ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీను కేటాయించి పాలనా బాధ్యతలను అప్పగించినట్లు జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి తెలిపారు. అయితే, వివిధ కారణాల నేపథ్యంలో కొందరు పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలను వదిలివెళ్తున్నారు. పనిభారం ఎక్కువై కొందరు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం ఇష్టం లేక మరికొందరు, ఇతర ఉద్యోగాలు రావడంతో మరికొందరు ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. తప్పులు జరిగితే చర్యలు.. గ్రామాభివృద్ధికి సంబంధించి పంచాయతీల నుంచి నిధులు డ్రా చేయడంలో అవకతవలు జరిగితే మాత్రం సర్పంచ్, కార్యదర్శిపై కఠిన చర్యలు తప్పవు. నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్‌ను సర్పంచ్, కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. అయితే, నిధులను ఏవిధంగా ఖర్చు చేయాలనే విషయంపై కొత్త కార్యదర్శులకు అవగాహన లేదు. అదేవిధంగా వీరు ప్రతినెలా తమ పనితీరును కొత్త పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన వెబ్సైట్లో పొందుపర్చాలి. లేదంటే చర్యలు తీసుకోనున్నారు. ‘రియల్’పై అవగాహన అంతంతే కొత్త పంచాయతీ కార్యదర్శులకు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై అంతగా అవగాహన లేదు. ఎంటెక్, బీటెక్, పీజీ తదితర కోర్సులు చదవి పంచాయతీ కార్యదర్శి పోస్టులు సాధించిన యువకులు అధికంగా ఉన్నారు. వీరికి గ్రామాల్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వానికి సంబంధించి భూముల కబ్జాలు, భవన నిర్మాణాల అనుమతులు తదితర ప్రధాన అంశాల్లో ఎన్నో కీలకంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో కార్యదర్శులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చిన తర్వాతే విధులు అప్పగించాలి. కానీ, ప్రభుత్వం అలాకాకుండా నేరుగా వారికి బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందిగా మారింది. సర్పంచ్‌లకు శిక్షణ.. మరీ కార్యదర్శులకు? కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మాత్రం బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే శిక్షణ తరగుతులు నిర్వహించి గ్రామాల అభివృద్ధి ఏవిధంగా చేయాలి, నిధులు ఏవిధంగా వినియోగించాలనే అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించింది. కానీ, కార్యదర్శులకు మాత్రం నేటి వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈనేపథ్యంలో విధుల నిర్వహణలో కొత్త కార్యదర్శులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వారికి శిక్షణ ఎప్పుడు ఇస్తారో కూడా ఎవరికీ స్పష్టత లేదు. కొత్త చట్టంపై అవగాహనేదీ.? గ్రామ పరిపాలనా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం– 2018ను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో కొత్త చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. కొత్త చట్టం ప్రకారం ప్రతి నెలా పంచాయతీ కార్యదర్శులు విధిగా తమ పనితీరును వెబ్సైట్లో నమోదుచేయాలి. అదేవిధంగా ప్లాట్ల లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులు, వీధి దీపాలు, మురుగు కాల్వలు, అంతర్గత రహదారులను నిర్వహించడంతోపాటుగా హరితహారాన్ని పటిష్టంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇలా.. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో అనేక కీలమైన అంశాలను పొందుపర్చింది. ప్రతి గ్రామానికి ఓ నర్సరీ ఏర్పాటు చేసింది. ఇందులో పంచాయతీ కార్యదర్శిగా కీలకంగా వ్యవహరించే విధంగా బాధ్యతలను పొందుపర్చింది. అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కు చెక్‌పవర్‌ను కేటాయించారు. పైఅంశాలపై పూర్తి స్థాయిలో కొత్త పంచాయతీ కార్యదర్శులకు అవగాహన లేదు. -
చెక్‌పవర్ కోసం భిక్షాటన..!
సాక్షి, నల్గొండ : సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించి 4 నెలలు దాటినా చెక్‌పవర్ లేకపోవడంతో కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దీనస్థితిలో పడిపోయామని జిల్లాలోని మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. వీలేనంత త్వరగా ప్రభుత్వం స్పందించి చెక్‌పవర్ ఇవ్వాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. భిక్షాటన చేస్తూ విరాళాలు సేకరించారు. చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్‌లు ఆయనకు మద్దతుగా నిలిచారు. చెక్‌పవర్ జీవోను వెంటనే జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
చెక్ ‘పవర్’ ఉండేనా?
మద్దూరు(హుస్నాబాద్) : పంచాయతీ కొత్త చట్టం ప్రకారం సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో ఉపసర్పంచ్ పదవులకు గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ పెరిగింది. ఈ పదవులను దక్కించుకొనేందుకు నాయకులు రూ.లక్షలలో ఖర్చులు చేశారు. అలాగే కొన్ని గ్రామాలలో సర్పంచ్ పదవులకు చేసిన ఖర్చులతో సమానంగా ఖర్చులు చేశాంటే ప్రభుత్వం ఉపసర్పంచ్‌కు చెక్ పవర్ కల్పిస్తామని చెప్పడంమే కారణం. అలాగే సర్పంచ్ పోటీలో ఉన్న ఆశావహులను ఉపసర్పంచ్ పదవులతో పార్టీలు బుజ్జగించిన సందర్భాలు ఉన్నాయి. వార్డు సభ్యుల అధిక ఖర్చులు.. మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలోని ఆశావహులు వార్డు సభ్యులుగా నామినేషన్ వేసిన నుంచే రూ.లక్షలలో ఖర్చులు చేశారు. ప్రతీ గ్రామం నుంచి మూడు వార్డులకు పైన ఎవరికీ వారే ఉపసర్పంచ్లగా భావించి అధిక మొత్తంలో ఖర్చులు చేశారు. అనంతరం గెలిచిన సభ్యులను ప్రలోభ పెట్టి ఉపసర్పంచ్లు అయిన సందర్భాలు ఉన్నాయి. అంత డిమాండ్ ఎందుకంటే కేవలం చెక్ పవర్ కోసమే. మరి ఇప్పుడు ఉపసర్పంచ్‌కు చెక్ పవర్ ఉంటుందా? లేదా? అన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఆలోచనలో ఉపసర్పంచులు.. సర్పంచ్ ఎన్నికలు ముగిసి కొత్త పంచాయితీల బాధ్యతలు స్వీకరించి పదిహేను రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు జాయింట్ చెక్ పవర్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి కాని, పంచాయతీరాజ్ కమిషన్ నుంచి కాని ఎలాంటి జీఓ రాక పోవడంతో ఉపసర్పంచ్లు ఎన్నికైన వారందరిలో రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. అలాగే ప్రజలు ప్రస్తుతం ఉపసర్పంచ్ చెక్ పవర్‌పై చర్చలు సాగిస్తున్నారు. దీనికి తోడు మహిళ సర్పంచ్‌లు ఉన్న దగ్గర వార్డు మెంబర్లుగా పోటీ చేసి పదవులు దక్కించుకొన్నా నాయకులు ఆలోచనలో పడ్డారు. ప్రతీ అభివృద్ధి పనిలో సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్‌పై సంతకం పెట్టాల్సి ఉండటంతో ఉపసర్పంచ్‌ల హవా ఉంటుందని చాల మంది లక్షలు ఖర్చులు చేశారు. ప్రభుత్వం మాత్రం ఇంక జీఓ విడదల చేయక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. జీఓ విడుదలలో జాప్యం.. ఇంతకు ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఉండేది. పంచాయితీ కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగి గనుక బాధ్యతతో నిధుల దుర్వినియోగం ఆరికట్ట వచ్చని వీరిద్దరికి చెక్ పవర్ ఇచ్చారు. కొత్త చట్టంలో మాత్రం పంచాయతీ కార్యదర్శికి బదులు ఉపసర్పంచ్‌కు చెక్ పవర్ ఉంటుందని చెప్నడమే తప్ప అధికారికంగా జీఓ విడదల కాలేదు. ఇదే ఇప్పడు చర్చకు దారి తీస్తుంది. హన్మతండాలో ఇప్పటి వరకు ఉప సర్పంచ్ ఎన్నిక కాక పోవడం కొస మెరుపు. మహిళా ఉప సర్పంచ్‌లే అధికం.. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 13 మంది మహిళ సర్పంచ్‌లకు రిజర్వు అయ్యాయి దీనితో పాటు మండలంలోని 7 గ్రామ పంచాయతీలలో మహిళ ఉప్ప సర్పంచ్‌లుగా ఎన్నికై మహిళలల సత్తాను నిరూపించారు. అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ఉవ్విళ్లురుతున్నారు. చెక్ పవర్ ఇవ్వాలి.. ప్రభుత్వం చెపినట్లుగా ప్రజా ప్రతి నిధులను అభివృద్ధిలో భాగస్వాములు చేయుటకు సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ అందించి ఉప సర్పంచ్‌లను గౌరవించాలి. – సింగపాక బాలమ్మ, అర్జున్‌పట్ల ఉపసర్పంచ్ అధికారిక సమాచారం లేదు.. గ్రామ పంచాయతీలలో చెక్ పవర్ ఎవ్వరెవ్వరికీ ఉంటుందనే విషయంపై ప్రభుత్వం నుంచి గాని పంచాయతీ రాజ్ కమిషన్ నుండి గాని ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. – శ్రీనివాస్ వర్మ, ఈఓపీఆర్డీ మద్దూరు -
ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్‌పై సర్కారు పునరాలోచన
సాక్షి, హైదరాబాద్ : గ్రామాల్లో సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు ఉమ్మడిగా చెక్ పవర్ ఇచ్చే అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. దీనిని ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చేర్చి ఆమోదం పొందినా... ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనను ఉప సంహరించుకోవాలని భావిస్తోంది. దీనితోపాటు కొత్త చట్టంలోని పలు ఇతర నిబంధనలనూ మార్చాలని యోచిస్తోంది. ఇందుకోసం చట్టానికి సవరణలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ దిశగానే కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని పలు నిబంధనలను అమల్లోకి తీసుకురాకుండా ‘మినహాయింపు’ పేరిట నిలిపివేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భిన్నాభిప్రాయాల నేపథ్యంలో.. ఇటీవలి వరకు అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామంలో సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికి సంయుక్తంగా చెక్ పవర్ ఉండేది. అయితే ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది. గ్రామ కార్యదర్శి అధికారానికి కత్తెర వేసింది. దానికి బదులుగా సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్‌ను కల్పించింది. కానీ కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చినా.. ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ అంశాన్ని అమల్లోకి తీసుకురావడంపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటమే దీనికి కారణం. గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు సంయుక్తంగా చెక్ పవర్ ఇస్తే రాజకీయ విభేదాలు రాజేసినట్లవుతుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా, వారి మధ్య రాజకీయ స్పర్థలున్నా.. సమన్వయం లోపించి, నిధుల వినియోగం గాడి తప్పుతుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో లేనిపోని చిక్కులు ఎదురవుతాయనే భావన వ్యక్తమవుతోంది. గ్రామ పాలన, అభివృద్ధిపై ప్రభావం సాధారణంగా గ్రామ సభ తీర్మానాలు, పాలకవర్గం నిర్ణయాలకు అనుగుణంగానే గ్రామాల్లో నిధులు ఖర్చు చేస్తారు. గ్రామ కార్యదర్శి– సర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్ పవర్ ఉన్నప్పుడు... సర్పంచ్ ఏదైనా చెక్కుపై సంతకం చేస్తే, ఆ నిధులను వేటికి ఖర్చు చేస్తున్నారు, సంబంధిత తీర్మానం ఉందా.. లేదా వంటి అంశాలను కార్యదర్శి పరిశీలించి సంతకం చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారి పరిశీలన విధానం కాకుండా.. నేరుగా ఇద్దరు ప్రజాప్రతినిధులకే చెక్ పవర్ కల్పించారు. దీనివల్ల నిధుల వినియోగం ప్రశ్నార్థకంగా మారుతుందని అధికారవర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల గ్రామ పాలన, అభివృద్ధిపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ నిబంధనను అమలుపై సర్కారు పునరాలోచనలో పడింది. మరిన్ని అంశాలపైనా సందిగ్ధం..! కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో తొమ్మిది అంశాలను మాత్రం ప్రస్తుతం అమల్లోకి తేవడం లేదంటూ మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం 2018 జూలై ఆఖరుతో ముగుస్తుందని.. అనంతరం అన్ని నిబంధనలు అమల్లోకి తెస్తామని ప్రకటించింది. కానీ సర్పంచ్–ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌తోపాటు పలు ఇతర అంశాలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో.. వాటిలో సవరణలు చేసే అవకాశమున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త చట్టంలో నుంచి అమలు మినహాయించిన అంశాల్లో... ఉప సర్పంచ్‌కు చెక్ పవర్, ఆడిట్ పత్రాలు సమర్పించకపోతే సర్పంచ్, కార్యదర్శులను విధుల్లోంచి తొలగించటం, గ్రామాల్లో మొక్కల పెంపకానికి సంబంధించి కార్యదర్శిపై చర్యలు, సర్పంచ్‌లను సస్పెండ్ చేసేలా కలెక్టర్‌కు అధికారాలు, కార్యదర్శి తన పనితీరు నివేదికను బహిరంగపర్చకుంటే చర్యలు, లేఔట్లు–భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సమకూర్చటం, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, పంచాయతీలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా గ్రామసభ కోరం ఉండాలనే నిబంధనలను మినహాయించారు. ఇందులో గ్రామ కార్యదర్శులపై కఠిన చర్యలకు సంబంధించి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెక్ పవర్ లేకున్నా కార్యదర్శులను ఆడిటింగ్ బాధ్యులను చేయటం, హరితహారం మొక్కల పెంపకంలో చర్యలు తీసుకునేలా నిబంధనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధనల్లో సర్పంచ్‌లనే బాధ్యులుగా చేయాల్సిన సర్కారు.. కార్యదర్శులపై కటువుగా ఉండటమేమిటనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలోని పలు నిబంధనలను సవరించడం లేదా పూర్తిగా పక్కనపెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
సర్పంచులకే చెక్ పవర్!
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ చట్టానికి కీలక సవరణలు తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాల్లో సర్పంచ్‌లకే పూర్తి అధికారాలు కట్టబెట్టేలా చర్యలు చేపడుతోంది. ఇకపై చెక్ పవర్‌ను సర్పంచులకే అప్పగించాలని నిర్ణయించింది. గ్రామాభివృద్ధికి నిధులను ఖర్చుచేసే విషయంలో కీలకమైన చెక్ పవర్ ప్రస్తుతం సర్పంచ్‌కు, పంచాయతీ కార్యదర్శికి కలిపి ఉమ్మడిగా (జాయింట్ చెక్ పవర్) ఉంది. ఇప్పుడు ప్రభుత్వం సర్పంచ్‌లకే పూర్తిగా చెక్ పవర్‌ను అప్పగించాలని నిర్ణయించింది. ఇక గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ కాలపరిమితిని కూడా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రొటేషన్ పద్ధతిలో ప్రతి ఐదేళ్లకోసారి రిజర్వేషన్ మారిపోతుంది. దీనిని పదేళ్లకు పెంచేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇక గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం మహిళలకు 33% రిజర్వేషన్ అమల్లో ఉంది. ఈ రిజర్వేషన్లను యాభై శాతానికి పెంచాలని యోచిస్తున్నారు. మొత్తంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు ను ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. -
విపక్ష సర్పంచ్‌కు.. ‘చెక్’
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులివ్వకుండా వారి స్థానంలో ఆ నిధులను పార్టీ నాయకులకు అందిస్తూ ఏకంగా జీవోలే జారీ చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇపుడు తన దృష్టిని ప్రతిపక్షపార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులపై కేంద్రీకరించింది. గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన బలమైన సర్పంచ్‌లపై వలవేస్తున్నారు.. వారిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. వారు లొంగకపోతే ‘చెక్ పవర్’ను అడ్డుపెట్టుకుని నాటకాలాడుతున్నారు. అధికారపార్టీవారే ఉన్నవీ లేనివి ఆరోపణలు చేస్తూ.. అధికారులతో తనిఖీల పేరుతో వత్తిడి చేయడం అప్పటికీ లొంగకపోతే చెక్‌పవర్‌ను రద్దు చేయించడం... ఇదీ జరుగుతోంది. సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు చేయించి గ్రామాల్లో ఏ పని జరగాలన్నా జన్మభూమి కమిటీలపై ఆధారపడేలా చేస్తున్నారు. తమపై ఉన్నవీ లేనివి ఆరోపణలను సృష్టించి అధికారులను ఉపయోగించుకుని తమపై ఒత్తిడి చేస్తున్నారని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఆరునెలల్లో విచారణ పూర్తిచేయాలని, ఆరోపణలు రుజువు కాకపోతే చెక్‌పవర్‌ను పునరుద్ధరించాలని చట్టం చెబుతున్నా రెండేళ్లపాటు చెక్‌పవర్‌ను పునరుద్ధరించని ఉదంతాలున్నాయంటే అధికారపార్టీ నాయకులు ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. 6 నెలల్లో విచారణ పూర్తవ్వాల్సి ఉన్నా... అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సర్పంచుల చెక్ పవర్ రద్దు చేసే అధికారం పంచాయతీ కమిషనర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ అధికారాన్ని రాష్ట్రప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఆరోపణలు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు 3 నెలల పాటు సర్పంచుల చెక్ పవర్ రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చారు. ఆ లోగా విచారణ పూర్తి కాకపోతే మరో 3నెలల పాటు చెక్‌పవర్ రద్దును కొనసాగించేందుకు కలెక్టర్లు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 6 నెలల్లో విచారణను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. తప్పు జరిగినట్టు నిర్ధారణ అయితే, సర్పంచిని తొలగించే అధికారం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 249 ద్వారా ఉంది. అయితే, ఆరోపణల పేరుతో సర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేస్తున్న జిల్లా యంత్రాంగం నిర్ణీత కాలంలో పునరుద్ధరించక పోగా కనీసం ఆ సమాచారాన్ని రాష్ట్ర పంచాయతీ కార్యాలయానికి కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అనేక చోట్ల 6 నెలల తరువాత కూడా చెక్ పవర్ రద్దు కొనసాగుతోంది. కానీ, గత మూడేళ్లలో కేవలం 12 కేసుల్లో మాత్రమే విచారణ పొడిగింపునకు అనుమతించాలని కోరుతూ కలెక్టర్లు పంచాయతీరాజ్ కమిషనర్‌కు లేఖలు రాశారు. దివాన్ చెరువు(తూర్పుగోదావరి). గిద్దలూరు (నెల్లూరు), లింగారావుపాలెం (గుంటూరు) సర్పంచులను తొలగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. అన్నీ చిన్న కారణాలే.. – ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలం పోలేపల్లి పంచాయితీకి చెందిన దేవెండ్ల సుబ్బరాయుడు (వైఎస్సార్సీపీ) సర్పంచ్ చెక్‌పవర్‌ను 2017 ఏప్రిల్ 3న రద్దు చేసారు. పంచాయతీలో కుక్కలను చంపించినందుకు, ఎంపీ నిధులతో సామాజిక భవన నిర్మాణ నిమిత్తం పాత పాఠశాల భవనాన్ని తొలగించినందుకు, సైడు కాలువలలో పూడిక తీతను తీసివేయించనందుకు చెక్ పవర్‌ను రద్దు చేసారు. 12 మంది వార్డు సభ్యులలో పది మంది సభ్యుల మెజార్టీ సుబ్బరాయుడుకు ఉన్నా ఏకపక్షంగా చెక్ పవర్‌ను రద్దు చేశారు. – శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తొమ్మిది మంది సర్పంచుల చెక్ పవర్ రద్దయ్యింది. వీరంతా వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 19 మంది చెక్ పవర్రద్దు కాగా, వారిలో 16 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులే. –అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 12 మంది చెక్‌పవర్ రద్దు కాగా, అందులో 11 మంది వైఎస్సార్సీపీ అభిమానులే. నెల్లూరులో 9 మంది చెక్‌పవర్ రద్దు చేయగా, అందులో ఏడుగురు వైఎస్సార్సీపీ వాళ్లు. –గుంటూరు జిల్లాలో 20 మంది చెక్‌పవర్ రద్దు చేయగా, వారిలో 14 మంది ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన సర్పంచులపై అధికారుల ద్వారా తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చారన్న ఆరోపణలున్నాయి. పంచాయతీ రికార్డులను తనిఖీ చేయాల్సిన ఈవోపీఆర్డీలను ఆయా గ్రామ పంచాయతీలకు తనిఖీలకు పంపి, రికార్డులను వారాల తరబడి తమ వద్దే ఉంచుకొని ఒత్తిళ్లు తెచ్చి పలువురు సర్పంచులను బలవంతంగా అధికార పార్టీలోకి చేర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. హైకోర్టు ఆదేశించినా పునరుద్ధరించలేదు.. చిన్న విషయాలను కారణంగా చూపుతూ అధికార పార్టీ మంత్రి నా చెక్ పవర్ రద్దు చేయించారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించాను. చెక్ పవర్ పునరుద్ధరించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. డీపీఓ వద్ద ఫైల్ అలాగే ఉంది. మూడు నెలలుగా తిరుగుతున్నా ఇంత వరకు చెక్ పవర్ పునరుద్ధరించలేదు. –దెవెండ్ల సుబ్బరాయుడు, ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం, పోలేపల్లి గ్రామ సర్పంచి తనిఖీ చేయకుండానే... నా భర్త వీరరాఘవులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల బీసీ నాయకులు. నిధులు గోల్ మాల్ అయ్యాయంటూ గత ఏడాది ఏప్రిల్‌లో రాజమండ్రి డీఎల్పీవో చెక్ పవర్ రద్దు చేశారు. కానీ డీఎల్పీవో ఎలాంటి తనిఖీలూ చేయకుండానే కార్యదర్శి ఇచ్చిన నివేదిక అధారంగా నిర్ణయం తీసుకున్నారు. – పెంకే కృష్ణవేణి, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం కందుల పాలెం గ్రామ సర్పంచి సర్పంచుల ‘చెక్ పవర్ ’ ఏమిటంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి వీలుగా ఆ గ్రామ ప్రజలెన్నుకున్న సర్పంచికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా చెక్ పవర్‌ను కల్పించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే ఈ నిర్ణయం జరిగింది. గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ అందుబాటులో ఉండరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికీ అనేక గ్రామ పంచాయతీలకు పూర్తి స్థాయి కార్యదర్శులు కూడా లేని పరిస్థితుల్లో సర్పంచులకు చెక్‌పవర్ ఉండడం వల్ల అనేక స్థానిక సమస్యల పరిష్కారానికి వీలవుతుంది. -
క్రికెటర్లకు తినడానికీ డబ్బుల్లేవు!
బీసీసీఐని సంస్కరించడానికి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాల పుణ్యమాని ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో తలపడుతున్న భారత అండర్-19 జట్టుకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఆటగాళ్లతో పాటు చివరకు కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా కనీసం తినడానికి కూడా డబ్బులు అందడం లేదు! కార్యదర్శి పదవి నుంచి అజయ్ షిర్కేను తొలగించడంతో.. చెక్కుల మీద సంతకాలు పెట్టే అధికారి ఎవరి వద్దా లేకుండా పోయింది. దాంతో ఆటగాళ్లకు, ద్రవిడ్‌కు డబ్బులు అందట్లేదు. జూనియర్ క్రికెటర్లకు రోజుకు రూ. 6800 చొప్పున రావాల్సి ఉంది. కానీ ఆ డబ్బులు రావడం లేదు. దాంతో వాళ్లంతా తమ భోజనం ఖర్చులు జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోంది. చాలామంది తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకుంటున్నారు. కొత్తగా చెక్ పవర్ ఎవరికో ఒకరికి ఇవ్వాలంటే బీసీసీఐ సభ్యులు కొత్త తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. సిరీస్ ముగిసిపోగానే మొత్తం డీఏ ఎంత అవుతుందో లెక్కచూసి ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఖాతాలకు పంపేస్తామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం బీసీసీఐలో కూడా చాలా సమస్యలున్నాయని, చెక్ పవర్ ఎవరివద్దా లేకపోవడంతో చెల్లింపులు ఏవీ చేయలేకపోతున్నామని అన్నారు. మ్యాచ్‌లు జరిగే రోజుల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆతిథ్య సంఘం ఏర్పాటుచేస్తోందని, బ్రేక్‌ఫాస్ట్ అయితే హోటల్ నుంచి కాంప్లిమెంటరీగా అందుతోందని అండర్-19 క్రికెట్ టీమ్ సభ్యుడొకరు చెప్పారు. ముంబైలో తమను ఓ స్టార్హోటల్లో ఉంచారని, అక్కడ శాండ్విచ్ తినాలన్నా రూ. 1500 పెట్టాల్సి వస్తోందని వాపోయారు. రోజంతా ఆడి అలిసిపోయిన ఆటగాళ్లు భోజనం కోసం మళ్లీ బయటకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు కోసం హైదరాబాద్ వచ్చిన సీనియర్ జట్టుకు మాత్రం ఇలాంటి సమస్యలు ఏమీ లేవు. ఆటగాళ్ల రోజువారీ అలవెన్సుల విషయాన్ని చూసుకోవాలని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) తెలిపింది. -
తీగలగుట్టపల్లి సర్పంచ్ చెక్‌పవర్‌పై ఆంక్షలు
కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి సర్పంచ్ జంగపల్లి మల్లయ్య చెక్‌పవర్ వినియోగంపై ఆంక్షలు విధిస్తూ జెడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో సూరజ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై కె.ఉపేందర్ ఫిర్యాదుతో డీఎల్పీవో చేపట్టిన విచారణ నివేదిక మేరకు చెక్కు విడిపించే అధికారాన్ని ఈవోపీఆర్డీ కౌంటర్ సంతకంతో జత చేశారు. గ్రామపంచాయతీకి సంబంధించిన బిల్లులు, ఓచర్లు, రశీదులను తగిన ఆధారాలు పరిశీలించిన తర్వాతే సర్పంచ్, కార్యదర్శి సంతకం చేసిన తర్వాతనే చెక్కుపై కౌంటర్ సంతకం చేయాలని ఈవోపీఆర్డీకి సూచించారు. -
'సీఎంతో చర్చించి సర్పంచ్ ల గౌరవ వేతనం పెంచుతాం'
హైదరాబాద్: సర్పంచులకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి, వెంటనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని, క చ్చితంగా గౌరవ వేతనాలను పెంచుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జిల్లా పరిషత్తు ఛైర్మన్లతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పంచాయతీల్లో చెక్ పవర్‌ని కేవలం సర్పంచులకు పరిమితం చేస్తూ, జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రజల సొమ్మును పారదర్శకంగా ఖర్చు చేయాలని, తాము కేవలం ధర్మకర్తలం మాత్రమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామాల్లో పన్నుల చెల్లింపులు పెరిగాయని, అయితే వాటిని మరింతగా పెంచి గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చాలన్నారు. ఈ ప్రయత్నంలో తన నియోజకవర్గం సిరిసిల్లాలో దాదాపు వందశాతం పన్నుల వసూలును పూర్తి చేసిన విషయాన్ని వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా గౌరవ వేతనాలను పెంచుతామని, వారికి ప్రోటోకాల్ గౌరవాన్ని కల్పిస్తామన్నారు. నిధుల విషయంలో స్థానిక సంస్థలకే పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని, 13వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా స్థానిక సంస్థలకే ఇచ్చామన్నారు. పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామి, సీఎంతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామాల్లో తాగునీటి బోర్ల విద్యుత్తు కనెక్షన్లను తీసేయకుండా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ పథకాలు విజయవంతంగా పూర్తి చేసిన గ్రామాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వ్యవస్థలను అధ్యయనం చేశామన్నారు. తాము స్థానిక సంస్థలు అధికారాలు ఇచ్చేందకు సిద్ధంగా ఉన్నామని, అయితే వారు కచ్చితంగా బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని, తద్వారా నిజమైన గ్రామీణ ప్రగతిని సాధిస్తామన్నారు. స్థానిక సంస్థల ద్వారానే బంగారు తెలంగాణ సాధించాలన్న ముఖ్యమంత్రి కలను సాకారం చేస్తామని, ఇందుకు స్థానిక సంస్థల ప్రతినిధులు కలిసి రావాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనిత రాంచంద్రన్, ఎంఎల్సీలు నరేందర్‌రెడ్డి, రాముల నాయక్ పాల్గొన్నారు. -
సర్పంచ్‌లకే చెక్‌పవర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీఓఎంఎస్ 431 ద్వారా చెక్‌పవర్, జీఓఎంఎస్ 432 ద్వారా చెక్‌పవర్ వినియోగించడంలో మార్గదర్శకాలను నిర్దేశించింది. జూలైలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి నూతన పాలక మండళ్లు ఏర్పాటయ్యాయి. పంచాయతీ నిధులను వ్యయంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో పాటు గ్రామ కార్యదర్శులకు సంయుక్తంగా చెక్‌పవర్‌ను కట్టబెట్టింది ప్రభుత్వం. పంచాయతీ కార్యదర్శులకు చెక్‌పవర్ ఇవ్వడం రాజ్యాంగంలోని 73, 74 అధికరణకు విరుద్దమంటూ సర్పంచ్‌లు ఆందోళన బాట పట్టారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఒక్కో కార్యదర్శి రెండుకు పైగా పంచాయతీల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధుల వ్యయం బాధ్యతలను పూర్తిగా సర్పంచ్‌లకే అప్పగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే చెక్‌పవర్ వినియోగించడంలో పలు మార్గదర్శకాలు చేసింది. నిధులు డ్రా చేయడంలో నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీ అధికారిపైనే ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు పంచాయతీ ఆమోదంతోనే సర్పంచ్ నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. క్యాష్‌బుక్‌తో పాటు సంబంధిత రిజిస్టర్లలో నిధుల వ్యయం వివరాలను నమోదు చేసిన తర్వాతే కార్యదర్శులు చెక్కులను సిద్ధం చేయాలని తెలిపింది. పన్నులు, తలసరి గ్రాంటు, 13వ ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల వ్యయంలో తమకే హక్కు ఉండాలంటూ సర్పంచ్‌లు ఇంతకాలం ఒత్తిడి తెస్తూ వచ్చారు. చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
సర్పంచ్ల పవర్‌కు ‘చెక్’
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సర్పంచ్‌లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చెక్‌పవర్ విషయంలో వారికి చెక్ పెట్టింది. నిధుల వినియోగంలో జవాబుదారీతనం లేక ఏటా కోట్లాది రూపాయలు దుర్వినియోగమవుతున్నాయనే కారణంతో సర్పంచ్‌లతో పాటు కార్యదర్శులకు కలిపి సంయుక్తంగా చెక్‌పవర్ కట్టబెట్టింది. దీంతో పాటు నిధుల వినియోగంపైనా కొన్ని ఆంక్షలు విధించింది. తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు జీఓ 385 ప్రకారం ఇకపై గ్రామానికి సంబంధించిన నిధులు ఖర్చు చేయాలంటే సర్పంచ్, కార్యదర్శులు ఉమ్మడిగా చెక్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 1028 పంచాయతీలుండగా 1020 పంచాయతీలకు నూతన సర్పంచ్‌లు కొలువుదీరారు. ఉమ్మడి చెక్‌పవర్ వలన తక్షణం నిర్వహించాల్సిన పనుల్లో తీవ్ర జాప్యం జరగవచ్చని పలువురు సర్పంచ్‌లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉమ్మడి చెక్‌పవర్ వలన పంచాయతీ నిధుల ఖర్చు, పనుల్లో పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్ర స్థాయిలో సమస్యలు: స్థానిక సంస్థల్లో చెక్‌పవర్ కలిగిన హోదా సర్పంచ్‌లది మాత్రమే. పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం మైనర్ పంచాయతీల్లో లక్ష రూపాయల వరకూ సర్పంచ్ నిధులను ఖర్చు చేసుకోవచ్చు. లక్ష దాటితే డీఎల్పీఓ అనుమతి తీసుకోవాలి. అదే మేజర్ పంచాయతీల్లో అయితే * 2 లక్షల వరకూ ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. అది దాటితే జిల్లా పాలనాధికారి అనుమతి తప్పని సరి. ప్రస్తుతం చెక్‌పవర్‌ను కార్యదర్శితో సంయుక్తంగా పంచుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో అవినీతికి, ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా క్షేత్రస్థాయిలో కార్యాచరణ పరంగా సమస్యలు ఉత్పన్నం కావచ్చని పంచాయతీరాజ్ విభాగం అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పంచాయతీలకు పాలకవర్గం ఉంటే అభివృద్ధి పనుల విషయంలో తక్షణ స్పందన ఉంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సుదీర్ఘ కాలం ప్రత్యేకాధికారుల పాలన తరువాత నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఎన్నో సమస్యలు స్వాగతం పలికాయి. జిల్లాలో మేజర్ పంచాయతీలు 70కుపైగానే ఉన్నాయి. వీటికి కార్యదర్శులు తగినంత మందిలేరు. రెండేసి మేజర్ పంచాయతీలకు కలిపి ఒక ఈఓ ఉన్నారు. వీటిలో చాలాచోట్ల సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు స్థానికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగినవారు, ముఖ్యనేతల అనుచరులున్నారు. మైనర్ పంచాయతీల్లోనూ పలుకుబడి కలిగిన వ్యక్తులు సర్పంచ్‌లుగా ఉన్నవారున్నారు. ఇలాంటి గ్రామాల్లో ఉమ్మడి చెక్‌పవర్ ప్రధాన సమస్యగా మారుతుంది. సర్పంచ్ చెక్‌పై సంతకం చేయాలని ఆదేశిస్తే తిరస్కరించే పరిస్థితి కార్యదర్శికి ఉండదు. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అధికారులకే ఇబ్బందులు... చెక్‌పవర్ విషయంలో కార్యదర్శులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి గ్రామాల్లో నెలకొంటుంది. దీంతో నిధులు వెచ్చించేందుకు అనుమతులిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో కొన్ని చోట్ల పనుల్లో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. సర్పంచ్ పదవీ కాలం ముగిశాక పదవి నుంచి తప్పుకుంటారు. అయితే కార్యదర్శి మాత్రం నిధుల వినయోగానికి సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదే అంశంపై కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సంఘాల నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇలా వివిధ రూపాల్లో పంచాయతీలకు నిధులందుతాయి. వీటి వెచ్చింపుకు మరి కొంత సమయం పడుతుంది. ఈ లోగా గ్రామాల్లో తాగునీటి వనరులకు తాత్కాలిక మరమ్మతులు, పారిశుధ్య పనులు, బ్లీచింగ్, కార్యాలయ నిర్వహణ తదితర అవసరాలకు నిధులు అత్యవసరం. ఈ విషయాల్లో ఉమ్మడి చెక్ పవర్ పై సర్పంచ్, గ్రామ కార్యదర్శుల మధ్య విభేదాలు వస్తే గ్రామ పాలనలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇరువర్గాల్లో అసంతృప్తి.. ఉమ్మడి చెక్‌పవర్‌పై అటు సర్పంచ్‌లు, ఇటు కార్యదర్శుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తమను కీలుబొమ్మలుగా ఆడించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై కొందరు సర్పంచ్‌లు న్యాయస్థానానికి వెళ్లే యోచనలో ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి నిధులు వెచ్చిస్తే ఆ నేరం కార్యదర్శులపై రుద్దేందుకు అవకాశం ఉంటుందని అధికారులంటున్నారు. పాలకవర్గానికి ప్రభుత్వ నియమ నిబంధనలను తెలియచేసే వరకే తమ పాత్రను పరిమితం చేయాలని కోరుతున్నారు. -
సర్పంచ్ల చెక్ పవర్ కట్..!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్‌లను ప్రభుత్వం మరోసారి అవమానించింది. పారదర్శకత పేరిట చెక్కులపై సర్పంచ్‌లు సంతకం చేసే అధికారానికి షరతులు పెట్టింది. సర్పంచ్ ఒక్కరే కాకుండా పంచాయతీ కార్యదర్శి కూడా చెక్కుపై సంతకం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి.. కొత్తగా 21 వేల పంచాయతీలకు సర్పంచ్‌లు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి సోమవారం వరకు కూడా ప్రత్యేకాధికారులు, గ్రామ కార్యదర్శులు చెక్కులపై సంతకాలు చేస్తూ వచ్చారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వివిధ పథకాల నిధుల వ్యయానికి సంబంధించి ఇచ్చే చెక్కులపై సర్పంచ్‌తోపాటు, గ్రామ కార్యదర్శి విధిగా సంతకం చేయాల్సిందేనని తాజా ఉత్తర్వుల్లో ముఖ్యకార్యదర్శి స్పష్టం చేశారు. కాగా, సర్పంచ్‌లు ఒక్కరికే చెక్ పవర్ కల్పించకుండా పంచాయతీ కార్యదర్శికి కూడా అవకాశం కల్పించడాన్ని రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ప్రజాప్రతినిధులను అవమానించడమేనని మండిపడ్డారు. -
సర్పంచ్ల చెక్ పవర్ కట్..!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్‌లను ప్రభుత్వం మరోసారి అవమానించింది. పారదర్శకత పేరిట చెక్కులపై సర్పంచ్‌లు సంతకం చేసే అధికారానికి షరతులు పెట్టింది. సర్పంచ్ ఒక్కరే కాకుండా పంచాయతీ కార్యదర్శి కూడా చెక్కుపై సంతకం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి.. కొత్తగా 21 వేల పంచాయతీలకు సర్పంచ్‌లు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి సోమవారం వరకు కూడా ప్రత్యేకాధికారులు, గ్రామ కార్యదర్శులు చెక్కులపై సంతకాలు చేస్తూ వచ్చారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వివిధ పథకాల నిధుల వ్యయానికి సంబంధించి ఇచ్చే చెక్కులపై సర్పంచ్‌తోపాటు, గ్రామ కార్యదర్శి విధిగా సంతకం చేయాల్సిందేనని తాజా ఉత్తర్వుల్లో ముఖ్యకార్యదర్శి స్పష్టం చేశారు. కాగా, సర్పంచ్‌లు ఒక్కరికే చెక్ పవర్ కల్పించకుండా పంచాయతీ కార్యదర్శికి కూడా అవకాశం కల్పించడాన్ని రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ప్రజాప్రతినిధులను అవమానించడమేనని మండిపడ్డారు.