సర్పంచ్‌ల పవర్‌కు ‘చెక్’
Published Wed, Aug 28 2013 4:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సర్పంచ్‌లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చెక్‌పవర్ విషయంలో వారికి చెక్ పెట్టింది. నిధుల వినియోగంలో జవాబుదారీతనం లేక ఏటా కోట్లాది రూపాయలు దుర్వినియోగమవుతున్నాయనే కారణంతో సర్పంచ్‌లతో పాటు కార్యదర్శులకు కలిపి సంయుక్తంగా చెక్‌పవర్ కట్టబెట్టింది. దీంతో పాటు నిధుల వినియోగంపైనా కొన్ని ఆంక్షలు విధించింది. తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు జీఓ 385 ప్రకారం ఇకపై గ్రామానికి సంబంధించిన నిధులు ఖర్చు చేయాలంటే సర్పంచ్, కార్యదర్శులు ఉమ్మడిగా చెక్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 1028 పంచాయతీలుండగా 1020 పంచాయతీలకు నూతన సర్పంచ్‌లు కొలువుదీరారు. ఉమ్మడి చెక్‌పవర్ వలన తక్షణం నిర్వహించాల్సిన పనుల్లో తీవ్ర జాప్యం జరగవచ్చని పలువురు సర్పంచ్‌లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉమ్మడి చెక్‌పవర్ వలన పంచాయతీ నిధుల ఖర్చు, పనుల్లో పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
క్షేత్ర స్థాయిలో సమస్యలు:
స్థానిక సంస్థల్లో చెక్‌పవర్ కలిగిన హోదా సర్పంచ్‌లది మాత్రమే. పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం మైనర్ పంచాయతీల్లో లక్ష రూపాయల వరకూ సర్పంచ్ నిధులను ఖర్చు చేసుకోవచ్చు. లక్ష దాటితే డీఎల్‌పీఓ అనుమతి తీసుకోవాలి. అదే మేజర్ పంచాయతీల్లో అయితే * 2 లక్షల వరకూ ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. అది దాటితే జిల్లా పాలనాధికారి అనుమతి తప్పని సరి. ప్రస్తుతం చెక్‌పవర్‌ను కార్యదర్శితో సంయుక్తంగా పంచుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో అవినీతికి, ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా క్షేత్రస్థాయిలో కార్యాచరణ పరంగా సమస్యలు ఉత్పన్నం కావచ్చని పంచాయతీరాజ్ విభాగం అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పంచాయతీలకు పాలకవర్గం ఉంటే అభివృద్ధి పనుల విషయంలో తక్షణ స్పందన ఉంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సుదీర్ఘ కాలం ప్రత్యేకాధికారుల పాలన తరువాత నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఎన్నో సమస్యలు స్వాగతం పలికాయి.
జిల్లాలో మేజర్ పంచాయతీలు 70కుపైగానే ఉన్నాయి. వీటికి కార్యదర్శులు తగినంత మందిలేరు. రెండేసి మేజర్ పంచాయతీలకు కలిపి ఒక ఈఓ ఉన్నారు. వీటిలో చాలాచోట్ల సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు స్థానికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగినవారు, ముఖ్యనేతల అనుచరులున్నారు. మైనర్ పంచాయతీల్లోనూ పలుకుబడి కలిగిన వ్యక్తులు సర్పంచ్‌లుగా ఉన్నవారున్నారు. ఇలాంటి గ్రామాల్లో ఉమ్మడి చెక్‌పవర్ ప్రధాన సమస్యగా మారుతుంది. సర్పంచ్ చెక్‌పై సంతకం చేయాలని ఆదేశిస్తే తిరస్కరించే పరిస్థితి కార్యదర్శికి ఉండదు. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ప్రభావం చూపుతాయి.
అధికారులకే ఇబ్బందులు...
చెక్‌పవర్ విషయంలో కార్యదర్శులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి గ్రామాల్లో నెలకొంటుంది. దీంతో నిధులు వెచ్చించేందుకు అనుమతులిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో కొన్ని చోట్ల పనుల్లో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. సర్పంచ్ పదవీ కాలం ముగిశాక పదవి నుంచి తప్పుకుంటారు. అయితే కార్యదర్శి మాత్రం నిధుల వినయోగానికి సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదే అంశంపై కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సంఘాల నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇలా వివిధ రూపాల్లో పంచాయతీలకు నిధులందుతాయి. వీటి వెచ్చింపుకు మరి కొంత సమయం పడుతుంది. ఈ లోగా గ్రామాల్లో తాగునీటి వనరులకు తాత్కాలిక మరమ్మతులు, పారిశుధ్య పనులు, బ్లీచింగ్, కార్యాలయ నిర్వహణ తదితర అవసరాలకు నిధులు అత్యవసరం. ఈ విషయాల్లో ఉమ్మడి చెక్ పవర్ పై సర్పంచ్, గ్రామ కార్యదర్శుల మధ్య విభేదాలు వస్తే గ్రామ పాలనలో ఇబ్బందులు తలెత్తుతాయి.
ఇరువర్గాల్లో అసంతృప్తి..
ఉమ్మడి చెక్‌పవర్‌పై అటు సర్పంచ్‌లు, ఇటు కార్యదర్శుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తమను కీలుబొమ్మలుగా ఆడించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై కొందరు సర్పంచ్‌లు న్యాయస్థానానికి వెళ్లే యోచనలో ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి నిధులు వెచ్చిస్తే ఆ నేరం కార్యదర్శులపై రుద్దేందుకు అవకాశం ఉంటుందని అధికారులంటున్నారు. పాలకవర్గానికి ప్రభుత్వ నియమ నిబంధనలను తెలియచేసే వరకే తమ పాత్రను పరిమితం చేయాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement