సాక్షి, అమరావతి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులివ్వకుండా వారి స్థానంలో ఆ నిధులను పార్టీ నాయకులకు అందిస్తూ ఏకంగా జీవోలే జారీ చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇపుడు తన దృష్టిని ప్రతిపక్షపార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులపై కేంద్రీకరించింది. గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన బలమైన సర్పంచ్‌లపై వలవేస్తున్నారు.. వారిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. వారు లొంగకపోతే ‘చెక్ పవర్’ను అడ్డుపెట్టుకుని నాటకాలాడుతున్నారు. అధికారపార్టీవారే ఉన్నవీ లేనివి ఆరోపణలు చేస్తూ.. అధికారులతో తనిఖీల పేరుతో వత్తిడి చేయడం అప్పటికీ లొంగకపోతే చెక్‌పవర్‌ను రద్దు చేయించడం... ఇదీ జరుగుతోంది. సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేయించి గ్రామాల్లో ఏ పని జరగాలన్నా జన్మభూమి కమిటీలపై ఆధారపడేలా చేస్తున్నారు. తమపై ఉన్నవీ లేనివి ఆరోపణలను సృష్టించి అధికారులను ఉపయోగించుకుని తమపై ఒత్తిడి చేస్తున్నారని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఆరునెలల్లో విచారణ పూర్తిచేయాలని, ఆరోపణలు రుజువు కాకపోతే చెక్‌పవర్‌ను పునరుద్ధరించాలని చట్టం చెబుతున్నా రెండేళ్లపాటు చెక్‌పవర్‌ను పునరుద్ధరించని ఉదంతాలున్నాయంటే అధికారపార్టీ నాయకులు ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
6 నెలల్లో విచారణ పూర్తవ్వాల్సి ఉన్నా...
అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సర్పంచుల చెక్ పవర్ రద్దు చేసే అధికారం పంచాయతీ కమిషనర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ అధికారాన్ని రాష్ట్రప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఆరోపణలు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు 3 నెలల పాటు సర్పంచుల చెక్ పవర్ రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చారు. ఆ లోగా విచారణ పూర్తి కాకపోతే మరో 3నెలల పాటు చెక్‌పవర్ రద్దును కొనసాగించేందుకు కలెక్టర్లు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 6 నెలల్లో విచారణను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. తప్పు జరిగినట్టు నిర్ధారణ అయితే, సర్పంచిని తొలగించే అధికారం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 249 ద్వారా ఉంది. అయితే, ఆరోపణల పేరుతో సర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేస్తున్న జిల్లా యంత్రాంగం నిర్ణీత కాలంలో పునరుద్ధరించక పోగా కనీసం ఆ సమాచారాన్ని రాష్ట్ర పంచాయతీ కార్యాలయానికి కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అనేక చోట్ల 6 నెలల తరువాత కూడా చెక్ పవర్ రద్దు కొనసాగుతోంది. కానీ, గత మూడేళ్లలో కేవలం 12 కేసుల్లో మాత్రమే విచారణ పొడిగింపునకు అనుమతించాలని కోరుతూ కలెక్టర్లు పంచాయతీరాజ్ కమిషనర్‌కు లేఖలు రాశారు. దివాన్ చెరువు(తూర్పుగోదావరి). గిద్దలూరు (నెల్లూరు), లింగారావుపాలెం (గుంటూరు) సర్పంచులను తొలగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు.
అన్నీ చిన్న కారణాలే..
– ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలం పోలేపల్లి పంచాయితీకి చెందిన దేవెండ్ల సుబ్బరాయుడు (వైఎస్సార్‌సీపీ) సర్పంచ్ చెక్‌పవర్‌ను 2017 ఏప్రిల్ 3న రద్దు చేసారు. పంచాయతీలో కుక్కలను చంపించినందుకు, ఎంపీ నిధులతో సామాజిక భవన నిర్మాణ నిమిత్తం పాత పాఠశాల భవనాన్ని తొలగించినందుకు, సైడు కాలువలలో పూడిక తీతను తీసివేయించనందుకు చెక్ పవర్‌ను రద్దు చేసారు. 12 మంది వార్డు సభ్యులలో పది మంది సభ్యుల మెజార్టీ సుబ్బరాయుడుకు ఉన్నా ఏకపక్షంగా చెక్ పవర్‌ను రద్దు చేశారు.
– శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తొమ్మిది మంది సర్పంచుల చెక్ పవర్ రద్దయ్యింది. వీరంతా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు కావడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 19 మంది చెక్ పవర్‌రద్దు కాగా, వారిలో 16 మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే.
–అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 12 మంది చెక్‌పవర్ రద్దు కాగా, అందులో 11 మంది వైఎస్సార్‌సీపీ అభిమానులే. నెల్లూరులో 9 మంది చెక్‌పవర్ రద్దు చేయగా, అందులో ఏడుగురు వైఎస్సార్‌సీపీ వాళ్లు.
–గుంటూరు జిల్లాలో 20 మంది చెక్‌పవర్ రద్దు చేయగా, వారిలో 14 మంది ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన సర్పంచులపై అధికారుల ద్వారా తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చారన్న ఆరోపణలున్నాయి. పంచాయతీ రికార్డులను తనిఖీ చేయాల్సిన ఈవోపీఆర్‌డీలను ఆయా గ్రామ పంచాయతీలకు తనిఖీలకు పంపి, రికార్డులను వారాల తరబడి తమ వద్దే ఉంచుకొని ఒత్తిళ్లు తెచ్చి పలువురు సర్పంచులను బలవంతంగా అధికార పార్టీలోకి చేర్చుకున్నారనే ఆరోపణలున్నాయి.
హైకోర్టు ఆదేశించినా పునరుద్ధరించలేదు..
చిన్న విషయాలను కారణంగా చూపుతూ అధికార పార్టీ మంత్రి నా చెక్ పవర్ రద్దు చేయించారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించాను. చెక్ పవర్ పునరుద్ధరించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. డీపీఓ వద్ద ఫైల్ అలాగే ఉంది. మూడు నెలలుగా తిరుగుతున్నా ఇంత వరకు చెక్ పవర్ పునరుద్ధరించలేదు. –దెవెండ్ల సుబ్బరాయుడు, ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం, పోలేపల్లి గ్రామ సర్పంచి
తనిఖీ చేయకుండానే...
నా భర్త వీరరాఘవులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల బీసీ నాయకులు. నిధులు గోల్ మాల్ అయ్యాయంటూ గత ఏడాది ఏప్రిల్‌లో రాజమండ్రి డీఎల్‌పీవో చెక్ పవర్ రద్దు చేశారు. కానీ డీఎల్‌పీవో ఎలాంటి తనిఖీలూ చేయకుండానే కార్యదర్శి ఇచ్చిన నివేదిక అధారంగా నిర్ణయం తీసుకున్నారు. – పెంకే కృష్ణవేణి, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం కందుల పాలెం గ్రామ సర్పంచి
సర్పంచుల ‘చెక్ పవర్ ’ ఏమిటంటే..
గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి వీలుగా ఆ గ్రామ ప్రజలెన్నుకున్న సర్పంచికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా చెక్ పవర్‌ను కల్పించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే ఈ నిర్ణయం జరిగింది. గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ అందుబాటులో ఉండరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికీ అనేక గ్రామ పంచాయతీలకు పూర్తి స్థాయి కార్యదర్శులు కూడా లేని పరిస్థితుల్లో సర్పంచులకు చెక్‌పవర్ ఉండడం వల్ల అనేక స్థానిక సమస్యల పరిష్కారానికి వీలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment