హైదరాబాద్: సర్పంచులకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి, వెంటనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని, క చ్చితంగా గౌరవ వేతనాలను పెంచుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జిల్లా పరిషత్తు ఛైర్మన్లతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పంచాయతీల్లో చెక్ పవర్‌ని కేవలం సర్పంచులకు పరిమితం చేస్తూ, జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రజల సొమ్మును పారదర్శకంగా ఖర్చు చేయాలని, తాము కేవలం ధర్మకర్తలం మాత్రమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
గ్రామాల్లో పన్నుల చెల్లింపులు పెరిగాయని, అయితే వాటిని మరింతగా పెంచి గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చాలన్నారు. ఈ ప్రయత్నంలో తన నియోజకవర్గం సిరిసిల్లాలో దాదాపు వందశాతం పన్నుల వసూలును పూర్తి చేసిన విషయాన్ని వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా గౌరవ వేతనాలను పెంచుతామని, వారికి ప్రోటోకాల్ గౌరవాన్ని కల్పిస్తామన్నారు. నిధుల విషయంలో స్థానిక సంస్థలకే పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని, 13వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా స్థానిక సంస్థలకే ఇచ్చామన్నారు. పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామి, సీఎంతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామాల్లో తాగునీటి బోర్ల విద్యుత్తు కనెక్షన్లను తీసేయకుండా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ పథకాలు విజయవంతంగా పూర్తి చేసిన గ్రామాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వ్యవస్థలను అధ్యయనం చేశామన్నారు. తాము స్థానిక సంస్థలు అధికారాలు ఇచ్చేందకు సిద్ధంగా ఉన్నామని, అయితే వారు కచ్చితంగా బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని, తద్వారా నిజమైన గ్రామీణ ప్రగతిని సాధిస్తామన్నారు. స్థానిక సంస్థల ద్వారానే బంగారు తెలంగాణ సాధించాలన్న ముఖ్యమంత్రి కలను సాకారం చేస్తామని, ఇందుకు స్థానిక సంస్థల ప్రతినిధులు కలిసి రావాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనిత రాంచంద్రన్, ఎంఎల్‌సీలు నరేందర్‌రెడ్డి, రాముల నాయక్ పాల్గొన్నారు.