శిక్షణ లేకుండానే..! | No Training For Junior Panchayat Secretary Employees | Sakshi
Sakshi News home page

శిక్షణ లేకుండానే..!

Published Wed, Jul 10 2019 12:21 PM | Last Updated on Wed, Jul 10 2019 12:29 PM

No Training For Junior Panchayat Secretary Employees - Sakshi

ఫరూఖ్‌నగర్‌ మండల పరిషత్‌ కార్యాలయం

సాక్షి, షాద్‌నగర్: కొత్తగా ఎంపికైన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు పాలనలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పంచాయితీరాజ​ శాఖ  ద్వారా ఎంపికైన వీరికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వకుండానే బాధ్యతలు అప్పగించింది. వారిని నేరుగా క్షేత్రస్థాయిలోకి పంపడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు విధిగా శిక్షణ ఇచ్చిన అనంతరం బాధ్యతలు అప్పగించడం సర్వసాధారణం. కానీ, కొత్త జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వారికి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలూ నిర్వహించకుండానే  గ్రామ పంచాయతీలను అప్పగించడంతో పాలనలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి.   

మొత్తం 301 మంది నియామకం 
జిల్లాలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 558 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి పంచాయతీకి కార్యదర్శి నియమించేందుకు చర్యలు చేపట్టింది. పంచాయితీరాజ​ శాఖ ద్వారా జిల్లాలో 21 మండలాల్లో ఖాళీగా ఉన్న 301 పంచాయతీలకు కార్యదర్శుల పోస్టులను భర్తీ చేశారు. కొత్త కార్యదర్శులను ఏప్రిల్‌ 12న నియమించి ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీను కేటాయించి పాలనా బాధ్యతలను అప్పగించినట్లు జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి తెలిపారు. అయితే, వివిధ కారణాల నేపథ్యంలో కొందరు పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలను వదిలివెళ్తున్నారు. పనిభారం ఎక్కువై కొందరు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం ఇష్టం లేక మరికొందరు, ఇతర ఉద్యోగాలు రావడంతో మరికొందరు ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు తెలుస్తోంది.

తప్పులు జరిగితే చర్యలు.. 
గ్రామాభివృద్ధికి సంబంధించి పంచాయతీల నుంచి నిధులు డ్రా చేయడంలో అవకతవలు జరిగితే మాత్రం సర్పంచ్, కార్యదర్శిపై కఠిన చర్యలు తప్పవు. నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్‌ను సర్పంచ్, కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. అయితే, నిధులను ఏవిధంగా ఖర్చు చేయాలనే విషయంపై కొత్త కార్యదర్శులకు  అవగాహన లేదు. అదేవిధంగా వీరు ప్రతినెలా తమ పనితీరును కొత్త పంచాయతీరాజ్‌ చట్టానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. లేదంటే చర్యలు తీసుకోనున్నారు. 

‘రియల్‌’పై అవగాహన అంతంతే 
కొత్త పంచాయతీ కార్యదర్శులకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై అంతగా అవగాహన లేదు. ఎంటెక్, బీటెక్, పీజీ తదితర కోర్సులు చదవి పంచాయతీ కార్యదర్శి పోస్టులు సాధించిన యువకులు అధికంగా ఉన్నారు. వీరికి గ్రామాల్లో జరిగే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, అక్రమ లేఅవుట్‌లు, ప్రభుత్వానికి సంబంధించి భూముల కబ్జాలు, భవన నిర్మాణాల అనుమతులు తదితర ప్రధాన అంశాల్లో ఎన్నో కీలకంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో కార్యదర్శులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చిన తర్వాతే విధులు అప్పగించాలి. కానీ, ప్రభుత్వం అలాకాకుండా నేరుగా వారికి బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందిగా మారింది.   

సర్పంచ్‌లకు శిక్షణ.. మరీ కార్యదర్శులకు? 
కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మాత్రం బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే శిక్షణ తరగుతులు నిర్వహించి గ్రామాల అభివృద్ధి ఏవిధంగా చేయాలి, నిధులు ఏవిధంగా వినియోగించాలనే అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించింది. కానీ, కార్యదర్శులకు మాత్రం నేటి వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈనేపథ్యంలో విధుల నిర్వహణలో కొత్త కార్యదర్శులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వారికి శిక్షణ ఎప్పుడు ఇస్తారో కూడా ఎవరికీ స్పష్టత లేదు.

కొత్త చట్టంపై అవగాహనేదీ.? 
గ్రామ పరిపాలనా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టం– 2018ను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో కొత్త చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. కొత్త చట్టం ప్రకారం ప్రతి నెలా పంచాయతీ కార్యదర్శులు విధిగా తమ పనితీరును వెబ్‌సైట్‌లో నమోదుచేయాలి. అదేవిధంగా ప్లాట్ల లే అవుట్‌లు, భవన నిర్మాణ అనుమతులు, వీధి దీపాలు, మురుగు కాల్వలు, అంతర్గత రహదారులను నిర్వహించడంతోపాటుగా హరితహారాన్ని పటిష్టంగా అమలు చేయాల్సి ఉంటుంది.

ఇలా.. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో అనేక కీలమైన అంశాలను పొందుపర్చింది. ప్రతి గ్రామానికి ఓ నర్సరీ ఏర్పాటు చేసింది. ఇందులో పంచాయతీ కార్యదర్శిగా కీలకంగా వ్యవహరించే విధంగా బాధ్యతలను పొందుపర్చింది. అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కు చెక్‌పవర్‌ను కేటాయించారు. పైఅంశాలపై పూర్తి స్థాయిలో కొత్త పంచాయతీ కార్యదర్శులకు అవగాహన లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement