క్రికెటర్లకు తినడానికీ డబ్బుల్లేవు!
క్రికెటర్లకు తినడానికీ డబ్బుల్లేవు!
Published Thu, Feb 9 2017 8:23 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
బీసీసీఐని సంస్కరించడానికి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాల పుణ్యమాని ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో తలపడుతున్న భారత అండర్-19 జట్టుకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఆటగాళ్లతో పాటు చివరకు కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా కనీసం తినడానికి కూడా డబ్బులు అందడం లేదు! కార్యదర్శి పదవి నుంచి అజయ్ షిర్కేను తొలగించడంతో.. చెక్కుల మీద సంతకాలు పెట్టే అధికారి ఎవరి వద్దా లేకుండా పోయింది. దాంతో ఆటగాళ్లకు, ద్రవిడ్‌కు డబ్బులు అందట్లేదు. జూనియర్ క్రికెటర్లకు రోజుకు రూ. 6800 చొప్పున రావాల్సి ఉంది. కానీ ఆ డబ్బులు రావడం లేదు. దాంతో వాళ్లంతా తమ భోజనం ఖర్చులు జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోంది. చాలామంది తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకుంటున్నారు. కొత్తగా చెక్ పవర్ ఎవరికో ఒకరికి ఇవ్వాలంటే బీసీసీఐ సభ్యులు కొత్త తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
సిరీస్ ముగిసిపోగానే మొత్తం డీఏ ఎంత అవుతుందో లెక్కచూసి ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఖాతాలకు పంపేస్తామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం బీసీసీఐలో కూడా చాలా సమస్యలున్నాయని, చెక్ పవర్ ఎవరివద్దా లేకపోవడంతో చెల్లింపులు ఏవీ చేయలేకపోతున్నామని అన్నారు. మ్యాచ్‌లు జరిగే రోజుల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆతిథ్య సంఘం ఏర్పాటుచేస్తోందని, బ్రేక్‌ఫాస్ట్ అయితే హోటల్ నుంచి కాంప్లిమెంటరీగా అందుతోందని అండర్-19 క్రికెట్ టీమ్ సభ్యుడొకరు చెప్పారు. ముంబైలో తమను ఓ స్టార్‌హోటల్లో ఉంచారని, అక్కడ శాండ్‌విచ్ తినాలన్నా రూ. 1500 పెట్టాల్సి వస్తోందని వాపోయారు. రోజంతా ఆడి అలిసిపోయిన ఆటగాళ్లు భోజనం కోసం మళ్లీ బయటకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు కోసం హైదరాబాద్ వచ్చిన సీనియర్ జట్టుకు మాత్రం ఇలాంటి సమస్యలు ఏమీ లేవు. ఆటగాళ్ల రోజువారీ అలవెన్సుల విషయాన్ని చూసుకోవాలని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) తెలిపింది.
Advertisement