సాక్షి, మంగపేట: బిల్ట్ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది. ప్రభుత్వ ఆదేశాలతో కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఒక రోజు వేతనాన్ని శుక్రవారం జమ చేసింది. 32 నెలలుగా వేతనాలు రాక అల్లాడుతున్న కార్మికులకు పండుగకు ముందు ఒక నెల వేతనం రావడంతో ఒకింత ఊరట కలిగినట్లయింది. ఈ నెల 10న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కార్మికశాఖ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, బిల్ట్ సీఈఓ నిహార్ అగర్వాల్, కార్మిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన విషయం విదితమే.
ఈ నెల 9న ఒకరోజు వేతనం చెల్లించాలన్న ప్రభుత్వ ఆదేశాలను బిల్ట్ యజమాన్యం పెడచెవిన పెట్టడంతో మరోసారి ఎలాంటి గడువుకు తావులేకుండా సంక్రాంతి పండుగకు ముందుగానే ఈ నెల 12 వరకు తప్పకుండా కార్మికులకు వేతనం చెల్లించాల్సిందేనని ఖరాకండిగా సీఈఓను ఆదేశించారు. దీంతో ఈ సారైనా యాజమాన్యం చెల్లిస్తుందో ? లేదోనని కార్మికులు వేయి కళ్లతో ఎదురు చూశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎట్టకేలకు స్పందించిన బిల్ట్ యాజమాన్యం శుక్రవారం సాయంత్రం వరకు కార్మికుల బ్యాంక్ ఖాతాలో 2015 జూన్‌కు సంబంధించిన వేతనం జమ చేయడంతో కార్మికుల్లో సంతోషం వ్యక్తమైంది. ప్రభుత్వం ఆదేశానుసారం మిగతా 32 నెలల వేతనాలతో పాటు ఫిబ్రవరి 14 వరకు బిల్ట్ భవిష్యత్‌పై స్పష్టత వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కటింగ్‌లు పోనూ వచ్చింది సగమే..
ఒక నెల వేతనం ఒక్కో కార్మికుడికి రూ. 24 వేల నుంచి రూ. 25 చెల్లించినా చివరకు రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకే చేతికి రావడంతో కార్మికుల్లో అసంతృప్తి నెలకొంది. బ్యాంక్ ఖాతాలో జమ అయిన వేతనం డబ్బులలో ఎల్‌ఐసీ ప్రీమియం, పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ కోఆపరేటీవ్ సొసైటీ లోన్, కంపెనీ జనరల్ స్టోర్ ఖర్చుల కటింగ్ పోను కొందరు కార్మికులకు రూ.10 వేల నుంచి 12 వేల వరకు వస్తాయని, వ్యక్తిగత అవసరాల కొరకు బ్యాంక్ రుణం, ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి అడ్వాన్స్ పొందిన కార్మికులకు రూపాయి కూడా రావడం కష్టమేనంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment