విధులకు వెళుతున్న పారిశుద్ధ్య కార్మికులు
సాక్షి, కడప(ప్రొద్దుటూరు) : వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు. కుటుంబ పోషణకోసం వీధుల్లో చెత్తా చెదారాన్ని తొలగిస్తూ కాలువలను శుభ్రం చేస్తుంటారు. మహిళా కార్మికులు సైతం రిక్షాలతో వీధుల్లో తిరుగుతూ చెత్తా చెదారాన్ని సేకరిస్తున్నారు. ఇంత కష్టపడుతున్నా తమకు ఏడు నెలలుగా వేతనం అందడం లేదని వీరంతా వాపోతున్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 24 మంది గ్రీన్ అంబాసిడర్లను అధికారులు నియమించారు. నెలకు రూ.6వేలు వేతనం ప్రకారం గత ఏడాది సెప్టెంబర్‌లో విధుల్లో చేరారు. మూడు నెలలు మాత్రమే వేతనాలు పొందారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఇష్టమైతే పనిచేయండి, లేకపోతే మానుకోండని అధికారులు చెబుతుండటంతో వీరు ఆందోళన చెందుతున్నారు.
దసరాకు ప్రసిద్ధి ప్రొద్దుటూరు
దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రొద్దుటూరుకు ప్రాధాన్యత ఉంది. పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను అన్ని వర్గాలూ ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవడం ఆనవాయితీ. ప్రాధాన్యతగల ఈ పండుగ ఈనెలాఖరును ప్రారంభమవుతున్నా వేతనాలు రాకపోవడంపై కార్మికులు కలత చెందుతున్నారు. కొందరు చేసేది లేక పని మానుకుందామని ఆలోచించినా ఇంటి వద్ద ఉంటే బకాయి వేతనాలు వస్తాయో రావోననే ఆందోళన వెంటాడుతోంది. జిల్లా వ్యాప్తంగా 3వేల మంది కార్మికులు గ్రామ పంచాయతీల పరిధిలో గ్రీన్ అంబాసిడర్ల పేరుతో పారిశుద్ధ్య పని చేస్తున్నారు. స్వచ్ఛభారత్ నిధులను గత ప్రభుత్వ హయాంలో పసుపు–కుంకుమకు మళ్లించడంతో వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,918 గ్రామ పంచాయతీలను వ్యర్థరహిత పంచాయతీలుగా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 9,856 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను రూ.376 కోట్లు వెచ్చించి నిర్మించారు.
వెయ్యి మంది జనాభాకు ఒకరు చొప్పున నియమితులైన గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించడం లేదు. చాలా చోట్ల కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఈ ఏడాది జూన్ 25న సర్కులర్ జారీ చేశారు. గ్రామ పంచాయతీల ద్వారా ముందుగా వీరికి వేతనాలు చెల్లించాలని సూచించారు. తర్వాత ప్రభుత్వం ఈ నిధులను గ్రామ పంచాయతీలకు చెల్లిస్తుందని తెలిపా రు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి విడుదలయ్యే నిధుల కోసం వేచి ఉండవద్దన్నారు. అయితే ఇంతవరకు ఈ కార్మికులకు వేతనాలు మాత్రం అందలేదు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లారెడ్డిని సాక్షి వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము బిల్లులను పంపామని చెప్పారు. ఎంపీడీఓ సుబ్రహ్మణ్యాన్ని వివరణ కోరగా ఫైనాన్స్ క్లియరెన్స్ రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు.
ఆస్పత్రికి వెళ్లాలన్నా డబ్బు లేదు
ఎడమ వైపు కర్ణబేరి దెబ్బతింది. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి మెరుగైన వైద్యం చేయించుకోవాలన్నా డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. వేతనాలు ఎప్పుడిస్తారో తెలియడం లేదు. ఒక్క నెల కూడా వేతనం పడలేదు.
– యు.భార్గవ, కార్మికుడు, కొత్తపల్లె పంచాయతీ, ప్రొద్దుటూరు
ఒక్క నెల వేతనం కూడా పడలేదు
ఏడాదిగా పనిచేస్తున్నా ఒక్క నెల కూడా వేతనం అందలేదు. ఇందుకు ఏవేవో కారణాలు చెబుతున్నారు. కుటుంబ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
– చంద్రరంగ, కార్మికుడు, కొత్తపల్లె పంచాయతీ, ప్రొద్దుటూరు
కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి
ఇచ్చేది నెలకు రూ.6వేలు వేతనం. మా శ్రమ ఆ దేవుడికి తెలుసు. ఇన్ని నెలలు వేతనం ఇవ్వకుంటే ఎలా పనిచేయాలి. మా లాంటి వారికి ఇన్ని కష్టాలా..?
– సునీత, కార్మికురాలు, కొత్తపల్లె పంచాయతీ, ప్రొద్దుటూరు
Comments
Please login to add a commentAdd a comment