Deccan Nizam Sugar Limited
-
నేడు బోధన్ బంద్
అఖిల పక్షాల పిలుపు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం పోరుబాట బోధన్ : నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) పునరుద్ధరణ కోసం అఖిలపక్షాలు మరోమారు బోధన్ బంద్‌కు పిలుపునిచ్చాయి. టీఆర్ఎస్ మినహా మిగతా రాజకీయ, వామపక్ష పార్టీలు, అనుబంధ ప్రజా సంఘాలు కొద్ది కాలంగా ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఐక్య పోరాటాలు ప్రారంభించాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు, పాదయాత్రలు చేసిన ఆయా పార్టీలు.. సోమవారం బోధన్ బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యా, వ్యాపార సంస్థలు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని కోరాయి. ఏకతాటిపైకి పార్టీలు.. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రాజకీయ, వామపక్ష పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఫ్యాక్టరీని తక్షణమే తెరిపించాలని ఐక్య ఉద్యమాలు చేపడుతున్నాయి. ఇప్పటికే నిరసనలు, ఆందోళనలు, బంద్‌లు, పాదయాత్రలు నిర్వహించాయి. గత నెలలో అక్టోబర్ 20 నుంచి నాలుగు రోజుల పాటు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్ర నేతలు రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వరుస ఆందోళనలతో అధికార పార్టీ నేతల్లో స్పందన కనిపిస్తోంది. ఎంపీ కవిత చెరుకు రైతులతో హైదరాబాద్‌లో సమావేశమై ఫ్యాక్టరీ భవితపై చర్చించారు. మరోవైపు, ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీని ఆధునికీకరించి, రైతులకు అప్పగించాలని యోచిస్తోంది. ఫ్యాక్టరీని నడిపేందుకు సుముఖంగా లేదని స్పష్టమవుతోంది. విపక్షాల ఒత్తిడి నేపథ్యంలో త్వరలోనే ఫ్యాక్టరీ భవితపై విధానపరమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. సర్కారు నిర్ణయం కోసం రైతులు, కార్మికులు ఆశతో ఎదురు చూస్తున్నారు. 14 ఏళ్లుగా ‘ప్రైవేట్’లోనే.. నిజాం పాలకుల హయాంలో 1938లో నెలకొల్పిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ ఆధార పరిశ్రమగా గుర్తింపు పొందింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ ఫ్యాక్టరీ లాభాలతోనే రాష్ట్రంలో చక్కెర ఫ్యాక్టరీల విస్తరణ సాగింది. అయితే, 2002లో అప్పటి సీఎం చంద్రబాబు ఫ్యాక్టరీని ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. ప్రైవేట్ యాజమాన్యం లాబాపేక్ష, ఏకపక్ష నిర్ణయాలతో రైతులు, కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రద్దు కోసం 14 ఏళ్ల నుంచి రైతులు, కార్మికులు పోరాడుతూనే ఉన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఫ్యాక్టరీ స్థితిగతులపై విచారణకు శాసనసభా సంఘం నియమించారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని సభా సంఘం నివేదించింది కానీ, ఆ సిఫారసులు అమలు కాలేదు. మరోవైపు, అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ మలి దశ ఉద్యమంలో, 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2015లో ప్రైవేట్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. 2016-17 క్రషింగ్ సీజన్ నవంబర్, డిసెంబర్ మాసాల్లో ప్రారంభం కావాల్సి ఉంది. డిసెంబర్, జనవరి మాసాల్లో చెరుకు సాగుకు అనువైన వాతావరణం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో అఖిలపక్షాలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి. -
తేలనున్న భవితవ్యం
ఎన్డీఎస్ఎల్ సమస్యకు పరిష్కారం! * నేడు మంత్రి కేటీఆర్‌తో కీలక సమావేశం * మంత్రి పోచారం, ఎంపీ కవిత హాజరు * ఫ్యాక్టరీల పునరుద్ధరణకే అవకాశం * రైతులు, కార్మికుల సమస్యలపైనా చర్చ * లేఆఫ్ ప్రకటించి సుమారు ఐదు నెలలు * మూడు జిల్లాల్లో నిలిచిపోయిన ఫ్యాక్టరీలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎ ల్) భవిష్యత్తు, కార్మికుల సమస్యలకు బుధవారం పరిష్కారం దొరికే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో కార్మికులతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం 2015-16 క్రషింగ్ సీజన్ నడుపకుండా చేతులెత్తేసిన విషయం తెలిసిం దే. చెరుకు, నీటి కొరత కారణంగా ఫ్యాక్టరీని నడుపలేమని 2015 డిసెంబర్ 23న లేఆఫ్ నోటీసు జారీ చేసి బోధన్‌తో పాటు ముత్యంపేట (కరీంనగర్) ముంబోజిపల్లి(మెదక్) ఫ్యాక్టరీలను మూసివేసింది. సరిగ్గా అంతకు నెల రోజుల ముందు 2015 నవంబర్ 23న హైదరాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ మూడు ఫ్యాక్టరీల పరిధిలోని రైతులతో సమావేశం ని ర్వహించారు. చెరుకును ప్రైవేట్ ఫ్యాక్టరీలకు తరలిం చాలని నిర్ణయం తీసుకున్నారు. చెరుకును ప్రైవేట్ ఫ్యాక్టరీలకు రైతులు తరలించారు. బోధన్ ప్రాంతంలోని కొందరు రైతులు మహారాష్ట్ర ప్రాంత చక్కెర ఫ్యాక్టరీలకు తరలించారు. కలకలం రేపిన లేఆఫ్ ప్రకటన.. 2015 డిసెంబర్ 23న ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. నిజామాబాద్, కరీంనగర్, మెద క్ జిల్లాల్లోని బోధన్, ముత్యంపేట, ముంబోజిపల్లి ఫ్యాక్టరీలో 302 మంది కార్మికులు పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఫ్యాక్టరీ మూసివేతతో ఉపాధి కో ల్పోయారు. ఎంపీ కవితో పాటు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాయినీ నర్సింహా రెడ్డి, హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే షకీల్‌లను తిరిగి ఫ్యాక్టరీని తెరిపించాలని పలుమార్లు రైతులు, కార్మికు లు కలిశారు. ఎంపీ కవిత చొరవతో 2016 జనవరి 11న ఫ్యాక్టరీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో హైదరాబాద్‌లో లేఆఫ్ ఎత్తివేత, బకాయి వేతనాలు, ఉద్యోగ భద్రత సమస్యలపై చర్చలు జరిగా యి. చర్చలు అప్పుడు కొలిక్కి రాకపోగా... అదే నెల 18న రెండవ దఫా చర్చలు వాయిదా పడ్డాయి. 2016 మార్చి 16న మూడవ దఫా చర్చలు ఫలించలేదు. 2016 ఏప్రిల్ 2,11,26 తేదీల్లో చర్చలకు ఫ్యాక్టరీ అధికారులు హాజరుకాలేదు. దీంతో కార్మిక సంక్షేమ శాఖ అధికారులు చర్చల ప్రక్రియను ముగిస్తున్నట్టు స్పష్టం చేశారు. లేబర్ కోర్టులో కేసువేయాలని నిర్ణయానికి వచ్చారు. లేఆఫ్ ఎత్తివేత, కార్మికుల బకాయి వేతనాల పై లేబర్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. లేఆఫ్ ఎత్తివేసి తిరిగి ఫ్యాక్టరీ తెరిపించాలని, బకాయి వేతనాలు చె ల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనల నేపథ్యంలో నేడు జరిగే కీలక చర్చలపైన అందరూ దృష్టి సారించారు. మంత్రి కేటీఆర్‌తో జరిగే చర్చలు కీలకం కానున్నాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం నిజామాబాద్‌లో మీడియాతో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఎల్ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కార్మికుల ప్రధాన సమస్యలు, డిమాండ్లు * ఫ్యాక్టరీ లేఆఫ్ ఎత్తివేయాలి. తిరిగి ఫ్యాక్టరీ పునరుద్ధరించాలి. * బకాయి వేతనాలు చెల్లించాలి. 2015 డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు నెలల నెలసరి వేతనాల చెల్లింపులు ఆగిపోయాయి. మూడు ఫ్యాక్టరీల పరిధిలో 302 మంది కార్మికు లు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ. 56 లక్షల వేతనాలు రావాల్సి ఉంది. ఐదు నెలల వేతనాలు మొత్తం రూ. 2 కోట్ల 80 లక్షలు చెల్లించాల్సి ఉం ది. బోధన్ ఫ్యాక్టరీలో 155 మంది, ముంబోజి పల్లి ఫ్యాక్టరీలో 140 మంది,ముత్యంపేటలో ఏ డుగురు పర్మినెంట్ కార్మికులు పని చేస్తున్నారు. * లేఆఫ్తో ఫ్యాక్టరీ మూసివేతతో ఉపాధి కోల్పోయామని, ప్రత్యామ్నాయ మార్గాలు లేవని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదు నెలులగా వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా మా రిందని, అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నామంటున్నారు. * ఫ్యాక్టరీ భవిష్యత్తు తేల్చాలని, వచ్చే ఏడాదైనా ఫ్యాక్టరీని నడిపిస్తామని ప్రభుత్వం కచ్చితమైన భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. ఫ్యాక్టరీ నడిపించే పరిస్థితి లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం గా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాలు గా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి. * మరో వైపు రైతులు చెరుకు పంట సాగు, ఫ్యాక్టరీ భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరు తున్నారు. గతంలో చెరుకు పంటకు ఫ్యాక్టరీ యా జమాన్యం అగ్రిమెంట్ చేసుకునేది. గడిచిన సీజ న్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోలేదు. కాబట్టి ప్రభుత్వమే చొరవ చూపాలి. సమస్య పరిష్కరించాలి. -
హవ్వ.. ఇదేం పని?
పై చిత్రం చూశారా.. ఏదో ఫ్యాక్టరీ ఎదుట గడ్డిని తొలగిస్తున్న కూలీలు అనుకుంటున్నారా? అయితే, చెరకుతోటలో కాలేసినట్టే.. ఇది నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ . అందులో యంత్రాలను నడపాల్సిన కార్మికులు గడ్డి తొల గిస్తున్నారు. పనిలేదనే సాకుతో యాజమాన్యం ఇలా పనిచేయిస్తోంది. పైగా వారికి నెలనెలా జీతాలూ చెల్లించడంలేదు. మరోపక్క ఈ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు రూ.11 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. యంత్రాలను నడపాల్సిన చేతులు గడ్డి పీకుతున్నాయి - ఎన్డీఎస్ఎల్ నిర్వాకం.. కార్మికులకు ప్రాణసంకటం - క్రషింగ్ ఊసెత్తని వైనం - జీతాలు చెల్లించలేని దుస్థితి మెదక్ రూరల్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) నిర్వాకం చూస్తుంటే కంపెనీ భవిష్యత్తు సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది.. చెరకు క్రషింగ్ మూడు నెలల్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తకపోగా.. కార్మికుల చేత ఏ పని అంటే ఆ పని చేయిస్తోంది.. యంత్రాలను నడపాల్సిన కార్మికులు పనిలేక ఫ్యాక్టరీ ఆవరణలో గడ్డిని తొలగిస్తున్నారు. మెదక్ మండలం మంబోజిపల్లి శివారులో పాతికేళ్ల క్రితం ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్డీఎస్ఎల్ను నెలకొల్పారు. 12 మండలాలకు చెందిన చెరకు రైతులకు ఇదెంతో ఉపయోగపడింది. ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో బోరుబావులే వ్యవసాయాధారం. బోర్లు తవ్వితే వచ్చే కొద్దిపాటి నీరుతో చెరకు తోటలను సాగు చేస్తుంటారు. ఫ్యాక్టరి ప్రారంభంలో 5 లక్షల టన్నుల చెరకును గానుగాడించిన సందర్భాలున్నాయి. అప్పట్లో దాదాపు 600 మంది కార్మికులు ఫ్యాక్టరీలో పనులు చేసేవారు. తదనంతరం చంద్రబాబునాయుడు హయాంలో ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందన్న సాకుతో 51 శాతం కంపెనీ వాటాను డక్కన్పేపర్ మిల్లు యజమానికి కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఫలితంగా ఫ్యాక్టరీలో కార్మికుల సంఖ్య 150కి పడిపోయింది. కాగా, గతేడాది 95 వేల టన్నుల చెరకు మాత్రమే గానుగ ఆడి ంది. ప్రైవేట్‌పరమైన నాటి నుంచి ఇటు చెరకు రైతులు.. అటు కార్మికులు ఇక్కట్లకు గురవుతూనే ఉన్నారు. రెండు నెలలకోసారి కూడా వేతనాలు ఇవ్వటంలేదని, ఇప్పటివరకు మూడు సార్లు వేతన సవరణ ఎగ్గొట్టినట్లు కార్మికులు వాపోతున్నారు. రైతులు ఫ్యాక్టరీకి చెరుకు పంపి 6 నెలలవుతున్నా నేటికీ బిల్లులకు దిక్కులేదు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నుంచి రైతులకు రూ.11 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. అంతే కాకుండా సాగుచేసిన చెరుకును ఇప్పటికీ అగ్రిమెంట్ చేయలేదు. ఏటా అక్టోబర్‌లో క్రషింగ్ ప్రారంభమవుతుంది. అంటే క్రషింగ్‌కు మారో మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. నేటికీ యంత్రాలను సిద్ధం చేయలేదు. ఏటా క్రషింగ్ పూర్తికాగానే మిషన్లను సర్వీసింగ్ చేయాలి. అందులో ఏవైనా చెడిపోతే వాటిని తొలగించి కొత్తవి అమర్చాలి.. కానీ, అలాంటివేవీ జరగడం లేదు. దీంతో ఫ్యాక్టరీ నడుస్తుందా? లేదా అనే సందిగ్ధంలో రైతులు, కార్మికులు ఉన్నారు. కార్మికులకు పనిలేకపోవడంతో ఫ్యాక్టరీ ఆవరణలోని గడ్డిని తొలగింపజేస్తున్నారు. ప్రైవేట్‌పరమైన నాటి నుంచి తిప్పలే.. ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరమైన నాటి నుంచి ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి వేతన సవరణ చేయాలి. అలాంటిది ఇప్పటికి 3 సార్లు వేతన సవరణ ఎగ్గొట్టారు. - ప్రభాకర్, ఫ్యాక్టరీ తెలంగాణ మజ్దూర్‌సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమయానికి వేతనాలు రాక ఇబ్బందులు వేతనాలు సమయానికి ఇవ్వకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. కార్మికులను యాజమాన్యం అనేక రకాలుగా నష్టపరిచింది. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి. - ముక్తార్, ఫ్యాక్టరీ తెలంగాణ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ కూతురు పెళ్లికి సైతం డబ్బులు ఇవ్వలేదుసారూ... ఆరు మాసాల క్రితం ఫ్యాక్టరీకి 52 టన్నుల చెరకును తరలించాను. రూ.1,35,200 రావాల్సి ఉండగా రూ. 90 వేలు ఇచ్చారు. నా కూతురు పెళ్లి ఉంది.. డబ్బులు కావాలన్నా ఇవ్వలేదు. వడ్డీకి అప్పులు తెచ్చి పెళ్లిచేశాను. ప్రస్తుతం 3 ఎకరాలలో చెరకుతోట సాగు చేసిన. కాని అగ్రిమెంట్ చేయలేదు. - మూడావత్ శంకర్, చెరకు రైతు, హవేళిఘణపూర్ తండా ఆరునెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు.. చెరకును ఫ్యాక్టరీకి తరలించి ఆరు నెలలవుతున్నా బిల్లులు ఇవ్వటంలేదు. 50 టన్నుల చెరకును తరలించాను. రూ. 1,30,000 రావల్సి ఉండగా రూ. 30 వేలే ఇచ్చారు. మిగతా సొమ్ము కోసం అడిగినా పట్టించుకోవటంలేదు. - గుగ్లోత్ దూప్‌సింగ్, చెరకు రైతు, తొగిట పంచాయతీ సుల్తాన్పూర్ తండా -
చేదెక్కిన చక్కెర పరిశ్రమ
ఎఫ్ఆర్పీని రూ.10కి పరిమితం చేసిన కేంద్రం రాష్ట్ర సూచనలు పాటించలేమన్న ఫ్యాక్టరీ యాజమాన్యాలు గణనీయంగా పడిపోతున్న చెరుకు సాగు విస్తీర్ణం హైదరాబాద్: క్రషింగ్ సీజన్ సమీపిస్తున్నా నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) భవితవ్యంపై స్పష్టత కొరవడింది. మరోవైపు మద్దతు ధర (ఎస్ఏపీ)పై చక్కెర కర్మాగారాలు నాన్చుతున్నాయి. కనీస ధర (ఎఫ్ఆర్పీ)ను కేంద్ర ప్రభుత్వం ఏటా క్వింటాలుకు రూ.10 మాత్రమే పెంచుతోంది. దీంతో చెరుకు రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. చెరుకు మద్దతు ధరను నిర్ణయించడంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రంలో చెరుకు సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయించే సీఏసీపీ సూచన మేరకు ఏటా కేంద్రం చెరుకు ఎఫ్ఆర్పీని ప్రకటిస్తుంది. 2013-14లో క్వింటాలు చెరుకు ఎఫ్ఆర్పీ రూ.210 వుండగా, 2014-15లో రూ.220గా నిర్ణయించారు. దీంతో చెరుకు రైతులకు గత క్రషింగ్ సీజన్లో మెట్రిక్ టన్నుకు రూ.2,200 లభించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఎస్ఎపీ (స్టేట్ అడ్వైజబుల్ ప్రైస్) రూ.340, అమ్మకం పన్ను రూ.60 కలుపుకొని మెట్రిక్ టన్నుకు రూ.2,600 చొప్పున చెల్లించేందుకు చక్కెర ఫ్యాక్టరీలు అంగీకరించాయి. 2014-15లో ఎన్డీఎస్ఎల్, ప్రైవేటు చక్కెర కర్మాగారాలు రాష్ట్రంలో రూ.798.53 కోట్ల విలువ చేసే చెరుకును రైతుల నుంచి కొనుగోలు చేశాయి. అయితే బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. ఒక్క ఎన్డీఎస్ఎల్ పరిధిలోనే రూ.28 కోట్ల బకాయిలు చెరుకు రైతులకు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది అంతే.. సీఏసీపీ సూచన మేరకు 2015-16కు సంబంధించి క్వింటాలు చెరుకు ఎఫ్ఆర్పీని రూ.230గా కేంద్రం నిర్ణయించింది. ఈ లెక్కన మెట్రిక్ టన్ను చెరుకు ధర రూ.2,300 మాత్రమే పలకనుంది. సాగుకయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని మెట్రిక్ టన్నుకు రూ.3,600 చొప్పున రైతులు డిమాండు చేస్తున్నారు. గత ఏడాది చెల్లించిన రూ.2,600 ఎస్ఏపీ చెల్లించడం కష్టమేనని ప్రైవేటు ఫ్యాక్టరీలు సంకేతాలు ఇస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు సంయుక్త భాగస్వామ్య సంస్థ ఎన్డీఎస్ఎల్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్డీఎస్ఎల్కు ఇప్పటికే రూ.11 కోట్ల మేర సాయం అందించిన ప్రభుత్వం.. మరో రూ.27 కోట్లు విడుదల చేస్తే తప్ప రైతుల బకాయిలు తీరేలా లేవు. మరోవైపు సంస్థను తిరిగి ప్రభుత్వ పరం చేస్తే తప్ప 2015-16 సీజన్లో ఎన్డీఎస్ఎల్ క్రషింగ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది చెరుకు సాగు విస్తీర్ణం సగానికి పడిపోతుందని చక్కెర శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.