నేడు బోధన్ బంద్
అఖిల పక్షాల పిలుపు
ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం పోరుబాట
బోధన్ : నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) పునరుద్ధరణ కోసం అఖిలపక్షాలు మరోమారు బోధన్ బంద్‌కు పిలుపునిచ్చాయి. టీఆర్‌ఎస్ మినహా మిగతా రాజకీయ, వామపక్ష పార్టీలు, అనుబంధ ప్రజా సంఘాలు కొద్ది కాలంగా ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఐక్య పోరాటాలు ప్రారంభించాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు, పాదయాత్రలు చేసిన ఆయా పార్టీలు.. సోమవారం బోధన్ బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యా, వ్యాపార సంస్థలు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని కోరాయి.
ఏకతాటిపైకి పార్టీలు..
ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రాజకీయ, వామపక్ష పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఫ్యాక్టరీని తక్షణమే తెరిపించాలని ఐక్య ఉద్యమాలు చేపడుతున్నాయి. ఇప్పటికే నిరసనలు, ఆందోళనలు, బంద్‌లు, పాదయాత్రలు నిర్వహించాయి. గత నెలలో అక్టోబర్ 20 నుంచి నాలుగు రోజుల పాటు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్ర నేతలు రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వరుస ఆందోళనలతో అధికార పార్టీ నేతల్లో స్పందన కనిపిస్తోంది. ఎంపీ కవిత చెరుకు రైతులతో హైదరాబాద్‌లో సమావేశమై ఫ్యాక్టరీ భవితపై చర్చించారు. మరోవైపు, ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీని ఆధునికీకరించి, రైతులకు అప్పగించాలని యోచిస్తోంది. ఫ్యాక్టరీని నడిపేందుకు సుముఖంగా లేదని స్పష్టమవుతోంది. విపక్షాల ఒత్తిడి నేపథ్యంలో త్వరలోనే ఫ్యాక్టరీ భవితపై విధానపరమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. సర్కారు నిర్ణయం కోసం రైతులు, కార్మికులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
14 ఏళ్లుగా ‘ప్రైవేట్’లోనే..
నిజాం పాలకుల హయాంలో 1938లో నెలకొల్పిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ ఆధార పరిశ్రమగా గుర్తింపు పొందింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ ఫ్యాక్టరీ లాభాలతోనే రాష్ట్రంలో చక్కెర ఫ్యాక్టరీల విస్తరణ సాగింది. అయితే, 2002లో అప్పటి సీఎం చంద్రబాబు ఫ్యాక్టరీని ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. ప్రైవేట్ యాజమాన్యం లాబాపేక్ష, ఏకపక్ష నిర్ణయాలతో రైతులు, కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రద్దు కోసం 14 ఏళ్ల నుంచి రైతులు, కార్మికులు పోరాడుతూనే ఉన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఫ్యాక్టరీ స్థితిగతులపై విచారణకు శాసనసభా సంఘం నియమించారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని సభా సంఘం నివేదించింది కానీ, ఆ సిఫారసులు అమలు కాలేదు. మరోవైపు, అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ మలి దశ ఉద్యమంలో, 2014 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2015లో ప్రైవేట్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. 2016-17 క్రషింగ్ సీజన్ నవంబర్, డిసెంబర్ మాసాల్లో ప్రారంభం కావాల్సి ఉంది. డిసెంబర్, జనవరి మాసాల్లో చెరుకు సాగుకు అనువైన వాతావరణం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో అఖిలపక్షాలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి.