సాక్షి ప్రతినిధి, తిరుపతి: బకాయిల చెల్లింపులో ప్రభుత్వ దాటవేత వైఖరి.. సీజన్ ప్రారంభమైనా సహకార చక్కెర పరిశ్రమల్లో క్రషింగ్‌కు అనుమతించకపోవడానికి నిరసనగా చెరకు రైతులు ఉద్యమబాట పట్టారు. రైతు సంఘాలు, చెరకు రైతులు సంయుక్తంగా సోమవారం నుంచి వరుస ఆందోళనలకు సిద్ధమయ్యారు. జిల్లాలో వేరుశెనగ తర్వాత చెరకు ప్రధానమైన వాణిజ్య పంట. 40 మండలాల పరిధిలో 54 వేల హెక్టార్లలో చెరకు పంటను రైతులు సాగుచేస్తున్నారు.
ఈ చెరకు పంటపై ఆధారపడి శ్రీ వేంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం(ఎస్వీ షుగర్స్), చిత్తూరు సహకార చక్కెర పరిశ్రమ(చిత్తూరు షుగర్స్), మరో మూడు ప్రైవేటు చక్కెర పరిశ్రమలు జిల్లాలో నెలకొల్పారు. 2012-13, 2013-14 క్రషింగ్ సీజన్లలో టన్ను చెరకుకు రూ.2,100ను ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది. సహకార చక్కెర పరిశ్రమలకు చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు ప్రభుత్వం రూ.300లు.. పరిశ్రమలు రూ.1,800 చెల్లించేలా అప్పట్లో సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో 2012-13లో ఎస్వీ షుగర్స్‌లో 1.46 టన్నులు, చిత్తూరు షుగర్స్‌లో 1.05 లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేశారు.
2013-14 క్రషింగ్ సీజన్‌లో ఎస్వీ షుగర్స్‌లో 1.20 లక్షలు, చిత్తూరు షుగర్స్‌లో 48 వేల టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. కానీ.. ప్రభుత్వం తరఫున టన్నుకు రూ.300 చొప్పున చెల్లించాల్సిన మొత్తాన్ని ఇప్పటిదాకా చెల్లించలేదు. ఎస్వీ షుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.62 కోట్లు, చిత్తూరు షుగర్స్‌కు సరఫరా చేసిన రైతులకు రూ.8.50 కోట్ల మేర బకాయిపడింది. రెండేళ్లుగా బకాయిల చెల్లింపు కోసం రైతులు చేస్తోన్న విన్నపాలను ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. ఈలోగా 2014-15 క్రషింగ్ సీజన్ రానే వచ్చింది.
జిల్లాలో ప్రైవేటు చక్కెర పరిశ్రమలు అప్పుడే క్రషింగ్ ప్రారంభించాయి. కానీ.. సహకార చక్కెర పరిశ్రమల్లో క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించడం లేదు. అటు బకాయిలు చెల్లించకపోవడం.. ఇటు క్రషింగ్ ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస కరవుతో చిక్కి శల్యమై.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు తక్షణమే బకాయిలు చెల్లించాలని చెరకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. సహకార చక్కెర పరిశ్రమల్లో క్రషింగ్‌కు అనుమతించకపోవడం ద్వారా ఆ పరిశ్రమలను మరింత నష్టాల్లో కూరుకుపోయేలా సర్కారు కుట్రలు చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రైవేటు చక్కెర పరిశ్రమలకు లబ్ధి చేకూర్చడం కోసమే సహకార పరిశ్రమల్లో క్రషింగ్‌కు అనుమతించడం లేదని స్పష్టీకరిస్తున్నారు. బకాయిలను తక్షణమే చెల్లించాలి.. క్రషింగ్‌ను వెంటనే ప్రారంభించాలి అనే డిమాండ్లతో చెరకు రైతులు ఉద్యమబాట పట్టారు. రైతు సంఘాలు వారికి బాసటగా నిలిచాయి. సోమవారం ఎస్వీ షుగర్స్ ఎదుట రైతు సంఘాల సమాఖ్య నేతృత్వంలో భారీ ఉద్యమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరు షుగర్స్ ఎదుట చెరకు రైతులు కదంతొక్కడానికి సమాయత్తమవుతున్నారు. వరుస ఉద్యమాలకు చెరకు రైతులు సన్నద్ధమవుతుండటం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చెరకు రైతు ఉద్యమబాట
Published Mon, Nov 10 2014 2:26 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement