జహీరాబాద్: జహీరాబాద్ సమీపంలోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో గురువారం నుంచి క్రషింగ్ ప్రారంభించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. దీంతో రైతులు చెరకు ఉత్పత్తులను క్రషింగ్ నిమిత్తం కర్మాగారానికి తరలిస్తున్నారు. బుధవారం పలువురు రైతులు చెరకు పంటను ట్రాక్టర్లలో కర్మాగారానికి తరలించారు. చెరకు ధరను పెంచక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది చెల్లించిన ధరకంటే ఎక్కువ ధర చెల్లించే అవకాశమే లేదని ఇప్పటికే కర్మాగారం ప్రతినిధులు ప్రకటించారని రైతులు వాపోతున్నారు. చక్కెరకు మార్కెట్‌లో ఏ మాత్రం డిమాండ్ లేనందున గత ఏడాది చెల్లించిన విధంగానే ప్రస్తు క్రషింగ్ సీజన్‌లో కూడా టన్నుకు రూ.2,600ల మేర చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడుల వ్యయం రెట్టింపైనందున టన్ను చెరకు ధరను రూ.3,500లు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం మెట్టు దిగడం లేదు. ఇది రైతులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది.
భారీగా చెరకు సాగు
గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జహీరాబాద్ జోన్ పరిధిలో చెరకు పంట అధికంగానే సాగులో ఉంది. ప్రస్తుతం జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం పరిధిలో 24వేల ఎకరాల మేర చెరకు పంట సాగులో ఉంది. అయినా ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నందున దిగుబడులు బాగా పడిపోయే అవకాశం ఉంది.
గత సంవత్సరం ఎకరాకు 24 టన్నుల సగటు దిగుబడి రాగా, ఈ సంవత్సరం 19 టన్నులకు పడిపోయే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. పెట్టుబడుల వ్యయం మాత్రం అధికమైందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది మాదిరిగానే ధరను చెల్లించాలని యాజ మాన్యం నిర్ణయించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చెరకు కోత, రవాణా సబ్సిడీలను అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నేటి నుంచి ‘ట్రైడెంట్’లో క్రషింగ్ ప్రారంభం
Published Wed, Nov 19 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement
Advertisement