Trident sugar factory
-
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి
జహీరాబాద్ టౌన్: మండలంలోని కొత్తూర్(బి) ట్రైడెంట్ చెక్కెర కర్మగారం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పిచరాగడికి చెందిన పాస్టర్ మృతి చెందినట్లు జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..కోహీర్ మండలం పిచరాగడికి చెందిన పసుల రాజు(45) న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం గంగ్వార్ నుంచి పిచరాగడికి మోటారు సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో కొత్తూర్(బి) ట్రైడెంట్ కర్మాగారం గేటు ముందు కల్వర్ట వద్ద గుర్తు తెలియని వాహనం అతడి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన పాస్టర్ అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. శ్రీకాంత్ తెలిపారు. -
బిల్లులు ఎప్పుడిస్తరో?
ఆశగా ఎదురుచూస్తున్న రైతులు క్రషింగ్ ముగిసి ఐదు నెలలవుతున్నా అందని డబ్బులు టన్నుకు రూ.145ల వంతున బకాయిపడిన ట్రైడెండ్ యాజమాన్యం జహీరాబాద్: క్రషింగ్ ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా బిల్లులు చెల్లించకుండా ట్రైడెంట్ యాజమాన్యం జాప్యం చేస్తోంది. దీంతో తాము సాగు పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ సమీపంలోని కొత్తూర్(బి) గ్రామంలోని ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం 2015–16 క్రషింగ్ సీజన్‌కు గాను 3లక్షల టన్నులు గాను గాడించింది. టన్నుకు రూ.2,600ల మేర చెరకు ధరను చెల్లించేందుకు నిర్ణయించింది. రైతులు చెరకును సరఫరా చేసినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లులను చెల్లించలేదు. టన్నుకు రూ.145వంతున యాజమాన్యం రైతులకు బకాయి పడింది. క్రషింగ్ చేసిన మేరకు కర్మాగారానికి చెరకును సరఫరా చేసిన రైతులకు రూ.3.35 కోట్ల మేర యాజమాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో యాజమాన్యం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా బిల్లులను బకాయి పడుతోందన్నారు. 2014–15 క్రషింగ్ సీజన్‌కు సంబంధించిన బిల్లులను ఈ సంవత్సరం సీజన్ ప్రారంభమైన అనంతరమే చెల్లించిందన్నా చెరకు సాగు కోసం అప్పులు తెచ్చి పెడుతున్నట్లు, సకాలంలో బిల్లులు రాక పోవడంతో వడ్డీ కట్టక తప్పడం లేదంటున్నారు. దీంతో పంటపై వచ్చే లాభం కూడా అప్పుల రూపంలో రాకుండా పోతోందన్నారు. ఇప్పటికైనా కర్మాగారం యాజమాన్యం, అధికారులు స్పందించి చెరకు బకాయి బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పెట్టుబడుల కోసం ఇబ్బందులు వ్యవసాయం కోసం పెట్టుబడులు అధికంగా పెట్టాల్సి వస్తోందని, దీంతో బయట నుంచి అప్పులు తెచ్చుకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. పంట సాగు కోసం విధిలేని పరిస్థితుల్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టక తప్పడం లేదంటున్నారు. ట్రైడెంట్ యాజమాన్యం తమ బిల్లులను చెల్లిస్తే పంట సాగు కోసం అవసరమైన పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుంటుందన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో యాజమాన్యం సరిగా స్పదించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయి బిల్లులను వెంటనే చెల్లించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
నేటి నుంచి ‘ట్రైడెంట్’లో క్రషింగ్ ప్రారంభం
జహీరాబాద్: జహీరాబాద్ సమీపంలోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో గురువారం నుంచి క్రషింగ్ ప్రారంభించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. దీంతో రైతులు చెరకు ఉత్పత్తులను క్రషింగ్ నిమిత్తం కర్మాగారానికి తరలిస్తున్నారు. బుధవారం పలువురు రైతులు చెరకు పంటను ట్రాక్టర్లలో కర్మాగారానికి తరలించారు. చెరకు ధరను పెంచక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది చెల్లించిన ధరకంటే ఎక్కువ ధర చెల్లించే అవకాశమే లేదని ఇప్పటికే కర్మాగారం ప్రతినిధులు ప్రకటించారని రైతులు వాపోతున్నారు. చక్కెరకు మార్కెట్లో ఏ మాత్రం డిమాండ్ లేనందున గత ఏడాది చెల్లించిన విధంగానే ప్రస్తు క్రషింగ్ సీజన్లో కూడా టన్నుకు రూ.2,600ల మేర చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడుల వ్యయం రెట్టింపైనందున టన్ను చెరకు ధరను రూ.3,500లు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం మెట్టు దిగడం లేదు. ఇది రైతులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. భారీగా చెరకు సాగు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జహీరాబాద్ జోన్ పరిధిలో చెరకు పంట అధికంగానే సాగులో ఉంది. ప్రస్తుతం జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం పరిధిలో 24వేల ఎకరాల మేర చెరకు పంట సాగులో ఉంది. అయినా ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నందున దిగుబడులు బాగా పడిపోయే అవకాశం ఉంది. గత సంవత్సరం ఎకరాకు 24 టన్నుల సగటు దిగుబడి రాగా, ఈ సంవత్సరం 19 టన్నులకు పడిపోయే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. పెట్టుబడుల వ్యయం మాత్రం అధికమైందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది మాదిరిగానే ధరను చెల్లించాలని యాజ మాన్యం నిర్ణయించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చెరకు కోత, రవాణా సబ్సిడీలను అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
బకాయిలు వచ్చేదెన్నడో?
జహీరాబాద్: స్థానిక ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం యాజమాన్యం.. చైరకు బకాయిలను చెల్లించే విషయంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఫలితంగా రెతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సాగు పెట్టుబడుల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రుణమాఫీ అమలైతే తిరిగి రుణాలు పొందవచ్చనే ఆశ నీరుకారడంతో.. ట్రైడెంట్ యాజమాన్యమైనా బకాయిలు చెల్లిస్తే పెట్టుబడుల కోసం కొంత ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ అమలవుతుందని ఆశించిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్‌రావు అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయినా.. రుణమాఫీ అమలు కాక పోవడంతో ఖరీఫ్ పెట్టుబడుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన పరిస్థితి ఎదురైంది. విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టక తప్పడం లేదు. మరో పక్షం రోజులు గడిస్తే రబీ పంటల సాగు కోసం కూడా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండడంతో చేతిలో చిల్లిగవ్వ లేని రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీసం యాజమాన్యం చెరకు బకాయిలనైనా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తే సౌకర్యంగా ఉంటుందని రైతులు అంటున్నారు. తిరిగి క్రషింగ్ సీజన్ ప్రారంభించేందుకు సమయం దగ్గర పడుతున్నా బకాయిలను చెల్లించే విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2013-14 సీజన్‌కు గాను ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం 4.65 లక్షల టన్నుల మేర చెరకు పంటను గానుగాడించింది. క్రషింగ్ ప్రారంభం నుంచి యాజమాన్యం పూర్తి బిల్లులను చెల్లించలేదు. క్రషింగ్ సీజన్‌కు గాను యాజమాన్యం టన్నుకు రూ.2,600 ధరను నిర్ణయించింది. క్రషింగ్ సీజన్ ఆరంభం నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు టన్నుకు రూ.2,400 బిల్లులను చెల్లిస్తూ వచ్చింది. అయితే మిగతా 200 రూపాయలను క్రషింగ్ ముగిసిన అనంతరం చెల్లించడం జరుగుతుందని యాజమాన్యం క్రషింగ్ ఆరంభంలో ప్రకటించింది. క్రషింగ్ ముగిసి ఆరు నెలలు కావస్తున్నా బిల్లుల బకాయిలను పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. బకాయిలను ఇంత వరకు రైతులకు చెల్లించలేదు. ఈ బిల్లుల కింద యాజమాన్యం రైతులకు రూ.9.30 కోట్లు బకాయి పడింది. వీటిని చెల్లించే విషయంలో యాజమాన్యం జాప్యం చేస్తోందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా యాజమాన్యం బకాయి పడిన చెరకు బిల్లులను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని బకాయిలు తక్షణమే చెల్లించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని వారు విన్నవించుకుంటున్నారు.