ట్రైడెంట్ చక్కెర కర్మాగారం
- ఆశగా ఎదురుచూస్తున్న రైతులు
- క్రషింగ్ ముగిసి ఐదు నెలలవుతున్నా అందని డబ్బులు
- టన్నుకు రూ.145ల వంతున బకాయిపడిన ట్రైడెండ్ యాజమాన్యం
జహీరాబాద్: క్రషింగ్ ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా బిల్లులు చెల్లించకుండా ట్రైడెంట్ యాజమాన్యం జాప్యం చేస్తోంది. దీంతో తాము సాగు పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ సమీపంలోని కొత్తూర్(బి) గ్రామంలోని ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం 2015–16 క్రషింగ్ సీజన్‌కు గాను 3లక్షల టన్నులు గాను గాడించింది.
టన్నుకు రూ.2,600ల మేర చెరకు ధరను చెల్లించేందుకు నిర్ణయించింది. రైతులు చెరకును సరఫరా చేసినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లులను చెల్లించలేదు. టన్నుకు రూ.145వంతున యాజమాన్యం రైతులకు బకాయి పడింది. క్రషింగ్ చేసిన మేరకు కర్మాగారానికి చెరకును సరఫరా చేసిన రైతులకు రూ.3.35 కోట్ల మేర యాజమాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది.
ఈ విషయంలో యాజమాన్యం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా బిల్లులను బకాయి పడుతోందన్నారు. 2014–15 క్రషింగ్ సీజన్‌కు సంబంధించిన బిల్లులను ఈ సంవత్సరం సీజన్ ప్రారంభమైన అనంతరమే చెల్లించిందన్నా చెరకు సాగు కోసం అప్పులు తెచ్చి పెడుతున్నట్లు, సకాలంలో బిల్లులు రాక పోవడంతో వడ్డీ కట్టక తప్పడం లేదంటున్నారు. దీంతో పంటపై వచ్చే లాభం కూడా అప్పుల రూపంలో రాకుండా పోతోందన్నారు. ఇప్పటికైనా కర్మాగారం యాజమాన్యం, అధికారులు స్పందించి చెరకు బకాయి బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పెట్టుబడుల కోసం ఇబ్బందులు
వ్యవసాయం కోసం పెట్టుబడులు అధికంగా పెట్టాల్సి వస్తోందని, దీంతో బయట నుంచి అప్పులు తెచ్చుకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. పంట సాగు కోసం విధిలేని పరిస్థితుల్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టక తప్పడం లేదంటున్నారు. ట్రైడెంట్ యాజమాన్యం తమ బిల్లులను చెల్లిస్తే పంట సాగు కోసం అవసరమైన పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుంటుందన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో యాజమాన్యం సరిగా స్పదించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయి బిల్లులను వెంటనే చెల్లించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.