మునిపల్లి, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రావడం ఖాయమని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సీమాంధ్ర నేతలు ఆడుతున్న నాటకాలను కేంద్రం గమనిస్తోందని తెలిపారు. మునిపల్లి మండలంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజనర్సింహ మాట్లాడుతూ ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం వెయ్యి మందికిపైగా యువకులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. సమానత్వంతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్టాన్ని ప్రకటించారని చెప్పారు.
ప్రజల మనోభావాలను గుర్తించే రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధమయ్యారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2004-09 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నప్పుడు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం అడ్డు తగలడం తగదన్నారు. సీమాంధ్ర పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తేనే ప్రజలు సుఖ, సంతోషాలతో ఉంటారని అన్నారు. జిల్లా అభివృద్ధికి తాను ఎల్లవేళలా పాటుపడుతున్నానని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో రూ.300 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు ప్రకటించారు. నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరందించనున్నట్టు వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం అధిక నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలిపారు. అక్షరాస్యత పెంపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, అందరూ విద్యావంతులు కావాలన్నారు.
కాగా మునిపల్లి మండలంలో రూ. 19 కోట్లతో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్‌షెట్కార్, కలెక్టర్ స్మితా సబర్వాల్, రాయికోడ్, మునిపల్లి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, మాజీ ఎంపీపీలు అంజయ్య, రాజేశ్వర్‌రావు, టీడీపీ మాజీ అధ్యక్షుడు బాబూ పాటిల్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణ ఆగదు
Published Sun, Dec 22 2013 11:37 PM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM
Advertisement