developing works
-
ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటుంది : సీఎం వైఎస్ జగన్
-
కాసేపట్లో నరసాపురం చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్
-
నరసాపురంలో నవశకం..
-
పనులు చకచకా
తణుకు, న్యూస్‌లైన్: ఎన్నికలు సమీపిస్తుండడంతో పాలకుల్లో హైరానా మొదలైంది. దీంతో తణుకు పట్టణంలోని పలు అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఇన్నాళ్లు ఏళ్లతరబడి సాగుతున్న నిర్మాణ పనులను తమ హయాంలో పూర్తిచేసేందుకు నేతలు తహతహలాడుతున్నారు. ఈనేపథ్యంలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. చేపట్టిన పనులు తొందరగా పూర్తిచేసేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో నాణ్యతపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది. దాదాపు మూడున్నరేళ్లుగా మునిసిపాటీకి పాలకవర్గాలు లేకపోవటంతో కౌన్సిలర్ల నుంచి ఏర్పాటయ్యే కాంట్రాక్ట్ కమిటీలు లేకుండా పోయాయి. దీంతో అభివృద్ధి పనులపై ప్రజల తరపున పర్యవేక్షణ కరువైందని పలువురు విమర్శిస్తున్నారు. సకాలంలో పనులు పూర్తికాకపోవటంవల్ల ప్రజాసొమ్మును అదనంగా వినియోగించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి తొమ్మిదేళ్లు తణుకు మునిసిపాలిటీ పరిధిలో తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభించిన బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం రాష్ట్రపతి రోడ్డు నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీ జాతీయరహదారికి చేరేలా సజ్జాపురం శివాలయం ప్రాంతంలో 2005లో గోస్తనీ కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2007 నాటికల్లా బ్రిడ్జిని వినియోగంలోకి తీసుకురావాలని భావించారు. అప్పట్లో రూ.95 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు పనులు జాప్యం చేయడం, స్థలవివాదాలు తదితర కారణాలతో బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. ఈనేపథ్యంలో నిర్మాణ అంచనావ్యయం పెరగడంతో మునిసిపాలిటీ మరో రూ.45 లక్షలు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బ్రిడ్జి రెండువైపులా అప్రోచ్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరుకు నిర్మాణపనులు పూర్తవుతాయని మునిసిపల్ డీఈ శ్రీకాంత్ చెప్పారు. బ్రిడ్జి వినియోగంలోకి వస్తే హౌసింగ్ బోర్డుకాలనీ ప్రాంతానికి చెందిన వారితోపాటు చివటం, టీచర్స్‌కాలనీ, న్యూబ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల వారు పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు దగ్గర మార్గంగా ఉపయోగపడుతుంది. -
తెలంగాణ ఆగదు
మునిపల్లి, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రావడం ఖాయమని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సీమాంధ్ర నేతలు ఆడుతున్న నాటకాలను కేంద్రం గమనిస్తోందని తెలిపారు. మునిపల్లి మండలంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజనర్సింహ మాట్లాడుతూ ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం వెయ్యి మందికిపైగా యువకులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. సమానత్వంతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్టాన్ని ప్రకటించారని చెప్పారు. ప్రజల మనోభావాలను గుర్తించే రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధమయ్యారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2004-09 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నప్పుడు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం అడ్డు తగలడం తగదన్నారు. సీమాంధ్ర పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తేనే ప్రజలు సుఖ, సంతోషాలతో ఉంటారని అన్నారు. జిల్లా అభివృద్ధికి తాను ఎల్లవేళలా పాటుపడుతున్నానని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో రూ.300 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు ప్రకటించారు. నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరందించనున్నట్టు వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం అధిక నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలిపారు. అక్షరాస్యత పెంపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, అందరూ విద్యావంతులు కావాలన్నారు. కాగా మునిపల్లి మండలంలో రూ. 19 కోట్లతో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్‌షెట్కార్, కలెక్టర్ స్మితా సబర్వాల్, రాయికోడ్, మునిపల్లి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, మాజీ ఎంపీపీలు అంజయ్య, రాజేశ్వర్‌రావు, టీడీపీ మాజీ అధ్యక్షుడు బాబూ పాటిల్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
జిల్లాలో రూ.3.64 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు
సమిశ్రగూడెం (నిడదవోలురూరల్), న్యూస్‌లైన్: జిల్లాలో రూ.3.64 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి వి.నాగార్జునసాగర్ అన్నారు. మంగళవారం సమిశ్రగూడెం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2.63 కోట్లు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రూ.1.01 కోట్లతో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు పైపులైన్ల నిర్వాహణకు చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. దీంతోపాటు శాశ్వత ప్రాతిపదికన సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాజీవ్‌గాంథీ స్వశక్తి యోజనలో రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో 50 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసినట్టు నాగార్జునసాగర్ తెలిపారు. ఒక్కో భవన వ్యయం రూ.15 లక్షలుగా అంచనా సిద్ధం చేశామన్నారు. నిర్మల్‌భారత్ అభియాన్ పథకంలో భాగంగా అవసరమైన ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. పంచాయతీల్లో పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణకు పన్నులు వసూళ్లతో వనరులు సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. అనధికారికంగా నిర్వహించే పరిశ్రమలను గుర్తించి పన్నులు విధించడం ద్వారా పంచాయతీలు ఆదాయం రాబట్టుకోవాలన్నారు. 10వ తరగతిలో నూటికి నూరుశాతం మెరుగైన ఫలితాలు సాధించేలా కృషిచేయాలని ఎంఈవో వంగా సూర్యనారాయణమూర్తిని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఎంపీడీవో ఎస్.నిర్మలజ్యోతి పాల్గొన్నారు.