పనులు చకచకా | developing works speed increased for election | Sakshi
Sakshi News home page

పనులు చకచకా

Published Sun, Jan 5 2014 12:26 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

developing works speed increased for election

తణుకు, న్యూస్‌లైన్: ఎన్నికలు సమీపిస్తుండడంతో పాలకుల్లో హైరానా మొదలైంది. దీంతో తణుకు పట్టణంలోని పలు అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఇన్నాళ్లు ఏళ్లతరబడి సాగుతున్న నిర్మాణ పనులను తమ హయాంలో పూర్తిచేసేందుకు నేతలు తహతహలాడుతున్నారు. ఈనేపథ్యంలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. చేపట్టిన పనులు తొందరగా పూర్తిచేసేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

అయితే ఈ పరిస్థితుల్లో నాణ్యతపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది. దాదాపు మూడున్నరేళ్లుగా మునిసిపాటీకి పాలకవర్గాలు లేకపోవటంతో కౌన్సిలర్ల నుంచి ఏర్పాటయ్యే కాంట్రాక్ట్ కమిటీలు లేకుండా పోయాయి. దీంతో అభివృద్ధి పనులపై ప్రజల తరపున పర్యవేక్షణ కరువైందని పలువురు విమర్శిస్తున్నారు. సకాలంలో పనులు పూర్తికాకపోవటంవల్ల ప్రజాసొమ్మును అదనంగా వినియోగించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 బ్రిడ్జి నిర్మాణానికి తొమ్మిదేళ్లు
 తణుకు మునిసిపాలిటీ పరిధిలో తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభించిన బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం రాష్ట్రపతి రోడ్డు నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీ జాతీయరహదారికి చేరేలా సజ్జాపురం శివాలయం ప్రాంతంలో 2005లో గోస్తనీ కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2007 నాటికల్లా బ్రిడ్జిని వినియోగంలోకి తీసుకురావాలని భావించారు. అప్పట్లో రూ.95 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు పనులు జాప్యం చేయడం, స్థలవివాదాలు తదితర కారణాలతో బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి.

ఈనేపథ్యంలో నిర్మాణ అంచనావ్యయం  పెరగడంతో మునిసిపాలిటీ మరో రూ.45 లక్షలు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం బ్రిడ్జి రెండువైపులా అప్రోచ్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరుకు నిర్మాణపనులు పూర్తవుతాయని మునిసిపల్ డీఈ శ్రీకాంత్ చెప్పారు. బ్రిడ్జి వినియోగంలోకి వస్తే హౌసింగ్ బోర్డుకాలనీ ప్రాంతానికి చెందిన వారితోపాటు చివటం, టీచర్స్‌కాలనీ, న్యూబ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల వారు పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు దగ్గర మార్గంగా ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement