మాతృభాషను గౌరవించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మాతృభాషను గౌరవించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవా న్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం జరి గిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఐదో భాషగా గుర్తిం పు పొందిన తెలుగు ప్రస్తుతం నిరాదరణకు గురవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. భాషను సంరక్షించేందుకు పాటుపడుతున్న సాహితీ కళాకారులు, కవులు, రచయితలకు ధన్యవాదాలు తెలిపారు. తాను బెంగాళీనైనా తెలుగును ఇష్టంతో కష్టపడి నేర్చుకున్నట్టు చెప్పారు.
జిల్లా యంత్రాంగం కూడా ప్రజలకు అర్థమ య్యేలా, సులభంగా ఉండే విధంగా స్థానిక భాషల్లోనే సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జేసీ డా.ఎ.శరత్ మాట్లాడుతూ మాతృభాషపై అలసత్వం వహిస్తే తల్లిని మర్చినట్లేనని అన్నారు. విలువలకు పునరజ్జీవనం, ప్రేరణ పొందాలంటే మాతృభాషను ప్రేమించాలన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురువైన వేలేటి మృత్యుంజయశర్మను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మృత్యుంజయ శర్మ మాట్లాడుతూ భాషా పరిరక్షణ పేరుతో ఉద్యమం నిర్మించుకోవాల్సిన పరిస్థితి దాపురించడం బాధాకరమన్నారు.
అధికారికంగా భాషను వినియోగించుకొనేందుకు కృషిచేయాలని కోరారు. చిన్నారులకు మాతృభాష నేర్పించడంతో పాటు విలువలను నేర్పినపుడే భాష పరిరక్షణ సాధ్యమన్నారు. అంతకుముందు తెలు గు భాష పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బోర్పట్ల హనుమంతాచారి మాట్లాడుతూ భాష సంరక్షణ కోసం యం త్రాంగం చొరవ తీసుకోవడంతో పాటు ఉత్తర, ప్రత్యుత్తరాలు మాతృభాషలో జరిగేలాచూడాలన్నారు.
అనంతరం మా తృభాష అంశాలపై నిర్వహించిన పోటీ ల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయగా, ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీపాద బాలాజీ, పరమేష్,వి.రాజయ్యలను సన్మానం చేశారు. ఈ సమావేశంలో డీఈఓ రమేష్ పాల్గొనగా వ్యా ఖ్యాతగా భానుప్రకాష్ వ్యవహరించారు. అంతకుముందు సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు ప్రార్థనాగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.