International Mother Tongue Day
-
సగర్వంగా మాతృభాషలో మాట్లాడండి
న్యూఢిల్లీ: ప్రజలు సగర్వంగా తమ మాతృభాషల్లోనే మాట్లాడుకోవాలని ప్రధాని మోదీ కోరారు. భాషల సంపన్నతలో మనకు సాటి మరెవరూ లేరన్నారు. ప్రజాదరణ పొందిన పలు భారతీయ గీతాలను వివిధ భాషల్లో వీడియోలుగా రూపొందించి, వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చి, దేశ భిన్నత్వాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు. జాతీయ గీతం సహా పలు భారతీయ గీతాలకు అనుగుణంగా పెదాలు కదుపుతూ(లిప్ సింకింగ్) తయారు చేసిన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టాంజానియాకు చెందిన కవలలు కిలి పౌల్, నీమాలను ఆయన ఉదహరించారు. ఆదివారం ప్రధాని ‘మన్‌కీ బాత్’లో దేశ ప్రజలద్దేశించి మాట్లాడుతూ ఇటీవల జరుపుకున్న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ పైమాటలన్నారు. దేశంలో 121 మాతృభాషలుండగా, వీటిలో 14 భాషలను కోటి మందికి పైగా ప్రజలు నిత్యం మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీకి మూడో స్థానం దక్కిందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన తర్వాత కూడా చాలా మంది దేశవాసుల్లో ఇప్పటికీ వేషభాషలు, ఆహార పానీయాలకు సంబంధించి అపోహలు, అభ్యంతరాలు ఉన్నాయన్నారు. నూతన విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు కృషి జరుగుతోందన్నారు. బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, టాంజానియా మాజీ ప్రధాని ఒడింగా కూతురు రోజ్మేరీ వంటి వారు మన ఆయుర్వేద విధానం పట్ల మక్కువ పెంచుకున్నారన్నారు. దేశంలో ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు ఆయుష్ శాఖను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ప్రధాని మోదీ.. పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించేందుకు, వివిధ రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సును పెంచినట్లు చెప్పారు. ట్రిపుల్ తలాక్ వంటి సామాజిక దురాచారాలనూ రూపుమాపాం. ట్రిపుల్ తలాక్‌పై చట్టం తీసుకువచ్చాక దేశంలో ట్రిపుల్ తలాక్ కేసుల్లో 80% తగ్గుదల కనిపించిందన్నారు. మార్పు కోరుతూ మహిళలు ముందుకు రావడమే ఈ పరిణామానికి కారణమైందన్నారు. అస్సాంలోని కోక్రాఝర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్, జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లలో పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు జరుగుతున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
అమ్మ భాష తెలుగు.. అక్షరమై వెలుగు
మాతృభాష గొప్పదనం మాటల్లో వర్ణించలేనిది. భావ వ్యక్తీకరణకు సులభమైన.. సులక్షణమైన మార్గం అమ్మభాష. అందుకే గాంధీ మాతృభాష గురించి ఇలా అన్నారు.. మాతృభాషా తృణీకారం.. మాతృదేవీ తిరస్కారం అని రెండు పంక్తుల్లో మాతృభాష ప్రాశస్త్యాన్ని చాటిచెప్పారు. ప్రతి జాతి సంస్కృతి వికాసానికి మూలం మాతృభాష. ప్రపంచీకరణ నేపథ్యంలో భాషా వికాసం పెరిగింది. అయితే మనగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్తపడాలి. తమతమ మాతృభాషలను కాపాడుకోవాలని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నారు. సాక్షి, విజయవాడ : మాతృ భాషతోనే జాతి సాంస్కృతిక సంపద వెలుగొందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది భాషలు ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్ని భాషల ఉనికి ప్రమాదంలో పడటం ఆందోళన కలిగించే అంశం. మాతృ భాష కోసం బెంగాల్ యువకుల ఆత్మబలిదానం రగిల్చిన ఉద్యమ స్ఫూర్తితో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి పునాది పడింది. నేపథ్యం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి ఏటా ఫిబ్రవరి 21న నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ సభ (1999 నవంబరు 17న) ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృ భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. లక్ష్యాలు ప్రపంచంలోని చిన్నాచితకా దేశాలతో పాటు అతి పెద్ద దేశాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి దేశానికి, ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ భాష ఉంటుంది. భాషా సాంస్కృతిక వైవిధ్యం కాపాడుకోవడం, బహు భాషల ప్రభావాన్ని ప్రోత్సహించడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవడం భాషా వికాసానికి లక్ష్యాలుగా ఉండాలని మేధావులు సూచించారు. ►మాతృభాషా వికాసానికి ప్రభుత్వాలు నడుంబిగించాలి. ►అంతరించిపోతున్న భాషలను గుర్తించి కాపాడుకోవాలి. ►మౌఖిక భాషలకు అక్షర రూపం కల్పించాలి. ►ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా భాషా సదస్సులు నిర్వహించాలి. ►పాలనాభాషాగా ప్రజలు మాట్లాడే భాష ఉండాలి. ►భాషకు అనుబంధంగా ఉన్న మాండలికాలను ప్రోత్సహించాలి తెలుగు భాషాభివృద్ధిలో మన కవులు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసినవారిలో కృష్ణానదీ తీరప్రాంతమైన పెనుగంచిప్రోలులో జని్మంచిన ఉద్యమకర్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, తెలుగులో తొలి కథా రచయిత్రి బండారు అచ్చమాంబ ముఖ్యులు. నిద్రాణమైన తెలుగు జాతిని మేల్కొలిపిన కొమర్రాజు 1876 మే 18న పెనుగంచిప్రోలులో జని్మంచిన కొమర్రాజు తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం రచయిత, విజ్ఞాన మండలి స్థాపకుడు. భువనగిరిలో ప్రాథమిక విద్య అభ్యసించి నాగపూర్‌లో అక్కాబావలతో ఉంటూ మరాఠీ భాష నేర్చుకున్నాడు. 1900లో బీఏ, 1902లో ఎంఏ ఉత్తీర్ణులయ్యారు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు రాశారు, తెలుగు, మరాఠీ, ఇంగ్లిషు, సంస్కృతం, బెంగాల్, ఉర్దూ, హిందీ భాషల్లో ప్రావీణ్యం పొందారు. 1901లో శ్రీకృష్ణదేవరాయేంద్ర భాషా నిలయమైన పుస్తక భాండాగారాన్ని నెలకొల్పిన తొలి తెలుగు వ్యక్తి. 1906లో విజ్ఞాన చంద్రిక మండలిని, 1910లో విజ్ఞాన చంద్రిక పరిషత్‌ను స్థాపించారు. 1916లో రచించిన తెలుగు విజ్ఞాన సర్వస్వం పుస్తకం దక్షిణ భారతదేశంలో సంచలనం సృష్టించింది. 11 భాషా విషయక పుస్తకాలు, 2 చారిత్రక గ్రంథాలు, ఇతర శా్రస్తాలతో 20 పుస్తకాలు రాశారు. 1923లో ఆరోగ్యం క్షీణించి తిరిగిరాని లోకాలకేగారు. తొలి తెలుగు కథారచయిత్రి బండారు అచ్చమాంబ కొమర్రాజు సోదరి అయిన అచ్చమాంబ దేశంలోనే తొలి తెలుగు కథారచయిత్రి. ఆమె అనేక రచనల్లో స్త్రీవిద్య, వితంతు పునరి్వవాహం వంటి సాధక విషయాలతో హిందూసుందరి, జనాన అనే పత్రికల్లో వ్యాసాలు రాశారు. 1901లో మహిళా సంఘాన్ని స్థాపించిన తరువాత ఆమె 1902లో అబల సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని వెలువరించింది. 1901 నుంచి 1903 వరకు ధనత్రయోదశి, గుణవతి వంటి 10 కథలు రాశారు. తొలి తెలుగు కథా రచయిత్రిగా గౌరవం అందుకున్నారు. ఆమె కథల్లో భావోద్వేగాలు, స్త్రీవాదాలు, హక్కులు మొదలైన వైవిధ్యభరితాలు ఆనాడే కనపడేవి. 1904లో ఆమె రాసిన బీద కుటుంబం అనే కథ నాటి సామాజిక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచింది. స్పష్టమైన అభిప్రాయాలతో రచనలు కొనసాగించి తొలి తెలుగు కథా రచయిత్రిగా సుస్థిర స్థానాన్ని పొందారు. -
మాతృభాషను గౌరవించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మాతృభాషను గౌరవించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవా న్ని పురస్కరించుకుని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జరి గిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఐదో భాషగా గుర్తిం పు పొందిన తెలుగు ప్రస్తుతం నిరాదరణకు గురవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. భాషను సంరక్షించేందుకు పాటుపడుతున్న సాహితీ కళాకారులు, కవులు, రచయితలకు ధన్యవాదాలు తెలిపారు. తాను బెంగాళీనైనా తెలుగును ఇష్టంతో కష్టపడి నేర్చుకున్నట్టు చెప్పారు. జిల్లా యంత్రాంగం కూడా ప్రజలకు అర్థమ య్యేలా, సులభంగా ఉండే విధంగా స్థానిక భాషల్లోనే సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జేసీ డా.ఎ.శరత్ మాట్లాడుతూ మాతృభాషపై అలసత్వం వహిస్తే తల్లిని మర్చినట్లేనని అన్నారు. విలువలకు పునరజ్జీవనం, ప్రేరణ పొందాలంటే మాతృభాషను ప్రేమించాలన్నారు. అనంతరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువైన వేలేటి మృత్యుంజయశర్మను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మృత్యుంజయ శర్మ మాట్లాడుతూ భాషా పరిరక్షణ పేరుతో ఉద్యమం నిర్మించుకోవాల్సిన పరిస్థితి దాపురించడం బాధాకరమన్నారు. అధికారికంగా భాషను వినియోగించుకొనేందుకు కృషిచేయాలని కోరారు. చిన్నారులకు మాతృభాష నేర్పించడంతో పాటు విలువలను నేర్పినపుడే భాష పరిరక్షణ సాధ్యమన్నారు. అంతకుముందు తెలు గు భాష పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బోర్పట్ల హనుమంతాచారి మాట్లాడుతూ భాష సంరక్షణ కోసం యం త్రాంగం చొరవ తీసుకోవడంతో పాటు ఉత్తర, ప్రత్యుత్తరాలు మాతృభాషలో జరిగేలాచూడాలన్నారు. అనంతరం మా తృభాష అంశాలపై నిర్వహించిన పోటీ ల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయగా, ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీపాద బాలాజీ, పరమేష్,వి.రాజయ్యలను సన్మానం చేశారు. ఈ సమావేశంలో డీఈఓ రమేష్ పాల్గొనగా వ్యా ఖ్యాతగా భానుప్రకాష్ వ్యవహరించారు. అంతకుముందు సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు ప్రార్థనాగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.