న్యూఢిల్లీ: ప్రజలు సగర్వంగా తమ మాతృభాషల్లోనే మాట్లాడుకోవాలని ప్రధాని మోదీ కోరారు. భాషల సంపన్నతలో మనకు సాటి మరెవరూ లేరన్నారు. ప్రజాదరణ పొందిన పలు భారతీయ గీతాలను వివిధ భాషల్లో వీడియోలుగా రూపొందించి, వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చి, దేశ భిన్నత్వాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు. జాతీయ గీతం సహా పలు భారతీయ గీతాలకు అనుగుణంగా పెదాలు కదుపుతూ(లిప్ సింకింగ్) తయారు చేసిన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టాంజానియాకు చెందిన కవలలు కిలి పౌల్, నీమాలను ఆయన ఉదహరించారు.
ఆదివారం ప్రధాని ‘మన్‌కీ బాత్’లో దేశ ప్రజలద్దేశించి మాట్లాడుతూ ఇటీవల జరుపుకున్న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ పైమాటలన్నారు. దేశంలో 121 మాతృభాషలుండగా, వీటిలో 14 భాషలను కోటి మందికి పైగా ప్రజలు నిత్యం మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీకి మూడో స్థానం దక్కిందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన తర్వాత కూడా చాలా మంది దేశవాసుల్లో ఇప్పటికీ వేషభాషలు, ఆహార పానీయాలకు సంబంధించి అపోహలు, అభ్యంతరాలు ఉన్నాయన్నారు. నూతన విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు కృషి జరుగుతోందన్నారు. బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, టాంజానియా మాజీ ప్రధాని ఒడింగా కూతురు రోజ్‌మేరీ వంటి వారు మన ఆయుర్వేద విధానం పట్ల మక్కువ పెంచుకున్నారన్నారు.
దేశంలో ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు ఆయుష్ శాఖను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ప్రధాని మోదీ.. పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించేందుకు, వివిధ రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సును పెంచినట్లు చెప్పారు. ట్రిపుల్ తలాక్ వంటి సామాజిక దురాచారాలనూ రూపుమాపాం. ట్రిపుల్ తలాక్‌పై చట్టం తీసుకువచ్చాక దేశంలో ట్రిపుల్ తలాక్ కేసుల్లో 80% తగ్గుదల కనిపించిందన్నారు. మార్పు కోరుతూ మహిళలు ముందుకు రావడమే ఈ పరిణామానికి కారణమైందన్నారు. అస్సాంలోని కోక్రాఝర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్, జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లలో పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు జరుగుతున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment