రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | Government goal is farmers welfare | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Published Sun, Dec 22 2013 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

Government goal is farmers welfare

 జహీరాబాద్, న్యూస్‌లైన్:  రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు హిత’ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గీతారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో రైతులకే పెద్దపీట వేశామన్నారు. అందువల్లే రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా సబ్సిడీలపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నామన్నారు. వీటిని వినియోగించుకుని రైతులు లబ్ధి పొందాలన్నారు.

 అంతేకాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తల చేత రైతులకు సూచనలు, సలహాలు ఇప్పిస్తూ దిగుబడులు పెరిగేలా చూస్తున్నామన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని భావించే సర్కార్ తమదనీ, అందువల్లే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్సార్ తన తొలి సంతకర  వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ అందించే ఫైలుపైనే చేశారని ఆమె గుర్తుచేశారు. ఆ పథకాన్ని ఇప్పటికీ అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా సకాలంలో రైతులకు పంపిణీ చేశామన్నారు.
 చెరకు రైతుకూ చేయూనిచ్చాం
 రైతు సంక్షేమాన్ని విస్మరించిన అప్పటి పాలకులు జహీరాబాద్‌లోని నిజాం షుగర్స్ లిమిటెడ్ చక్కెర కర్మాగారాన్ని కారుచౌకగా విక్రయించారని గీతారెడ్డి ఆరోపించారు. యాజమాన్యం చెరకు ధరను రూ.2,400లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధపడగా, తాము రూ.2,600 ఇచ్చే విధంగా ఒత్తిడి చేసి రైతులకు మేలు చేకూర్చామన్నారు. అంతేకాకుండా సాగుకు అవసరమయ్యే పెట్టుబడులు కూడా బ్యాంకుల ఇప్పిస్తూ రైతులను చేయూతనిచ్చామన్నారు.
 పండ్ల తోటల సాగుపట్ల రైతులు ఆసక్తి చూపాలి: కలెక్టర్
 జహీరాబాద్ ప్రాంతంలోని భూములు పండ్ల తోటల సాగుకు అనుకూలంగా ఉన్నందున రైతులు ఈ దిశలో శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ స్మిత సబర్వాల్ సూచించారు. పండ్ల తోటలతో పాటు కూరగాయలు కూడా సాగు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నారు. ప్రస్తుతం సుమారు 10 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయనీ, దీన్ని మరో రెండు వేల ఎకరాలకు పెంచుకోవాలన్నారు. పండ్లతోటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు తగిన విధంగా సహకారం అందిస్తామన్నారు. పూల తోటల సాగుకు కూడా ప్రభుత్వం తగిన చేయూతనిస్తోందన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ ఉమా మహేశ్వరమ్మ, ఏపీ ఎంఐపీ పీడీ రామలక్ష్మి, హార్టికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్ శేఖర్, పశు సంవర్థక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, సెరి కల్చర్ ఏడీ ఈశ్వరయ్య, పరిశ్రమల శాఖ జీఎం సురేష్‌కుమార్, వ్యవసాయ శాఖ జేడీ ఉమా మహేశ్వరమ్మ, కమిషనరేట్ ఓఎస్‌డీ అశోక్, సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారావు, డ్వామా పీడీ రవీందర్, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఆయా మండలాల రైతులు పాల్గొన్నారు.
 రోడ్డు ప్రమాదమృతుల కుటుంబాలకు పరిహారం
 గత నెల 19వ తేదీన కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ కుటుంబాలకు మంత్రి గీతారెడ్డి పరిహారం అందించారు. శనివారం జహీరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నలుగురు విద్యార్థుల కుటుంబీకులతో పాటు ఆటో డ్రైవర్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వంతున పరిహారం పంపిణీ చేశారు. గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  జహీరాబాద్ పట్టణంలోని మాణిక్‌ప్రభు వీధికి చెందిన విద్యార్థి జేమ్స్, మండలంలోని విఠునాయక్ తండాకు చెందిన విద్యార్థి విఠల్, జహీరాబాద్ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ జహీరుద్దీన్, న్యాల్‌కల్ మండలం ముంగి గ్రామానికి చెందిన విద్యార్థి యాదగిరి, ఝరాసంగంకు చెందిన మేఘమాలు మృతి చెందిన విషయం పాఠ కులకు విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement