పల్లె ముఖం చూడని గీతమ్మ | Geetha reddy election campaign in villages | Sakshi
Sakshi News home page

పల్లె ముఖం చూడని గీతమ్మ

Published Fri, Apr 18 2014 12:39 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

పల్లె ముఖం చూడని గీతమ్మ - Sakshi

పల్లె ముఖం చూడని గీతమ్మ

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇపుడు ఎన్నికల ప్రచారంలో ఊరూవాడా తిరుగుతున్న గీతారెడ్డి..ఐదేళ్లుగా తాను గీసుకున్న గిరిని దాటికి బయటకు రాలేదు. దీంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని 52 పల్లెలు తమ ఎమ్మెల్యే కోసం ఐదేళ్లుగా నిరీక్షిస్తున్నాయి. గీతారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. మంత్రి పదవికి ఖాయమని అప్పట్లో ప్రచారం సాగడంతో తమ పల్లెలు బాగుపడతాయని భావించిన గ్రామీణులంతా ఆమెకు ఓటేశారు. అనుకున్నట్టే ‘ఎర్రబుగ్గ’ కారెక్కి కూర్చున్న గీతారెడ్డి ఆతర్వాత పల్లెలను మరిచిపోయారు. 2009 ఎన్నికలకు జహీరాబాద్‌కు వలస వచ్చిన గీతారెడ్డి, ఇక్కడి నుంచి అసెంబ్లీకి అటునుంచి సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో అడుగుపెట్టారు గానీ, తనను అసెంబ్లీకి పంపిన  పల్లెలను ఒక్కసారంటే ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు. ఇంకొన్ని గ్రామాలకు ఒకే ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.

 ఆశలన్నీ ఆవిరి
 గీతారెడ్డికి భారీ, చెక్కర పరిశ్రమల శాఖ పదవి దక్కడంతో జహీరాబాద్ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి చూపిస్తారని ఈ ప్రాంత యువకులు ఆసక్తిగా ఎదురు చూశారు.  కానీ వారి ఆశలన్నీ అడియాశలు చేస్తూ, ఎలాంటి ఉపాధి చూపించకుండానే ఆమె పదవీ కాలం ముగిసిపోయింది. మరోవైపు శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి నిధులు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేకపోయారు. నియోజకవర్గంలో మొత్తం 142 పనులుకు గాను  రూ 2.53 కోట్ల నిధులు మంజూరు కాగా, గీతారెడ్డి  కేవలం 1.77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.  మిగిలిన నిధులు వృథా అయ్యాయి. కనీసం అభివృద్ధి పనుల నిధులు కూడా ఖర్చు చేయలేని గీతమ్మను ఈ  సార్వత్రిక ఎన్నికలు  ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 నియోజకవర్గం మారినా..మారని తీరు
 నియోజకవర్గంలో జహీరాబాద్, న్యాల్‌కల్, కోహీర్, ఝరాసంగం మండలాలు ఉన్నాయి.  హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి 2009 కంటే ముందు అంటే 2004 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ కూడా పల్లెలను పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆమెపై వేటు వేయడానికి  సిద్ధం కాగా, ముందే  పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ వర్గాలు గీతారెడ్డిని 2009 ఎన్నికల్లో జహీరాబాద్ నియోజవర్గానికి పంపించాయి.

ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 112 గ్రామ పంచాయతీలుండగా.. గీతారెడ్డి ఇప్పటి వరకు 52 గ్రామ పంచాయతీల వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అభివృద్ధికి నోచుకోని ఈ పల్లెలన్నీ ఆమెపై తీవ్రకోపంతో ఊగిపోతున్నాయి. అయితే గీతారెడ్డి వర్గీయులు మాత్రం గ్రామీణులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  2009లో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో గీతారెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి రాష్ట్ర సాధనకోసం శ్రమించారనీ, అందువల్లే ఆమె పల్లెల్లో పర్యటించడం సాధ్యం కాలేదని వివరిస్తున్నారు.

 గుర్రుమంటున్న పెల్లె జనం
 తమ ఓట్లతో ఐదేళ్లు అధికారంలో ఉన్న గీతారెడ్డి ఒక్కసారి కూడా తమ గ్రామాలకు రాకపోవడంపై పల్లె జనం గుర్రుగా ఉన్నారు. తమను పట్టించుకోని గీతారెడ్డికి ఓటెందుకు వేయాలో చెప్పమంటున్నారు. ఈ నేపథ్యంలో గీతారెడ్డి ఐదేళ్ల కాలంలో  ఏఏ గ్రామాల్లో పర్యటించారన్న విషయాన్ని ‘సాక్షి’ తన పాఠకులకు వివరించే ప్రయత్నం చేసింది. ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచుల నుంచి సమాచారం సేకరించింది.

వారు తెలిపిన వివరాల ప్రకారం...
 జహీరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిసి మొత్తం 2,33,621 మంది ఓట్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,19,499 మంది కాగా, స్త్రీలు: 1,14,122 మంది ఉన్నారు. గీతారెడ్డి కాలుపెట్టిన గ్రామాల్లో దాదా 65 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. అయితే ఈ గ్రామాల్లో  కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయక ఓటర్లు కూడా బాగానే ఉన్నారు.  రేపు జరుగబోయే ఎన్నికల్లో ఈ ఓటర్ల తీర్పే కీలకం కానుంది.

 నియోజకవర్గ కేంద్రమైన  జహీరాబాద్ మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఆనెగుంట, గుడ్‌పల్లి, ఔరంగ్‌నగర్, మామిడ్గి, బూర్దిపాడ్, గోపన్‌పల్లి, గోవంద్‌పూర్, జాడీమల్కాపూర్, హోతి(కె), మన్నాపూర్, శేఖాపూర్, పర్వతాపూర్, కాశీంపూర్, జీడిగడ్డతండా, ఒంటెలగడ్డ తండా, మధులైతండా, సజ్జారావుపేట తండా, మన్నాపూర్ తండా, రాయిపల్లి తండా, పడియాల్‌తండా, మందగుబ్బడితండా, శేఖాపూర్ తండా, మోడ్ తండా, మల్‌చల్మ తండా, విఠునాయక్‌తండాలకు గీతారెడ్డి ఒక్కసారి కూడా వెళ్లలేదు.

 న్యాల్‌కల్ మండలంలో  31 గ్రామ పంచాయతీలుండగా, తాటిపల్లి, రుక్మాపూర్, మొల్కన్‌పాడ్, హుమ్నాపూర్, ముర్తుజాపూర్, వడ్డి, టేకూర్ గ్రామాలతో మరో 8 గ్రామాల్లో మాజీమంత్రి కాలుకూడా పెట్టలేదు.

 ఝరాసంగం మండలంలో 28 గ్రామపంచాయతీల్లో: అనంత్‌సాగర్, జునెగామ్, ఇస్లాంపూర్, దేవరంపల్లి, జీర్లపల్లి, పోట్‌పల్లి, గినియార్‌పల్లి, చిల్కేపల్లి మేజర్ గ్రామాలతో పాటు 10 చిన్నాచితక గ్రామాలవైపు గీతారెడ్డి మొహం కూడా చూపలేదు.

 కోహీర్ మండలంలో  20 పంచాయతీలుండగా.. కొత్తూర్(కె), ఖానాపూర్, పోతిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి, రాజనెల్లి, గోపినాయక్ తండా, సేడెగుట్టతండా, సిద్ధాపూర్ తండా, లాల్‌సింగ్ తండా తదిరత గ్రామాల్లో గీతారెడ్డి ఒక్కసారి కూడా పర్యటించలేదు.

 మరో 35 గ్రామాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వెళ్లిన గీతారెడ్డి గ్రామంలో పూర్తిగా పర్యటించకుండానే వెనుదిరిగి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement