ప్రతీకాత్మక చిత్రం
సాధారణ ఎన్నికలు లక్ష్యంగా జిల్లాలో టీఆర్‌ఎస్ శరవేగంగా పావులు కదుపుతోంది. అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పరంగా జిల్లాలో అంతా తానై వ్యవహరిస్తున్న మంత్రి హరీశ్‌రావు బహుముఖ వ్యూహంతో సాగుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల అమలు దిశగా అధికారులకు గడువు నిర్దేశిస్తూ, తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేప్రయత్నం చేస్తున్నారు. పూర్వపు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించారు.
–సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికలు లక్ష్యంగా అన్ని రాజకీయ పక్షాల్లోనూ ఎంతో కొంత కదలికలు ప్రారంభమయ్యాయి. పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో మాత్రం ప్రత్యర్థి పార్టీలకు అందనంత వేగంగా అధికార టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పరంగా కేంద్ర బిందువుగా ఉన్న నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, క్షేత్ర స్థాయి లో సభలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. జూలై మొదటి వారంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరై ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకాల అమల తీరుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సర్వసభ్య సమావేశం సమీక్ష సమావేశం రీతిలో జరిగిందనే వ్యాఖ్యలు వినిపించాయి.
జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖలపై సమీక్షకు సమయం సరి పోక పోవడంతో మూడోవారంలో నూతన జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 20న మెదక్ జిల్లా సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రైతుబంధు తదితర పథకాల పురోగతిపై అధికారులకు గడువు నిర్దేశించారు. ఈ నెల 23న సిద్దిపేట జిల్లా సమీక్ష నిర్వహించి, 24న సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. 2018 డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాల్సి ఉండడంతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించి, ఏ నెలలో ఏయే పనులు జరగాలో మంత్రి హరీశ్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలతో బిజీ
ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేసేలా సమీక్షల ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తున్న మంత్రి హరీశ్‌రావు, అమల్లో ఎదురయ్యే సవాళ్లకు తక్షణ పరిష్కారం చూపుతున్నారు. వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో భాగంగా పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో మంజూరైన పనులకు సంబంధించి ప్రారంభ, శంకుస్థాపన కార్యక్రమా లు పెట్టుకోవాల్సిందిగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల మినీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ పథకాలతో ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
అదే సమయంలో విపక్ష పార్టీలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. సొంత పార్టీలో నిర్లక్ష్యానికి గురైనట్లు భావి స్తున్న క్రియాశీల కార్యకర్తలు, నాయకులను సంతృప్తి పరిచేలా సభా వేదికల మీద ప్రాధాన్యత ఇస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో దూరంగా ఉంటున్న నాయకులకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. నియోజకవర్గాల్లో రాజకీయాలను కేవలం ఎమ్మెల్యేలకు వదిలేయకుండా, ద్వితీయ శ్రేణి నాయకులతో నేరుగా సత్సబంధాలు నెరిపే వ్యూహాన్ని మంత్రి అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. నియోజకవర్గాల పర్యటనలో భాగంగా స్థానిక నేతలు అభివృద్ధి పనులకు నిధులు కోరేలా ప్రోత్సహిస్తూ వెంటనే నిధుల మంజూరు ప్రకటన చేస్తున్నారు.
ఎదుటి పార్టీలపై ప్రత్యేక నజర్
నియోజకవర్గ పర్యటనల్లో భాగంగా ఎదుటి పార్టీ కార్యక్రమాలు, ప్రధాన ప్రత్యర్థుల ఎత్తుగడలు, ఆయా పార్టీల్లో ప్రధాన, క్రియాశీల నాయకులు తదితర అంశాలపై మంత్రి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఎదుటి పార్టీల్లో అసంతృప్త నేతలు, రాజ కీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారిపై వివిధ మార్గాల్లో సమాచారం సేకరించి, ప్రత్యర్థి పార్టీల పరిస్థితిపై స్వీయ అంచనాకు వస్తున్నారు. సాధారణ ఎన్నికల నాటికి విపక్ష పార్టీల క్రియాశీల నేతలను పార్టీలోకి తీసుకు రావడం ద్వారా, ప్రత్యర్థి పార్టీల్లో గందరగోళం సృష్టించాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులు కోరుతున్న విపక్ష జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, క్రియాశీల నాయకులకు కూడా తాయిలాలు ప్రకటించడంపై చర్చ జరుగుతోంది.
జహీరాబాద్‌లో ‘స్పెషల్ టీం మకాం’
వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్‌ను కైవసం చేసుకో వడం లక్ష్యంగా ముందస్తు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో వలసలు లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై మంత్రి ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ యంత్రాంగం అంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో పాత, కొత్త నేతల నడుమ సమన్వయం కోసం ‘ప్రత్యేక బృందాన్ని’ పంపించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్లు పట్లోళ్ల నరహరిరెడ్డి, చంద్రాగౌడ్, సంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, గిరిజన నాయకుడు రవీందర్ నాయక్ తదితరులతో కూడిన బృందం జహీరాబాద్ పట్టణంతో పాటు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తోంది. స్థానిక నేతలను సమన్వయం చేస్తూ పట్టణ, గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడం, పార్టీ జెండాల ఆవిష్కరణతో ఎన్నికల వాతావరణం నెలకొంది. సాధారణ ఎన్నికలకు మంత్రి హరీశ్ అనుసరిస్తున్న ముందస్తు వ్యూహం ఎంత మేర ఫలితాన్నిస్తుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment