గిరిజనుల దరిచేరని సంక్షేమ పథకాలు | welfare schemes are not reached to Tribal | Sakshi
Sakshi News home page

గిరిజనుల దరిచేరని సంక్షేమ పథకాలు

Published Sun, Dec 22 2013 1:04 AM | Last Updated on Mon, May 28 2018 1:49 PM

welfare schemes are not reached to Tribal

జహీరాబాద్  టౌన్,న్యూస్‌లైన్: మధ్యదళారుల వల్ల ప్రభుత్వ పథకాలు గిరిజనుల దరి చేరడంలేదని భారీ పరిశ్రమల శాఖా మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం తెలంగాణ గిరిజన గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు  మంత్రి గీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయన్నారు. తాను గిరిజన సంక్షేమం కోసం ఎంతో కృషి చేసినా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సానుభూతిపరులు గెలవకపోవడం విచారకరమన్నారు. భవిష్యత్‌లో గిరిజన సంక్షేమం కోసం మరింత కృషిచేస్తాన్నారు.
 రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలి
 రాజకీయాలను శాసించే స్థాయికి గిరిజ నులు ఎదగాలని మాజీ మంత్రి రవీంద్రనాయక్ పిలుపు నిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వల్ల గిరిజనులు  న్యాయం జరిగిందన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుందన్నారు. వీరిద్దికి గిరిజనులు ఎంతగానో రుణపడి ఉంటారన్నారు. అనేక కారణాల వల్ల గిరిజనులు ప్రగతికి దూరంగా ఉన్నారన్నారు.తెలంగాణలో 15 వేల గిరిజన తండాలు ఉన్నాయని, తండాలన్నీ అభివృద్ధి చెందిననాడే తెలంగాణకు సార్థకత ఉంటుందన్నారు. పేదరికం వల్ల గిరిజనులు ఆడపిల్లలను విక్రయిస్తున్నారని ఇది చాలా దారుణమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చెర్మైన్ జైపాల్‌రెడ్డి, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెహ్రూ నాయక్, టీ బెస్ జిల్లా అధ్యక్షుడు తులసీరాం రాథోడ్, గిరిజన నాయకులు కిషన్.పవార్, శంకర్ నాయక్, కరాటెరాజు, తెలంగాణ గిరి జన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ రాథోడ్, కాంగ్రెస్ నాయకులు మంకాల్ సుభాష్,కండెం నర్సింలు పాల్గొన్నారు.
 తండాల్లో మౌలిక వసతులు కల్పించాలి
 సంగారెడ్డి మున్సిపాలిటీ: గిరిజన తండాల్లో మౌలిక వసతులు కల్పించాలని గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని రవీందర్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఐబీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1965లో గిరిజనులను ట్రైబల్స్‌గా గుర్తించి ఇందిరాగాంధీ వారి అభివృద్ధికి 11 రకాల బోర్డులను ఏర్పాటు చేసిందన్నారు.  స్వయం ఉపాధి, శిక్షణ, మార్కెటింగ్ విధానంలో శిక్షణ ఇస్తూ రుణ సదుపాయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన గిరిజన అభివృద్ధి సంస్థ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్, కాఫీ కార్పొరేషన్, ట్రైకాన్, ట్రైఫెయిడ్ వంటి పలు కార్యక్రమాలను రూపొందించారని అయితే ఇవి అమలుకు నోచుకోలేదన్నారు.

 కేంద్ర ప్రభుత్వం ఏడున్నర శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నా ఒకటిన్నర శాతం మాత్రమే అమలవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 8 శాతం రిజర్వేషన్ కల్పిస్తే కేవలం రెండు శాతమే అమలవుతోందని, దీంతో  గిరిజనుల ఉద్యోగాలను ఇతర వర్గాలు పొందాయన్నారు. పాలకుల అసమర్ధత వల్లనే నేటికి గిరిజన తండాల్లో శిశువిక్రయాలు జరుగుతున్నాయన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపిచంద్, కోఆర్డినేటర్ హరిసింగ్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్, ఇతర సంఘాల నాయకులు రాజేందర్ నాయక్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement