రైతుహితమే లక్ష్యం | to target rythu hitha conference | Sakshi
Sakshi News home page

రైతుహితమే లక్ష్యం

Published Tue, Jan 7 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM

to target rythu hitha conference

నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున రైతులు రబీలో ఆరుతడి  పంటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. నారాయణఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్‌హాలులో మంగళవారం నియోజకవర్గ రైతులకు ‘రైతుహిత’ సదస్సు ద్వారా పంటల సాగుపై అవగాహన కల్పించారు. 

ఈ సదస్సుకు హాజరైన జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, రైతులంతా వరిసాగుపై దృష్టి సారించకుండా, నీటి లభ్యత, విద్యుత్ సరఫరాను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న పంటలను అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బోర్లు తవ్వించే రైతులు కూడా భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకుని బోర్లు వేసేందుకు ప్రయత్నించాలన్నారు. లేకపోతే బోర్లు తవ్వినా నీరుపడక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు.

 రైతులు సాగులో అధునాతన పద్ధతులు పాటించేలా చూసేందుకే ‘రైతుహిత’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందేలా చూస్తామన్నారు. సాగులో రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకే ’రైతుహిత’ ముఖ్య ఉద్దేశమన్నారు. ఖేడ్ ప్రాంతంలో వలసల నివారణకు ఈజీఎస్‌లో పనులు కల్పిస్తున్నట్టు తెలిపారు. జలప్రభ పథకం ద్వారా 6,500 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన 16వేల హెక్టార్ల భూమిని సాగులోకి తెచ్చేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. రబీ సీజన్‌లో ఖేడ్ నియోజకవర్గ రైతులకు బ్యాంకర్ల ద్వారా రూ.20 కోట్ల వరకు పంట రుణాలను అందించామనీ, వీటిని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు.

 మార్కెట్ యార్డుకు కృషి
 జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ,  ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని పార్లమెంట్‌లో ప్రశ్నించానన్నారు. రైతుల కృషితోనే దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయన్నారు. నారాయణఖేడ్‌లో మార్కెట్ యార్డు, ఉల్లి, టమాటలకు కోల్డ్‌స్టోరేజీలకు కృషి చేస్తామన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మాట్లాడుతూ, ఖేడ్ నియోజకవర్గంలో పరిశ్రమలు లేవనీ, అందువల్లే అందరూ వ్యవసాయంపైనే ఆధారపడ్డారన్నారు. భూగర్భ జలాలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో రైతులు అధికంగా వర్షాధార పంటలపై ఆధారపడి ఉన్నారన్నారు. అంతకుముందు వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శించిన స్టాల్స్‌లను కలెక్టర్ పరిశీలించారు.

రైతులు, అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావ్‌షెట్కార్, అగ్రికల్చర్ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఆర్డీఓ ధర్మారావు, హార్టికల్చర్ ఏడీ శేఖర్, సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ వీరారెడ్డి, ఏడీఏ ప్రసాద్, ఏఓ శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ భాస్కర్, మాజీ జెడ్పీటీసీ సంజీవ్‌రెడ్డి, రషీద్, కాంగ్రెస్ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, శంకరయ్యస్వామి, సుధాకర్‌రెడ్డి, సంగారెడ్డి, భోజిరెడ్డి,మాణిక్‌రెడ్డి, తాహెర్, వినోద్‌పాటిల్, పండరిరెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement